‘పింక్‌ ఐ’ గురించి తెలుసా?

సాధారణంగా మేకప్‌ వేసుకునే క్రమంలో కంటికి సంబంధించిన మేకప్‌ ఉత్పత్తుల్లోని అవశేషాలు, రసాయనాలు కంటి ఉపరితలంపై పేరుకుపోతాయి. ఇక రాత్రి పూట కూడా దాన్ని తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది....

Published : 20 May 2024 12:42 IST

సాధారణంగా మేకప్‌ వేసుకునే క్రమంలో కంటికి సంబంధించిన మేకప్‌ ఉత్పత్తుల్లోని అవశేషాలు, రసాయనాలు కంటి ఉపరితలంపై పేరుకుపోతాయి. ఇక రాత్రి పూట కూడా దాన్ని తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇది అప్పటికప్పుడు ప్రతికూల ప్రభావం చూపకపోయినా కొన్ని రోజుల తర్వాత కళ్లలో దురద, ఎరుపెక్కడం.. వంటి కంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అంతేకాదు.. దీర్ఘకాలంలో ఇది ‘పింక్‌ ఐ’ (కంటి చుట్టూ వాపు/ఇన్ఫెక్షన్‌ రావడం) సమస్యకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. కాబట్టి కళ్లకు మేకప్‌ ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే పడుకునే ముందు ఐ మేకప్ తొలగించుకోవాలి.

కళ్లలోకి వెళ్లకుండా..
కంటికి మేకప్‌ వేసుకోవడానికే కాదు.. తొలగించడానికీ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటితో పని లేకుండా ఇంట్లోనే సులభంగా కంటి మేకప్‌ను తొలగించుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
* సాధారణ మేకప్‌ను తొలగించుకునేందుకు ఉపయోగించే కొబ్బరి నూనె కంటి మేకప్‌ను తొలగించడానికీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కాటన్‌ ప్యాడ్‌పై కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి.. దాన్ని కనురెప్పలు, కంటి చుట్టూ ఉండే చర్మంపై నెమ్మదిగా రుద్దుతూ మేకప్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనురెప్పల వద్ద కాటన్‌ స్వాబ్‌ను ఉపయోగిస్తే.. మేకప్‌ కంటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.
* జెల్‌/పౌడర్‌/క్రీమ్‌ ఆధారిత మేకప్‌ ఉత్పత్తుల్ని పూర్తిగా తొలగించడంలో పెట్రోలియం జెల్లీది కీలక పాత్ర. ఈ క్రమంలో కొద్దిగా జెల్లీని కంటి చుట్టూ అప్లై చేసి.. చూపుడు వేలితో గుండ్రంగా రుద్దుతూ మేకప్‌ను తొలగించుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్‌ బాల్‌తో ఆ ప్రదేశంలో తుడిచేస్తే సరిపోతుంది.

* కొద్దిగా బేబీ ఆయిల్‌ను కాటన్‌ ప్యాడ్‌పై వేసి.. దాంతో కళ్ల చుట్టూ నెమ్మదిగా, గుండ్రంగా రుద్దుతూ కూడా మేకప్‌ను సులభంగా తొలగించుకోవచ్చు.
* కనురెప్పలకు అప్లై చేసుకున్న మస్కారాను తొలగించుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాటన్‌ స్వాబ్‌ను కొబ్బరి నూనె/బేబీ ఆయిల్‌లో ముంచి.. దాంతో మస్కారా అప్లై చేసుకున్నట్లుగా కింది నుంచి పై దిశగా మేకప్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మస్కారా పూర్తిగా తొలగిపోవడంతో పాటు కంట్లోకి వెళ్లకుండా కూడా ఉంటుంది.
* మేకప్‌ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోయినా కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే వాటిని వాడిన ప్రతిసారీ బేబీ వాష్‌, లిక్విడ్‌ సోప్‌తో శుభ్రం చేసి.. పొడిగా ఆరబెట్టాలి. ఇక వాటి బ్రిజిల్స్‌ పాతబడిపోతే.. వెంటనే మార్చేయడం లేదంటే కొత్త బ్రష్‌లను కొనడం మంచిది.
ముఖానికి పట్టించినట్లే కొంతమంది కంటికీ దట్టంగా మేకప్‌ వేస్తుంటారు. దానివల్ల కంటి సమస్యల్ని కోరికోరి కొని తెచ్చుకున్నట్లే! కాబట్టి ఐ మేకప్‌ ఎంత సింపుల్‌గా, తక్కువగా వేసుకుంటే అందం అంతగా ఇనుమడిస్తుంది.. కంటి సమస్యలు రాకుండానూ జాగ్రత్తపడచ్చు. ఒకవేళ ఈ సమస్యలు మరీ తీవ్రమైతే మాత్రం సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మర్చిపోవద్దు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్