UPSC Rankers: వైకల్యాన్ని జయించి.. విజేతలయ్యారు!

శరీరంలో ఏ అవయవం లోపించినా.. ఇక తమ జీవితం వ్యర్థమన్న నిరాశలోకి కూరుకుపోతుంటారు చాలామంది. కానీ తమలో ఉన్న ప్రతిభ, పట్టుదలతో ఈ లోపాల్ని అధిగమించి విజేతలయ్యారు....

Published : 26 May 2023 20:14 IST

శరీరంలో ఏ అవయవం లోపించినా.. ఇక తమ జీవితం వ్యర్థమన్న నిరాశలోకి కూరుకుపోతుంటారు చాలామంది. కానీ తమలో ఉన్న ప్రతిభ, పట్టుదలతో ఈ లోపాల్ని అధిగమించి విజేతలయ్యారు ముగ్గురమ్మాయిలు. ఇటీవలే విడుదలైన యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ర్యాంకర్లుగా సత్తా చాటారు. ఈ ముగ్గురి విజయ ప్రస్థానం ఇలాంటి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం!

ఐదేళ్ల వయసులో చేయి పోగొట్టుకొని..!

కేరళలోని తిరువనంతపురానికి చెందిన అఖిల బీఎస్‌ చిన్నతనంలో అందరమ్మాయిల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగింది. అయితే తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు బస్సు ప్రమాదానికి గురైన ఆమె.. కుడి చేతిని కోల్పోయింది. ఆపై ఆమెకు ప్రోస్థటిక్ చేతిని అమర్చినా.. భుజం ఫ్రాక్చర్‌ కావడంతో అది సరిగ్గా ఇమడలేదు. ఇకపై ఒంటి చేత్తోనే జీవించాలని ఆ క్షణం రియలైజ్‌ అయిన అఖిల.. తన తలరాతకు బాధపడలేదు. ఎడమ చేత్తోనే తన పనులు చేసుకోవడం, రాయడం నేర్చుకుంది. స్కూల్లో, కాలేజీలో టాపర్‌గా నిలిచిన ఆమె.. ఐఐటీ మద్రాస్‌లో ‘ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ’ పూర్తి చేశాక సివిల్స్‌పై దృష్టి పెట్టింది. మూడో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించిన అఖిల.. ఐఏఎస్‌ కావడం తన చిన్ననాటి కల అంటోంది.

‘సివిల్స్‌లో నాకు 760 ర్యాంకు వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడే మా టీచర్‌ నా మనసులో దీనికి సంబంధించిన బీజం వేశారు. దీంతో ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక దీనిపై పూర్తి దృష్టి పెట్టా. 2020 నుంచి వరుసగా మూడేళ్లు సివిల్స్‌ రాశాను. మూడో ప్రయత్నంలో అర్హత సాధించా. ఏదేమైనా ఇదో పెద్ద సవాలనే చెప్తా. ఎందుకంటే నాలో ఉన్న శారీరక లోపం కారణంగా గంటల తరబడి కూర్చోలేను. ఒకవేళ అలా కూర్చుంటే వెన్నునొప్పి విపరీతంగా వస్తుంది. మెయిన్స్‌ పరీక్ష సమయంలో ఈ నొప్పితోనే పరీక్ష పూర్తిచేశా. అయినా సివిల్స్‌కు అర్హత సాధించడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపైది. అయితే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కాకపోతే మళ్లీ ఎంట్రన్స్‌ రాస్తా. లక్ష్యాన్ని చేరుకునే దాకా ప్రయత్నం ఆపను..’ అంటూ చెప్పుకొచ్చింది అఖిల.


‘థెయ్యం’.. గెలిపించింది!

సాధారణంగా ఇంటర్వ్యూల్లో మన మెదడుకు పదును పెట్టే ప్రశ్నలతో పాటు.. మన అభిరుచుల పైనా ప్రశ్నలడుగుతుంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అలాంటి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చి.. ముఖాముఖి చేసే వారి మనసులు గెలుచుకోవడంతో పాటు అంతిమ ఫలితాల్లో 910 ర్యాంకు సాధించింది కేరళకు చెందిన కాజల్‌ రాజు. అయితే కుడిచేతి మణికట్టు లేకుండానే జన్మించిందామె. పుట్టుకతోనే అరుదుగా వచ్చే ఫొకోమేలియా సిండ్రోమ్‌ అనే సమస్య ఇది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగానంటోంది కాజల్.

‘మలబార్‌ జిల్లాలోని నీలేశ్వర్‌ నా స్వగ్రామం. అక్కడ ‘థెయ్యం (Theyyam)’ అనే సంప్రదాయ నృత్య వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు పాల్గొనడం ఆనవాయితీ. అయితే నా అభిరుచుల్లో భాగంగా దీని గురించి ప్రస్తావించిన నాకు.. ఇంటర్వ్యూలో ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. ఇది కేవలం పురుషుల నృత్య వేడుక అని, మహిళలు చేయరని.. ఇలా దీనికి సంబంధించిన విషయాలను అర్థవంతంగా వివరించా. నా విశ్లేషణాత్మక నైపుణ్యాలు ముఖాముఖి బృందానికి నచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడే భవిష్యత్తులో జిల్లా కలెక్టర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఐఐటీ మద్రాసులో చదివా. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. అయినా మళ్లీ తదుపరి పరీక్షలో మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిస్తా. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు నేను చెప్పేది ఒక్కటే.. రోజూ వార్తాపత్రికలు చదవండి.. కరెంట్ అఫైర్స్‌పై పట్టు పెంచుకోండి.. సమాజంలో ఏం జరుగుతోందో గ్రహించండి..’ అంటూ నేటి యువతకు మార్గనిర్దేశనం చేస్తోందీ సివిల్స్‌ ర్యాంకర్.


ఆ ప్రమాదం పట్టుదల పెంచింది!

కేరళ వయనాడ్‌కు చెందిన షెరిన్‌ షహానా కథ వింటే కళ్లు చెమర్చక మానవు. ఐదేళ్ల క్రితం అందరిలాగానే అన్ని పనులు చేసుకునే ఆమె.. ఆ సమయంలో ఇంటి టెర్రస్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. దీంతో రెండుచోట్ల పక్కటెముకలు విరగడంతో పాటు వెన్నెముకకు గాయాలయ్యాయి. రెండు చేతులు, కింది శరీర భాగం పక్షవాతంతో చచ్చుబడిపోయింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్‌గా ఆలోచించింది షెరిన్‌. శారీరక లోపాల్ని అధిగమించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ఇదే సివిల్స్‌ సాధించాలన్న పట్టుదల తనలో పెంచిందంటోందామె.

‘ప్రమాదం తర్వాత నా జీవితం పునఃప్రారంభించినట్లనిపించింది. రెండేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యా. అయితే అదే సమయంలో నా శారీరక లోపాన్ని అధిగమించాలనుకున్నా.. నాకు సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి విభజించుకొని ముందుకు సాగాను. ఇదే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశా. ఓవైపు పిల్లలకు ట్యూషన్స్‌ చెబుతూనే.. మరోవైపు యూజీసీ పరీక్ష రాశాను. సివిల్స్‌కీ సన్నద్ధమయ్యాను. నా శారీరక లోపం కారణంగా కనీసం పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి. అయినా మరొకరి సహాయంతో పరీక్ష రాశాను. 913 ర్యాంకు వచ్చింది.. ఇటీవలే క్యాలికట్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరాను. ఉద్యోగంలో స్థిరపడ్డా నేర్చుకోవడం మాత్రం ఆపను..’ అంటోంది షెరిన్‌. ఇక యూపీఎస్సీ-2022 ఫలితాలొచ్చిన సమయంలోనూ కారు ప్రమాదానికి గురై ఆస్పత్రి బెడ్ పైనే ఆమె ఫలితాలు చూసుకోవడం గమనార్హం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్