తొలి సంతకం ఆమెదే..

‘పక్షి తన రెక్కల్ని విశ్వసించాలే కానీ... ఆకాశం అంచుల్ని కూడా తాకగలదు’... మనకీ ఇదే వర్తిస్తుంది అంటారీ ధీర వనితలు. ప్రతిభ, ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసాల తోడుగా అవాంతరాలెన్నో అధిగమించారు. ఈ ఏడాది గాజుతెరలని బద్దలు కొట్టి... తొలి మహిళలుగా తమ పేరుని చరిత్రలో లిఖించుకున్నారు.

Updated : 29 Dec 2022 14:26 IST

‘పక్షి తన రెక్కల్ని విశ్వసించాలే కానీ... ఆకాశం అంచుల్ని కూడా తాకగలదు’... మనకీ ఇదే వర్తిస్తుంది అంటారీ ధీర వనితలు. ప్రతిభ, ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసాల తోడుగా అవాంతరాలెన్నో అధిగమించారు. ఈ ఏడాది గాజుతెరలని బద్దలు కొట్టి... తొలి మహిళలుగా తమ పేరుని చరిత్రలో లిఖించుకున్నారు.

ఆరు పేటెంట్లూ ఆమెవే...

పుట్టింది సాధారణ కుటుంబంలో. చదివింది తమిళ మాధ్యమంలో. అయితేనేం 80 ఏళ్ల ప్రతిష్ఠాత్మక ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)’ సంస్థకి డైరెక్టర్‌ జనరల్‌గా ఎదిగారు ‘నల్లతంబి కలై సెల్వి’. తమిళనాడులోని కారైకుడి సీఎస్‌ఐఆర్‌ సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్‌గా సెల్వి 25 ఏళ్లు పనిచేశారు. ఎలక్ట్రో కెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ రంగంలోనూ విశేష కృషి చేశారు. 125 పరిశోధన పత్రాలు
సమర్పించిన ఆమె ఆరు పేటెంట్లనూ సాధించారు.


ట్రెయినీగా అడుగుపెట్టి....

మహిళలు అరుదుగా ప్రవేశించే ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో తొలితరం మహిళ డాక్టర్‌ ఆల్కా మిత్తల్‌. ఓఎన్‌జీసీకి సీఎండీగా ఎంపికైన తొలి మహిళ ఆవిడే. దేహ్రాదూన్‌కి చెందిన ఆమె ఎకనామిక్స్‌లో పీజీ, తర్వాత ఎంబీఏ, పీహెచ్‌డీ చేశారు. ముఫ్పై అయిదేళ్ల క్రితం ఓఎన్‌జీసీలో అడుగు పెట్టిన ఆమె ఆ సంస్థలో తొలి పూర్తి స్థాయి డైరెక్టర్‌గా రికార్డూ సాధించారు. హెచ్‌పీసీఎల్‌, ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రో కెమికల్స్‌ బోర్డుల్లో కీలక సభ్యురాలిగానూ ఉన్నారు.


ఔరా అనిపించేలా...

అంతర్జాతీయ పరుగు పోటీల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత పీటీ ఉషదే. ఇప్పుడు 95 సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న ‘ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌’కు అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. కేరళలోని కూతలి గ్రామంలో పుట్టిన ఉష.. నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. 2002లో ‘ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ను ప్రారంభించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.


వీరగాథలు విని...

ఉగ్గు పాలతోనే అభిలాషకు వీరగాథల్ని నూరి పోశారామె నాన్న ఓమ్‌సింగ్‌. అవే ఆమెను ‘ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌’గా చారిత్రక గుర్తింపు పొందేలా చేశాయి. ఈ విభాగంలో మహిళలు ఉన్నా వారివి గ్రౌండ్‌ డ్యూటీలే. హరియాణాకు చెందిన అభిలాష బీటెక్‌ చదివారు. వీళ్లది సైనిక నేపథ్యమే! ప్రొఫెషనల్‌ మిలిటరీ కోర్సులూ చేశారు. లక్షల జీతమొచ్చే విదేశీ ఉద్యోగాల్ని కాదని అన్నయ్య బాటలో సైన్యంలోకి నడిచారు. 2018లో ‘ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కాప్స్‌’లో చేరింది. 36 మంది సైనిక పైలట్లలో ఏకైక మహిళగా తొలి మహిళా యుద్ధ పైలట్‌గా నిలిచారు.


సాధారణ ఉద్యోగిగా...

సాధారణ ఉద్యోగినిగా తన కెరియర్‌ని మొదలుపెట్టిన మాధబీ పూరీబుచ్‌... సెబీ వంటి కీలకమైన ఆర్థికరంగ సంస్థకు తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా మారి అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారామె. 1989లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో కెరియర్‌ ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, బ్రాండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. 2017- 21 వరకు సెబీ (భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ)కి తొలి మహిళా హోల్‌టైమ్‌ మెంబర్‌గానూ కీలక పాత్ర పోషించారు.


సొంతంగా నేర్చుకుని...

అంతర్జాతీయ పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లలో ‘బ్లాక్‌స్వాన్‌’ ఒకటి. దక్షిణకొరియాకు చెందిన ఆ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది ఒడిశా రాక్‌స్టార్‌ శ్రేయా లెంకా. తమ జట్టులో ఖాళీ అయిన స్థానాల్ని భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్‌ నిర్వహించింది ఈ బ్యాండ్‌. ఇందులో శ్రేయ, బ్రెజిల్‌ అమ్మాయి గ్యాబ్రియెలా దాల్సిన్‌ అర్హత సాధించారు. హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియోలు చూసి సొంతంగానే నేర్చుకుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్