‘కొత్త’దనం కోరుకున్నారు.. కోట్లు గడిస్తున్నారు!

‘లక్ష్యానికి దగ్గర దారులుండవు.. దాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమ పడాలి.. మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాలి..’ ఇదే విషయం నిరూపిస్తున్నారు కొందరు మహిళా వ్యాపారవేత్తలు. తమ ఆసక్తులకు పదును పెట్టి విజయం సాధించడమే కాదు.. సమాజాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ సృజనాత్మకతతో కొత్త కొత్త వ్యాపారాల్ని....

Published : 08 Nov 2022 13:09 IST

‘లక్ష్యానికి దగ్గర దారులుండవు.. దాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమ పడాలి.. మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాలి..’ ఇదే విషయం నిరూపిస్తున్నారు కొందరు మహిళా వ్యాపారవేత్తలు. తమ ఆసక్తులకు పదును పెట్టి విజయం సాధించడమే కాదు.. సమాజాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ సృజనాత్మకతతో కొత్త కొత్త వ్యాపారాల్ని ప్రారంభించి కోట్లకు పడగెత్తుతున్నారు.. ఇతర మహిళలకూ ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇలాంటి మహిళా వ్యాపారవేత్తల్ని, వారి సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘అటల్ ఇన్నొవేషన్ మిషన్‌’కు రూపకల్పన చేసింది. ఈ క్రమంలోనే ‘ఇన్నొవేషన్ ఫర్‌ యు’ పేరుతో ఓ కాఫీ టేబుల్‌ బుక్‌ని ఇటీవలే విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు మహిళా వ్యాపారవేత్తలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? వాళ్ల స్టార్టప్‌/వ్యాపార విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

వ్యాపారం.. ఈతరం మహిళల ఆర్థిక మంత్రంగా మారిపోయింది. తమ సృజనాత్మక ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ కొత్త కొత్త అంకుర సంస్థలకు బీజం వేయడం, పలు సవాళ్లను ఎదుర్కొంటూ వ్యాపారాల్ని లాభాల బాట పట్టించడంలో వీరు సక్సెసవుతున్నారు. ఇలాంటి మహిళల్ని, వారి ఆలోచనల్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది మహిళా వ్యాపారవేత్తల విజయగాథల్ని ఓ కాఫీ టేబుల్ బుక్‌గా మన ముందుకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 75 మందితో కూడిన ఈ పుస్తకంలో ఐదుగురు తెలుగు మహిళలున్నారు.


ఆమె యంత్రాలు రైతుల కోసం..!

స్వదేశంలో చదువుకొని కెరీర్‌ ఉన్నతి కోసం విదేశాల బాట పట్టే వారే ఎక్కువ. కానీ తన చదువు తన దేశాభివృద్ధికే ఉపయోగపడాలని నిర్ణయించుకుంది హైదరాబాద్‌కు చెందిన సంతోషి సుష్మ బుద్ధిరాజు. వారణాసి ఐఐటీలో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆమెకు.. జార్జియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశమొచ్చింది. ఆపై విదేశాల్లో ఉన్నత చదువుల కోసం బోలెడన్ని అవకాశాలు, ఉద్యోగావకాశాలు వచ్చినా కాదని.. తన ప్రతిభతో దేశాభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంది. ఈ క్రమంలోనే వినూత్నంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనే ‘ఆటోక్రసీ మెషినరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే అంకుర సంస్థకు బీజం వేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగాలకు వివిధ యంత్రాలను తయారుచేసి అందించడం ఈ సంస్థ విధి. వీటి డిజైన్‌, తయారీలో వాడే మెటీరియల్‌.. ఇక్కడి భూసార పరిస్థితులకు తగ్గట్లుగా ఉండేలా చూసుకుంటోందామె. ఇలా ఆమె తయారుచేస్తోన్న మెషినరీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. భారీ ఎత్తున చేపట్టే కేబుల్స్‌, డ్రైనేజీ, నీటిపారుదల, పైప్‌లైన్‌ వ్యవస్థలు.. వంటి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నారు.

‘ఒక పంట చేతికి రావాలంటే మొక్కలు నాటడం, కలుపు తీయడం, నీళ్లు పట్టడం.. ఇలా ఎన్నో దశలు దాటాలి. భారీ ఎత్తున పండించే పంటల కోసం ప్రస్తుతం వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా చాలామంది రైతులు వివిధ కారణాల రీత్యా వాటిని పొందలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం చొరవ చూపి వాటిని కొనుగోలు చేసి.. తక్కువ ధరకే రైతులకు లీజుకివ్వడం వల్ల ఫలితం ఉంటుంది..’ అంటోంది సంతోషి. గతంలో ‘డెలివరీ అంకుల్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్‌ చేసుకునే వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె అందులోనూ విజయం సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహించే ‘స్టాన్‌ఫోర్డ్‌ సీడ్‌ స్పార్క్‌’ అనే కార్యక్రమానికి ఎంపికైన సంతోషి.. ‘TiE Hyderabad investment pitch’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది. ఇక కరోనా సమయంలో తన సంస్థ ద్వారా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ని కూడా తయారుచేసిందీ బిజినెస్‌ వుమన్.


ఆ సవాళ్లపై ‘గరుడాస్త్రం’!

నిఘా, పర్యవేక్షణ, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ.. ఇలా మనిషి చేసే ప్రతి పనీ చేసేందుకు వీలుగా ప్రస్తుతం మానవ రహిత డ్రోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి డ్రోన్లను వివిధ రంగాలకు అనుగుణంగా తయారుచేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది హైదరాబాద్‌కు చెందిన శ్వేతా గెల్లా. ఈ క్రమంలోనే 2019లో ‘గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్‌ సొల్యూషన్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారామె. తన సంస్థ ద్వారా ఏరియల్‌ మ్యాపింగ్‌, సర్వే, నిఘా, మైనింగ్‌, వ్యవసాయం, అటవీ, నిర్మాణ, మీడియా రంగాల్లో పెరుగుతోన్న డిమాండ్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో డ్రోన్ల రూపకల్పన చేస్తున్నారామె. అలాగే అంతరిక్షం, రక్షణ, ఆటోమోటివ్‌, నిర్మాణ, సముద్ర రంగాల్లో సవాళ్లను ఎదుర్కొనేలా.. రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ టెక్నాలజీతో అనుసంధానమైన డ్రోన్‌ సేవల్నీ వినియోగదారులకు చేరువ చేస్తోంది. అంతరిక్షంపై మక్కువతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె.. ఎనిమిదేళ్ల పాటు హైదరాబాద్‌ దుండిగల్‌లోని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌’ కళాశాలలో ఫ్యాకల్టీగా కొనసాగారు. ‘2020:DSIR-PRISM Scheme’కు ఎంపికైంది శ్వేత. వ్యాపారాభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా నగదు సహాయం అందించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం.


‘ప్లాస్టిక్‌’పై యుద్ధం ప్రకటించి..!

పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తోంది ప్లాస్టిక్‌ భూతం. ఏటా 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయని, ఇవి ఈ ప్రపంచ జనాభా బరువుకు దాదాపు సమానమని గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల మనతో పాటు ఇతర జీవులకూ ప్రమాదం వాటిల్లుతుంది. ఈ ముప్పును తప్పించాలని కంకణం కట్టుకుంది హైదరాబాద్‌కు చెందిన ప్రతిభా భారతి. ‘నేచర్స్‌ బయోప్లాస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు శ్రీకారం చుట్టి ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించింది. పర్యావరణహితమైన బ్యాగులు తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. దుస్తుల ప్యాకింగ్‌ దగ్గర్నుంచి నిత్యావసర వస్తువులు, షాపింగ్‌.. ఇలా ప్రతి పని కోసం వినియోగించే బ్యాగ్స్‌, ర్యాపింగ్‌ కవర్స్‌, ఆఖరికి చెత్త కోసం వినియోగించే బ్యాగ్స్‌ కూడా పర్యావరణహితమైనవే తయారుచేస్తోందామె. ప్రస్తుతం తన ఉత్పత్తుల్ని చిల్లర వ్యాపారులు, హోటళ్లు, ఉద్యానవన పరిశ్రమలకు సరఫరా చేస్తోంది ప్రతిభ. ఇలా తన కృషికి గుర్తింపుగా ‘కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి’, ‘సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ సంస్థల నుంచి సర్టిఫికెట్లు అందుకుందీ ఎకో లవర్.


గాలిని శుద్ధి చేయడమే లక్ష్యంగా..!

గదుల్లోకి గాలి ఎంత ధారాళంగా ప్రవహిస్తే.. అందులోని వాతావరణం అంత శుభ్రంగా ఉంటుంది. కానీ ఆస్పత్రుల్లో ఐసీయూలు, ఐసోలేషన్‌ వార్డులు, బర్న్‌ వార్డులు.. వంటి గదులు పూర్తిగా మూసి ఉంటాయి. అలాంటి గదుల్లో బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మ క్రిముల్ని తొలగించడానికి గాలిని శుద్ధి చేసే పరికరాల్ని తయారుచేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి శిరీష. ఇందుకోసమే తన భర్తతో కలిసి ‘నియో ఇన్వెంట్రోనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థను స్థాపించారామె. కొన్ని రకాల స్టెరిలైజర్లు, శానిటైజర్ల వల్ల క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండచ్చని, తాము తయారుచేసే పరికరాలు/ఉత్పత్తులతో ఈ ప్రమాదం ఉండదని చెబుతున్నారు శ్రీవల్లి. ఇక కరోనా సమయంలోనూ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా జెర్మీబ్యాన్‌ స్టెరిలైజర్‌ను రూపొందించారీ దంపతులు. అతినీలలోహిత కిరణాల్ని ఉపయోగించి క్షణాల్లో వైరస్‌ను అంతమొందించే సామర్థ్యమున్న ఈ పరికరానికి సీసీఎంబీ కూడా ఆమోద ముద్ర వేసింది. తన సంస్థ ద్వారా ఆరోగ్య ఉత్పత్తుల్ని రూపొందించడమే కాదు.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ సమాజాభివృద్ధికీ పాటుపడుతున్నారు శ్రీవల్లి. ఇలా తన కృషికి గుర్తింపుగా గతేడాది ‘గో గ్లోబల్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘ఫ్రంట్‌ రన్నర్‌ అవార్డు’ కూడా అందుకున్నారామె.

వీరితో పాటు తెలంగాణకు చెందిన శృతి రెడ్డి కూడా ఈ కాఫీ టేబుల్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. ‘అంత్యేష్టి ఫ్యునరల్‌ సర్వీసెస్‌’ పేరుతో బెంగళూరులో ఓ స్టార్టప్‌ నడుపుతోన్న ఆమె.. ఈ వేదికగా అంతిమ సంస్కారాలకు సంబంధించిన సేవల్ని అందిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు.. అవయవ దానం పైనా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్