కడుపుబ్బరమా? అయితే ఇలా చేయండి!

ఇష్టమైన ఆహారం ఎక్కువగా లాగించినా, మలబద్ధకం ఉన్నా, కడుపులో గ్యాస్‌ ఏర్పడినా, నీళ్లు ఎక్కువగా తాగినా, నెలసరి సమయంలో.. ఇలా పలు సందర్భాల్లో కడుపు ఉబ్బరంగా అనిపించడం, తద్వారా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే!

Published : 20 Sep 2023 12:16 IST

ఇష్టమైన ఆహారం ఎక్కువగా లాగించినా, మలబద్ధకం ఉన్నా, కడుపులో గ్యాస్‌ ఏర్పడినా, నీళ్లు ఎక్కువగా తాగినా, నెలసరి సమయంలో.. ఇలా పలు సందర్భాల్లో కడుపు ఉబ్బరంగా అనిపించడం, తద్వారా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే! దాంతో తలెత్తే అసౌకర్యం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టలేం.. పైగా ఎప్పుడూ నాజూగ్గా కనిపించే పొట్ట ఒక్కసారిగా ఎత్తుగా కనిపించేసరికి మనసుకు ఏదోలా అనిపిస్తుంది. మరి, ఈ సమస్యను తగ్గించుకొని తిరిగి పొట్టను నాజూగ్గా మార్చుకోవాలంటే.. అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

పీచు ఎక్కువగా తీసుకోవాలి!

పీచు, ద్రవాహారం తక్కువగా తీసుకోవడం.. వ్యాయామం చేయకపోవడం.. వంటివి మలబద్ధకానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య వల్ల కడుపుబ్బరం, దాని కారణంగా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమేనని, అయితే కొంతమంది ఆరోగ్యవంతుల్లో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా కడుపులో నీటి స్థాయులు పెరిగిపోయి ఈ సమస్య తలెత్తవచ్చని చెబుతున్నారు. అందుకే పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు రోజూ తాము తీసుకునే ఆహారంలో 25 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, పప్పులు, నట్స్‌, గింజల్లో.. పీచు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి క్రమంగా కడుపుబ్బరం, పొట్ట ఎత్తు కూడా తగ్గిపోతాయి.

గబగబా తినేస్తున్నారా?

సమయం లేదనో, ఇతర కారణాల రీత్యానో కొంతమంది గబగబా భోజనం చేసేస్తుంటారు. కడుపులో గ్యాస్‌, ఉబ్బరానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా త్వరత్వరగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి వెళ్లిపోయి ఈ సమస్యల్ని తెచ్చిపెడుతుందట! అందుకే భోంచేయడానికి కనీసం అరగంటైనా కేటాయించమంటున్నారు. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడమూ ముఖ్యమేనట! ఈ క్రమంలో పదార్థం రుచిని ఆస్వాదించడంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా చురుగ్గా ఉంటుందని, మరీ ఎక్కువ ఆహారం తీసుకోకుండానూ జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.

వీటితో ఉపశమనం పొందచ్చు!

కడుపులోని మంచి బ్యాక్టీరియా ఉబ్బరాన్ని తగ్గిస్తుందట! ఇందుకోసం ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉండే పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పెప్పర్‌మింట్‌ టీ, అల్లం టీ, పైనాపిల్‌, ఆకుకూరలు.. వంటివి కడుపుబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.

సుఖ నిద్ర అవసరం!

రాత్రుళ్లు ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి దాటాక పడుకోవడం వల్ల నిద్ర సరిపోదు. తద్వారా ఆహారం అరక్కపోవడం, గ్యాస్‌, కడుపుబ్బరం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే త్వరగా తినడం, వేళకు పడుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇలా సుఖంగా నిద్రపోయిన వారిలో గ్రెలిన్‌ హార్మోన్‌ (ఆకలిని పెంచే హార్మోన్‌) స్థాయులు తగ్గుతాయని, లెప్టిన్‌ హార్మోన్ (ఇది కొవ్వుల్ని కరిగించి శరీరంలో శక్తిని సమతులం చేస్తుంది.. తద్వారా ఆకలిని నియంత్రిస్తుంది.) స్థాయులు పెరుగుతాయని.. తద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉండి మితంగా ఆహారం తీసుకోవచ్చని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇలా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్యకు దూరంగా ఉండచ్చంటోంది. కాబట్టి నిద్రను త్యాగం చేయడం మానుకోమంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్