Aluru Gayatri: దయచేసి వినండి.. ఆ గొంతు నాదే

‘దయచేసి వినండి.. రైలు నంబరు..’ అంటూ సాగే రైల్‌ అనౌన్స్‌మెంట్‌ వినని వారుండరు! తెలుగే కాదు.. పక్కరాష్ట్రాల్లోనూ ఆమె గొంతు ఎందరికో సుపరిచితం.

Updated : 27 Feb 2023 12:49 IST

‘దయచేసి వినండి.. రైలు నంబరు..’ అంటూ సాగే రైల్‌ అనౌన్స్‌మెంట్‌ వినని వారుండరు! తెలుగే కాదు.. పక్కరాష్ట్రాల్లోనూ ఆమె గొంతు ఎందరికో సుపరిచితం. అంతేనా.. తెలుగు లోగిళ్లలో ఆదరణ పొందుతున్న ఎన్నో సినీ, టీవీ పాత్రల స్వరం కూడా ఆమెదే! దశాబ్దాలుగా అందరినీ అలరిస్తోన్న ఆ తీయని గొంతుక ఎవరిదో తెలుసా? ఆలూరు గాయత్రి.. ఆవిడని వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా!

మాది హైదరాబాద్‌. నాన్న ఆనంద మోహన్‌ ఉద్యోగరీత్యా కొన్నేళ్లు దిల్లీలో ఉన్నాం. ఆయన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫీస్‌లో పని చేసేవారు. అమ్మ ప్రభావతికి శాస్త్రీయ సంగీతంలో పట్టుంది. శిక్షణా ఇచ్చేది. ఆవిడ వద్దే నేనూ నేర్చుకున్నా. నా స్వరం బాగుంటుందని అందరూ అంటోంటే న్యూస్‌రీడర్‌ అవ్వాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేశా కూడా. నాన్న పదవీ విరమణతో 1993లో హైదరాబాద్‌కు తిరిగొచ్చాం. వీణలో బీఏ, ఎంఏలో తెలుగుతోపాటు ప్రముఖ విద్వాంసులు ఈమని శంకరశాస్త్రి వద్ద వీణ, గజల్స్‌, కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలూ నేర్చుకున్నా. కొన్ని ఆల్బమ్స్‌, జింగిల్స్‌ కూడా పాడా. బంధువుల సిఫారసుతో తొలిసారి ఓ ప్రకటనకు గాత్రదానం చేశా. దాంతో దూరదర్శన్‌ సీరియల్స్‌లో డబ్బింగ్‌ అవకాశమొచ్చింది. ఆపై ఈటీవీలో.. సుమన్‌ గారితో పనిచేసే వీలు దక్కింది. ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అగ్నిగుండం, కురుక్షేత్రం, కళంకిత, చదరంగం, అంతఃపురం, పద్మవ్యూహం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సీరియల్స్‌లో పాత్రలకి గాత్రదానం చేశా.

అలా అవకాశం..

దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేస్టేషన్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేవాళ్లు కావాలని నేను డబ్బింగ్‌ చెప్పే స్టూడియోలో అడిగారట. నాకు హిందీ వచ్చు కదాని వాళ్లు నాపేరు సూచించారు. అలా 2005 నుంచి నా గాత్రం రైల్వేస్టేషన్లలో వినపడటం మొదలైంది. ఆంధ్రా, తెలంగాణే కాదు.. బిహార్‌, తమిళనాడు.. ఇలా ఇతర రాష్ట్రాల్లోనూ నా గొంతు వినిపించేది. తెలుగు, హిందీ, ఆంగ్లం మూడు భాషల్లోనూ చెప్పా. చెన్నై నుంచి వచ్చేటప్పుడు స్టేషన్లో నా గొంతు నేనే వింటోంటే గమ్మత్తుగా ఉండేది. ఈటీవీనే కాదు ఇతర ఛానెళ్లకీ పనిచేశా. వేల ఎపిసోడ్స్‌కి గాత్రదానమిచ్చా. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రకటనలే కాదు కొన్ని ప్రభుత్వ పథకాల డాక్యుమెంటరీల్లోనూ నా గొంతు వినిపిస్తుంది. నేను వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఒక ట్రావెలర్‌ ప్రోగ్రామ్‌ 15 ఏళ్లు ప్రసారమైంది. హిందీ నుంచి తెలుగులోకి 20కిపైగా సినిమాలు, సీరియల్స్‌ స్క్రిప్టులను తర్జుమా చేశా. యానిమేటెడ్‌ సీరీస్‌.. 200 చందమామ కథలకు గొంతునిచ్చా.

ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు, రాజమౌళి, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకుల చిత్రాలకు పనిచేశా. మీనా, సంఘవి, అనూహాసన్‌, భావన, అశ్విని, సనా, కస్తూరి తదితరులకు గాత్రమిచ్చా. ప్రస్తుతం ప్రసారమవుతున్న పది సీరియల్స్‌లో ప్రధాన పాత్రలది నా గొంతే! డబ్బింగ్‌ చెప్పేప్పుడు తెలియకుండానే పాత్రల్లో లీనమైపోతుంటా. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తా కూడా. తరిగొండ వెంగమాంబ సీరియల్‌లో భర్త చనిపోయే సీన్‌కు పనిచేసినప్పుడు ఇంటికొచ్చి చాలాసేపు ఏడ్చా. మూడు దశాబ్దాల ప్రయాణం. 2007లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది సహా ఎన్నో పురస్కారాలూ వరించాయి. ఇదంతా ఇంట్లోవాళ్లు, మావారు సంతోష్‌ కుమార్‌ ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. మాకో పాప.. సాయి సౌమ్య. తనకు ఆరు నెలలు వచ్చేంత వరకే విరామం తీసుకున్నా. తర్వాత కొనసాగించినా పాపకి ఎలాంటి ఇబ్బంది రానివ్వలేదు. తను స్కూలు నుంచి ఇంటికొచ్చే సరికి నా పని ముగించుకునేదాన్ని. అలా సమన్వయం చేసుకున్నా కాబట్టే.. ఇన్నేళ్లైనా ఆనందంగా కొనసాగించగలుగుతున్నా.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్