Published : 12/07/2022 16:03 IST

Viral Video: ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే.. నీతో పెళ్లి!

(Image for Representation)

పెళ్లంటే నూరేళ్ల పంట. అయితే చాలా జంటలు పెళ్లైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య ప్రేమ క్రమంగా సన్నగిల్లుతుంటుంది. ఇందుకు ప్రధాన కారణం వాళ్ల మధ్య జరిగే గొడవలే అని చెప్పచ్చు. ఒకరి అభిప్రాయాలు-నిర్ణయాలు మరొకరికి నచ్చకపోవడం, భాగస్వామి దగ్గర్నుంచి ఆశించినవి పొందలేకపోవడం.. ఇలా ఇద్దరికీ పొంతన కుదరకపోవడం వల్ల చీటికీమాటికీ గొడవపడుతుంటారు. ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏమో.. ఓ కొత్త జంట తమ పెళ్లిలోనే ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త దగ్గర్నుంచి ఏం ఆశిస్తోంది? తన విషయంలో అతను ఎలా మెలగాలనుకుంటోంది? వంటి అంశాలతో కూడిన ఓ ఒప్పంద పత్రాన్ని తయారుచేసి.. పెళ్లికూతురు వరుడితో ముందుగానే సంతకం పెట్టించుకుంది. ఇది సరదాకో, సీరియస్‌గానో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వినూత్న వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అసోంకు చెందిన మింటు-శాంతి అనే జంట ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. వేదమంత్రాల సాక్షిగా పెళ్లిబాసలు చేసుకున్నారు. అయితే వీటితో పాటు మరో ఘట్టాన్ని కూడా తమ పెళ్లిలో భాగం చేసుకుందీ జంట.

నూరేళ్ల కాంట్రాక్ట్‌ ఇది!

సాధారణంగా పెళ్లైన కొన్నేళ్లకు కొన్ని జంటలు.. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కుదరక తరచూ గొడవలు పడుతుంటారు. పైగా ‘నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లట్లేదు..’, ‘నాకోసం కనీసం బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ప్రిపేర్‌ చేయట్లేదు..’ అంటూ భార్యాభర్తలిద్దరూ కీచులాడుకోవడం చూస్తుంటాం. అయితే ఇలా పెళ్లి తర్వాత గొడవ పడడం కంటే పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదనుకున్నట్లున్నారు శాంతి-మింటు. అందుకే వివాహం తర్వాత శాంతి తన భర్త నుంచి ఏం ఆశిస్తోంది? అతను తనతో ఎలా ఉండాలనుకుంటోంది? ఇలా తన మనసులోని ఆలోచనలన్నీ ఓ పెద్ద పేపర్‌పై ప్రింట్‌ చేయించింది. ఈ కాంట్రాక్ట్‌ పేపర్‌పై మండపంలోనే, అందరి సమక్షంలో ముందు తాను సంతకం చేసి.. ఆపై వరుడి సంతకం కూడా తీసుకుంది. ఇలా తమ వివాహంలో వినూత్నంగా ఒప్పంద పత్రంపై సంతకం చేసిన ఈ జంట వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఏంటా కండిషన్లు?!

ఇంతకీ వధువు శాంతి ఈ ఒప్పంద పత్రంలో ప్రింట్‌ చేయించిన ఆ కండిషన్లు ఏంటో మీరే చూడండి..

నాకు నెలకో పిజ్జా తినిపించాలి.

ఎక్కువగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.

లేట్‌నైట్‌ పార్టీలకు ఒప్పుకుంటా.. అయితే అదీ నాతో అయితేనే..!

ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి.. అందుకు రోజూ జిమ్‌కి వెళ్లాలి.

ఆదివారాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ నువ్వే (వరుడు) ప్రిపేర్‌ చేయాలి.

నేను హాజరయ్యే పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో నన్ను బాగా ఫొటో తీయాలి.

ప్రతి 15 రోజులకోసారి నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లాలి.

ఇవన్నీ పెళ్లికూతురు శాంతి పెట్టిన నిబంధనలైతే, ఇక పెళ్లి కొడుకు కూడా తన భార్య రోజూ కచ్చితంగా చీరే ధరించాలి అన్న కండిషన్ పెట్టడం, దీనికి శాంతి అంగీకరించడం గమనార్హం. ఇలా ఎనిమిది ఒప్పందాలతో కూడిన ఈ వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ వీడియోను wedlock_photography_assam అనే సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేయగా.. కోటి మందికి పైగా వీక్షించారు. 20 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు.

బెస్ట్‌ డీల్‌ ఇది!

చాలామంది నెటిజన్లు ఈ వినూత్న వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘ప్రతి పెళ్లిలోనూ ఇలాంటి కాంట్రాక్ట్‌ ఉండాల్సిందే!’, ‘బెస్ట్‌ డీల్‌ ఇది.. ఎంతో ఆసక్తికరంగా ఉంది..’, ‘ఇలాంటి ఒప్పందం ముందే జరిగితే.. పెళ్లి తర్వాత అసలు గొడవలే ఉండవు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు.. ‘పెళ్లనేది వ్యాపార ఒప్పందం కాదు.. వీళ్ల వాలకం చూస్తుంటే.. ఈ ఒప్పందాలు వర్కవుట్‌ కాకపోతే.. ఇద్దరూ విడిపోతారేమో?!’ అంటూ మరికొంతమంది సరదాగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

సరదాకో.. సీరియస్‌గానో.. ఈ జంట తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి, పెళ్లికి ముందు ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల వివాహబంధంలో కలతలకు తావుండదన్నది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. మరి, ఈ విషయంలో మీ స్పందనేంటి? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని