కడుపులో ఉన్న బిడ్డ కోసం.. క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది!

అమ్మో క్యాన్సరా! ‘క్యాన్సర్’ అన్న మాట వినగానే భయమే మనల్ని సగం చంపేస్తుంది. కానీ గుండె ధైర్యం, నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే ఈ ప్రాణాంతక మహమ్మారిని కూడా జయించచ్చని నిరూపించారు కొందరు మహిళలు. మహారాష్ట్రకు చెందిన దీపికా పాటిల్‌ గోప్‌నారాయణ్‌ కథ ఇంతకు పదింతలు ఎక్కువ! ఎందుకంటే సాధారణంగానే క్యాన్సర్‌ను.....

Updated : 14 Nov 2022 21:06 IST

(Images for Representation)

అమ్మో క్యాన్సరా! ‘క్యాన్సర్’ అన్న మాట వినగానే భయమే మనల్ని సగం చంపేస్తుంది. కానీ గుండె ధైర్యం, నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే ఈ ప్రాణాంతక మహమ్మారిని కూడా జయించచ్చని నిరూపించారు కొందరు మహిళలు. మహారాష్ట్రకు చెందిన దీపికా పాటిల్‌ గోప్‌నారాయణ్‌ కథ ఇంతకు పదింతలు ఎక్కువ! ఎందుకంటే సాధారణంగానే క్యాన్సర్‌ను జయించడం పునర్జన్మగా భావిస్తాం. అలాంటిది నిండు గర్భిణిగా ఉండి కూడా మొండి ధైర్యంతో ఈ వ్యాధిని ఓడించిందామె. ఓవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెడుతూనే.. మరోవైపు కీమో, రేడియో థెరపీల వల్ల కలిగే బాధను దిగమింగింది దీపిక. ఈ ప్రతికూలతల నడుమే పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. ‘నేను క్యాన్సర్‌ను జయించానని అందరూ అంటున్నారు.. కానీ నా బిడ్డ కోసం విధితో నేను చేసిన యుద్ధమిది..’ అంటూ సామాజిక మాధ్యమాలలో దీపిక పంచుకున్న కథ ఎంతోమందికి క్యాన్సర్‌ బాధితులకు ఊరట!

అన్నీ అరచేతిలో ఉంటే అది జీవితమెందుకవుతుంది..? ఈ జీవిత సత్యాన్ని నేను కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. మాది మహారాష్ట్రలోని జల్‌గావ్‌ అనే ప్రాంతం. ప్రాథమిక విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేసినా.. పైచదువుల కోసం ముంబయి వెళ్లాల్సి వచ్చింది. కొత్త ఊరు, కొత్త అవకాశాలు.. జీవితమంతా సంతృప్తిగా సాగుతోందనిపించింది.

ఆరో నెలలో.. వ్యాధి బయటపడింది!

ఈ సంతోష సమయంలోనే సుగాత్‌తో నాకు పరిచయమైంది. అప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరం.. అతడు ఫైనలియర్‌. తక్కువ సమయంలోనే మంచి స్నేహితులమయ్యాం. డిగ్రీ పూర్తయ్యాక తను పుణే వెళ్లిపోయినా.. మా స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. కొన్నాళ్లకు అర్థమైంది.. ఇద్దరం ప్రేమలో ఉన్నామని! ఈ విషయం ఇరు కుటుంబాల్లో చెప్పాం.. వాళ్ల అంగీకారంతోనే 2015లో ఏడడుగులు నడిచాం. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మా జీవితాల్లోకి ఓ చిన్నారి రాబోతున్నాడన్న సంతోషం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నేను గర్భిణినన్న విషయం తెలిశాక సుగాత్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆనందంలోనే ఆరు నెలలు ఆరు క్షణాల్లా గడిచిపోయాయి. అయితే నాకు ముందు నుంచే మధ్యమధ్యలో రొమ్ములు పరీక్షించుకోవడం అలవాటు. ఆరో నెల ప్రెగ్నెన్సీ సమయంలోనూ అలాగే చేసుకున్నా. ఈ క్రమంలో ఎడమవైపు రొమ్ములో చిన్న గడ్డ తగిలే సరికి ఒక్కసారిగా షాక్‌ తిన్నా. వెంటనే సుగాత్‌, నేను ఆస్పత్రికి పరిగెత్తాం. మా భయమే నిజమైంది. వివిధ పరీక్షల అనంతరం అది రొమ్ము క్యాన్సరే అని వైద్యులు తేల్చారు. (3 వేల మంది గర్భిణుల్లో ఒకరికి వచ్చే ఈ అరుదైన క్యాన్సర్‌ని ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ - PABC అంటారు.)

3 నెలల్లో.. 12 సార్లు కీమోథెరపీ!

కొన్ని వారాల్లోనే గడ్డ 1 సెం.మీ. నుంచి 5 సెం.మీ. పెరిగినట్లు నిర్ధారణకు వచ్చారు వైద్యులు. ఓవైపు ఈ పరీక్షలన్నీ జరుగుతుంటే.. నాకేమో నా కడుపులో ఉన్న బిడ్డ గురించి భయమేసింది. ఇక నా మనసులో తలెత్తిన సందేహాలు, ప్రశ్నలకు లెక్కే లేదు. ‘నిజానికి మా కుటుంబంలో ఎవరికీ ఈ సమస్య లేదు.. అలాగని నాకు అనారోగ్యకరమైన అలవాట్లూ లేవు. అలాంటిది నేను రొమ్ము క్యాన్సర్‌ బారిన పడడమేంటి?’ అన్న ఆలోచనల్లోనే మునిగిపోయా. ఇక ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సుగాత్‌ నాకు అండగా నిలిచాడు. మొండిగా క్యాన్సర్‌ మహమ్మారిని జయించే గుండె ధైర్యాన్నిచ్చాడు. ఇక క్యాన్సర్‌కు చికిత్స మొదలైంది. తొమ్మిది నెలలు నిండే సరికి 12 కీమోథెరపీ సెషన్లు పూర్తయ్యాయి. ప్రతిసారీ తీవ్రమైన నొప్పి బాధించేది. అయినా ఈ చికిత్సల వల్ల నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎలాంటి అపాయమూ కలగకూడదని ఆ భగవంతుడిని ప్రార్థించేదాన్ని. అలాగే థెరపీల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చక్కటి పోషకాహారం కూడా తీసుకున్నా. అప్పటికే నేను డైటీషియన్‌ కోర్సు పూర్తి చేయడంతో.. ఏ అనారోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయంలో పూర్తి స్పష్టత ఉంది. ఈ క్రమంలో పండ్లు, పప్పన్నం.. వంటివి ఎక్కువగా తీసుకున్నా. ఇక నాకు ఐస్‌క్రీమ్స్‌, కప్కేక్స్‌, ప్యాన్‌కేక్స్‌.. వంటి బయటి ఫుడ్‌ తినాలనిపించినప్పుడల్లా సుగాతే స్వయంగా చేసిపెట్టేవాడు.

కొవిడ్‌ ఉన్నా.. సిజేరియన్ వద్దన్నా!

ఇలా అసలే నేను క్యాన్సర్‌ చికిత్సలతో సతమతమవుతుంటే.. పుండు మీద కారం చల్లినట్లు కొవిడ్‌ నాకు నరకమంటే ఏంటో చూపించింది. ప్రసవ తేదీ దగ్గర పడుతుందన్న సమయంలోనే నేను కొవిడ్‌ బారిన పడ్డా. ఆ సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి వేధించింది. దీన్ని నేను గుండెపోటుగా పొరపడ్డా. కానీ డాక్టర్లు నాకు కొవిడ్‌ సోకిందని నిర్ధారణ చేశారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా సిజేరియన్‌ డెలివరీని ఎంచుకుంటారు. కానీ నాకు ఇది ఎంతమాత్రమూ ఇష్టం లేదు. 40 గంటలు ప్రసవ వేదన అనుభవించి మరీ నా కొడుకు స్వరాజ్‌ను ఈ లోకంలోకి తీసుకొచ్చా. వాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు నిర్ధారించడంతో మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక బాబు పుట్టాక కూడా మరో నాలుగు కీమోథెరపీ సెషన్లు జరిగాయి.. ఆపై మ్యాస్టెక్టమీ చేసి క్యాన్సర్‌ కణతిని తొలగించారు. అదే సమయంలో బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ కూడా చేశారు. నా క్యాన్సర్‌ చికిత్సల వల్ల అమ్మతనంలో నేను పొందలేకపోయిన అనుభూతి ఒకే ఒక్కటి.. అదే నా బిడ్డకు చనుబాలివ్వకపోవడం.

అందుకే.. ఈ పుస్తకం!

ప్రస్తుతం నేను క్యాన్సర్‌ నుంచి బయటపడ్డా.. అయినా అది తిరిగి రాకుండా నా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకున్నా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా.. నిపుణుల సలహా మేరకు వ్యాయామాలు చేస్తున్నా.. మరోవైపు నా బిడ్డకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. గత మూడేళ్లు నా జీవితంలో ఎంతో కఠినంగా గడిచాయి. దీన్ని బట్టి జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోవద్దనే విషయం నాకు అర్థమైంది. అందుకే ఆ అనుభవాల్ని, ఆ సమస్యల్ని నేను ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తుతం ఓ పుస్తకంగా తీసుకురావాలనుకుంటు న్నాం. తద్వారా ఇతర క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపడానికే ఈ చిరు ప్రయత్నం. నేను క్యాన్సర్‌ను జయించానని అందరూ అంటున్నారు.. కానీ నా బిడ్డ కోసం విధితో నేను చేసిన యుద్ధమిది..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్