అందుకే ఈ అలవాట్లు మానుకోవాలట!

కొంతమంది పని ధ్యాసలో పడిపోయి నిద్రను త్యాగం చేస్తుంటారు..మరికొందరు తమకిష్టమనో, ఆరోగ్యానికి మంచిదనో ప్రతి రోజూ మాంసాహారం తీసుకుంటుంటారు..ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు ఇంకొందరుంటారు..నిజానికి ఇవన్నీ మన జీవనశైలిలో ఓ భాగమే అనుకుంటాం.. కానీ  ఇటువంటి అలవాట్లే అటు శారీరకంగా....

Published : 29 Nov 2022 19:56 IST

కొంతమంది పని ధ్యాసలో పడిపోయి నిద్రను త్యాగం చేస్తుంటారు..

మరికొందరు తమకిష్టమనో, ఆరోగ్యానికి మంచిదనో ప్రతి రోజూ మాంసాహారం తీసుకుంటుంటారు..

ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు ఇంకొందరుంటారు..

నిజానికి ఇవన్నీ మన జీవనశైలిలో ఓ భాగమే అనుకుంటాం.. కానీ  ఇటువంటి అలవాట్లే అటు శారీరకంగా, ఇటు మానసికంగా మనల్ని అనారోగ్యాల పాలు చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని మార్చుకుంటే తప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోలేమంటున్నారు.

అది క్యాన్సర్‌కు కారణమవుతుంది!

మాంసాహారమంటే చెవి కోసుకునే వారే మనలో చాలామంది ఉంటారు. చికెనో, మటనో లేనిదే వారికి ముద్ద దిగదు. పైగా ఇందులో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది.. కాబట్టి దీన్ని తీసుకుంటే శరీరానికి సరిపడా ప్రొటీన్‌ అందించచ్చన్న ఆలోచనలో ఉంటారు. అయితే మాంసాహారం శరీరానికి మంచిదే.. కానీ మితంగా తీసుకున్నంత వరకే దాని ఫలితాలు పూర్తిగా శరీరానికి అందుతాయంటోంది ఓ అధ్యయనం. ముఖ్యంగా మటన్‌/ప్రాసెస్‌ చేసిన మాంసం.. వంటి అధిక ప్రొటీన్‌ ఉన్న పదార్థాల్ని పదే పదే ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందంటోంది. ఇందుకు దీనిలోని IGF-1 (ఇన్సులిన్‌ లైక్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1) హార్మోనే ప్రధాన కారణం! అందుకే దీన్ని మితంగా తీసుకుంటూనే.. పప్పు ధాన్యాలు, బీన్స్‌, పాలు, పెరుగు, నట్స్‌.. వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం మంచిది.

ఒంటరిగా ఉంటే ఇన్ని సమస్యలా?!

కొందరికి ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉంటే.. మరికొందరు పరిస్థితుల రీత్యా అయిన వారికి దూరంగా, ఒంటరిగా ఉండాల్సి రావచ్చు. ఏదేమైనా దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఓ అధ్యయనంలో భాగంగా.. ఒంటరిగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్యాలు తలెత్తడం వారు గమనించారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, స్థూలకాయం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్‌ వ్యాధి, డిప్రెషన్‌, యాంగ్జైటీ.. వంటి సమస్యలన్నింటికీ మూల కారణం ఒంటరితనమే అని తేల్చారు. మరి, దీన్నిలాగే కొనసాగిస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఒంటరితనాన్ని వీడి.. నలుగురితో కలిసిపోవడం, మనసుకు నచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం, మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఇష్టమైన పనులు చేయడం.. ఆలోచిస్తే ఇలాంటి పరిష్కార మార్గాలు బోలెడుంటాయి. ఇవేవీ వర్కవుట్‌ కాకపోతే మానసిక నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకున్నా ఫలితం ఉంటుంది.

అలా తింటే బరువు పెరుగుతారట!

పిల్లలు వదిలేసిన ఆహార పదార్థాలు తినడం చాలామంది తల్లులకు అలవాటే! ఈ క్రమంలో మనకు తెలియకుండానే రోజూ అదనంగా కొన్ని క్యాలరీలు మన శరీరంలోకి చేరతాయంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే కొన్ని వారాల తర్వాత బరువులో పెరుగుదల కనిపించడం ఖాయమంటున్నారు. అందుకే పిల్లలు వదిలేసింది తినడంలో తప్పు లేకపోయినా.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఈ అలవాటు మానుకోవాలంటున్నారు. మరి, ఇలా జరగకూడదంటే పిల్లలు ఎంత తినగలరో అంతే వడ్డించడం, పూర్తిగా తినేలా వారిని ప్రోత్సహించడం మంచిది. నిజానికి ఇలా పూర్తిగా తినే అలవాటు పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పడం మరీ మంచిది. అలాగే వీలైనప్పుడల్లా పిల్లలతో కలిసి భోజనం చేస్తే మిమ్మల్ని చూసి వారు కూడా ఆయా పదార్థాల్ని వదిలిపెట్టకుండా పూర్తిగా తినే అవకాశం ఉంటుంది.

సరిగ్గా కూర్చోకపోయినా ప్రమాదమే!

కూర్చున్నా, నిల్చున్నా.. ఏదైనా సపోర్ట్‌ తీసుకొని దానికి చేరగిలబడడం మనలో చాలామందికి అలవాటు. నిజానికి దీనివల్ల వివిధ రకాల నొప్పులతో బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఓ గంట పాటు లేవకుండా చేరగిలబడి కూర్చోవడం, వంగి కూర్చోవడం వల్ల.. వెన్ను, మెడ, భుజాలు.. వంటి శరీర భాగాల్లో నొప్పి మొదలవుతుంది.. ఇది క్రమేపీ తలనొప్పికి దారితీస్తుంది. ఫలితంగా పనిపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. మరి, ఈ సమస్య రాకూడదంటే.. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా చేరగిలబడిపోవడం కాకుండా.. నిటారుగా కూర్చొని వెనక్కి ఒరగాలి.. ఈ క్రమంలో వీపుతో పాటు భుజాలు కూడా కుర్చీకి ఆనించాలి. రెండు చేతుల్ని కుర్చీ హ్యాండిల్స్‌పై పెట్టి కంఫర్టబుల్‌గా పని చేసుకోవాలి. అలాగని ఎక్కువ సమయం కూర్చుండిపోకుండా గంటకోసారైనా ఓ ఐదు పది నిమిషాల పాటు నిలబడి పనికి కాస్త విరామం ఇవ్వడం, అదీ కుదరకపోతే ఉన్న చోటే నిలబడి అటూ ఇటూ తిరగడం, కుర్చీలో కూర్చొనే చిన్నపాటి వ్యాయామాలు చేయడం.. మంచిది. తద్వారా ఎలాంటి నొప్పులూ రాకుండా జాగ్రత్తపడచ్చు..

టీవీ చూస్తూ నిద్రపోతున్నారా?

రోజంతా పనులతో అలసిపోయి రాత్రి పూట అలా కాసేపు టీవీ ముందు సేదదీరదామనుకుంటారు ఆడవారు. ఈ క్రమంలో సోఫాలో కూర్చొనే నిద్రపోతుంటారు. పోనీ.. ఆ సమయంలో టీవీ ఆఫ్‌ చేసి బెడ్‌రూమ్‌లోకెళ్లి నడుం వాల్చుతారా అంటే.. అలా చేయరు. అక్కడే కునికిపాట్లు పడుతుంటారు. ఓ పక్క టీవీ శబ్దం వస్తుంటే ఇలా కునికిపాట్లు పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. పైగా ఇలా నిద్రకు అంతరాయం కలగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల పనితీరు మందగించడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు. అందుకే నిద్ర సమయంలో టీవీ, మొబైల్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కన పెట్టి హాయిగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు సుఖనిద్రకు ఉపక్రమించడం మంచిదంటున్నారు. ఈ అలవాటు శరీరానికి రిలాక్సేషన్‌ అందించడమే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉండేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్