బెల్జియంలో ‘నాగా’ ఘుమఘుమలు!

‘ఎక్కడికెళ్లినా, ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదం’టుంటారు. మణిపూర్‌ ఇంఫాల్‌కు చెందిన లాందిమ్లు ఫిగా గ్యాంగ్‌మీ (Landimliu Pheiga Gangmei) కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. బెల్జియంలో స్థిరపడ్డా భారతీయ....

Updated : 16 Mar 2023 16:35 IST

(Photos: Instagram)

‘ఎక్కడికెళ్లినా, ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదం’టుంటారు. మణిపూర్‌ ఇంఫాల్‌కు చెందిన లాందిమ్లు ఫిగా గ్యాంగ్‌మీ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. బెల్జియంలో స్థిరపడ్డా భారతీయ మూలాల్ని మాత్రం మర్చిపోలేదు. ఈ క్రమంలోనే తనకున్న పాకశాస్త్ర ప్రావీణ్యంతో అక్కడి వారికి తన సొంతూరు రుచుల్ని పరిచయం చేస్తోంది. ఈ ఆలోచనతోనే ఓ ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ ప్రారంభించిన ఆమె.. స్వదేశీ ఘుమఘుమల్ని విదేశీయులకు పరిచయం చేస్తూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకుంది. మరోవైపు ఆదాయమూ గడిస్తోంది. మరి, విదేశీ గడ్డపై స్వదేశీ రుచుల్ని పంచుతూ.. ఇక్కడి సంప్రదాయాల్ని చాటుతోన్న ఆమె ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

గ్యాంగ్‌మీని ఇంట్లో వాళ్లు లులు అనే ముద్దుపేరుతో పిలుస్తారు. ఇంఫాల్‌లోని నాగా అనే గిరిజన జాతికి చెందిన ఆమెకు వంట చేయడమంటే మహా ఇష్టం. ఈ మక్కువతోనే చిన్నతనం నుంచి తన తల్లి, బామ్మ దగ్గర్నుంచి విభిన్న వంటకాల్లో ప్రావీణ్యం సంపాదించింది. ‘యుక్తవయసులో ఉన్నప్పట్నుంచే ఇంట్లో వాళ్ల కోసం ప్రత్యేక వంటకాలు చేసేదాన్ని. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుంది. వంట చేయడం నా ప్రత్యేకత అని చిన్నతనంలోనే గ్రహించా. ఇది జీవితాంతం మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఓ కళ అన్నది నా నమ్మకం..’ అంటోంది లులు.

బాబ్‌ అక్కడే పరిచయమయ్యాడు! 

ఇలా వంటల్లోనే కాదు చదువులోనూ చురుగ్గా ఉండే లులు.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. తన వృత్తిలో భాగంగా ఓసారి గోవా వెళ్లినప్పుడే తన ఇష్టసఖుడు బాబ్‌ను కలుసుకున్నానంటోంది లులు. ‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా ఉన్న సమయంలో.. గోవా ప్రయాణంలో భాగంగా బాబ్‌ను కలుసుకున్నా. తనది బెల్జియం. తొలిచూపులోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన మేము.. ఆపై పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. పెళ్లి తర్వాత బాబ్‌తో కలిసి బెల్జియంలో స్థిరపడ్డా..’ అంటూ తన ప్రేమకథ గురించి పంచుకుందీ నాగా బ్యూటీ.

కళనే వ్యాపారంగా మలచుకొని..!

అయితే తనకున్న పాకశాస్త్ర మెలకువలతో ఫుడ్‌ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన లులు మనసులో ఎప్పట్నుంచో ఉంది. భర్తతో కలిసి బెల్జియంలో స్థిరపడ్డాక ఈ ఆలోచనను ఆచరణలో పెట్టిందామె. ‘చిన్నతనం నుంచి ఇంట్లో వంట చేసే క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఓవైపు మా గిరిజన తెగకు సంబంధించిన సంప్రదాయ వంటకాలు ప్రయత్నిస్తూనే.. మరోవైపు కొత్త ప్రయోగాలతో విభిన్న వంటకాలూ చేసేదాన్ని. ఈ ఆసక్తితోనే 2014లో బెల్జియంలో ‘లులూస్‌ ట్రైబల్‌ కిచెన్‌’ పేరుతో ఓ ఫుడ్‌ ట్రక్‌ వ్యాపారానికి తెరతీశా. నా పాకశాస్త్ర నైపుణ్యాలకు మరింత పదును పెట్టడానికి ఓ షార్ట్‌ టర్మ్‌ కోర్సు కూడా నేర్చుకున్నా.. ఇందులో భాగంగా డచ్‌ కుకింగ్‌ స్టైల్‌లోనూ ప్రావీణ్యం సంపాదించా. అయితే అప్పటికే అక్కడి వారికి ఈ ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ కొత్తేం కాదు. పైగా వీరిలో కొంతమంది భారతీయ రుచుల్నీ అందిస్తున్నారన్న విషయం తెలుసుకున్నా. అందుకే వారికి విభిన్నంగా నాగా గిరిజన తెగకు చెందిన సంప్రదాయ వంటకాల్ని అక్కడి వారికి పరిచయం చేయాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది లులు.

ఎన్నెన్నో వెరైటీలు..!

దాదాపు ఎనిమిదేళ్లుగా ఫుడ్‌ ట్రక్‌ నడుపుతోన్న లులు.. ఈ వేదికగా ఎన్నో రుచికరమైన, విభిన్న వంటకాల్ని అక్కడి వారికి పరిచయం చేస్తోంది. ‘భారతీయ సంప్రదాయ వంటకాలకు, గిరిజన వంటకాలకు చాలా తేడా ఉంటుంది. రంగు, రుచి, వాసనతో పాటు వంట చేయడంలోనూ కొన్ని తేడాలుంటాయి. గిరిజన వంటకాల్లో చాలా వరకు పులియబెట్టిన వాటికి ప్రాధాన్యమిస్తుంటాం. ఇవి ఆరోగ్యకరమైనవి కూడా! ముఖ్యంగా నా కిచెన్‌లో స్మోకీ చికెన్‌, ఇతర మాంసాహార వంటకాలు, నాగా స్టైల్‌లో తయారుచేసే దాల్‌ వంటకం, వెదురు సాస్‌, ప్రత్యేకంగా చేసే వంకాయ కూర.. వంటివి ప్రత్యేకమైనవి. వీటితో పాటు మా వద్ద తయారయ్యే వెజ్జీ డిలైట్‌ (విభిన్న కాయగూరలు, శెనగలు, మసాలాలతో తయారుచేసే వంటకం)కు ఇక్కడ ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. పైగా బెల్జియంలో మసాలాలు దొరకడం కష్టం.. అందుకే మణిపూర్‌ వెళ్లినప్పుడే ఎక్కువ మొత్తంలో ప్యాక్‌ చేయించుకొని తెచ్చుకుంటా. ఇక కరోనా సమయంలో ఇంటి వద్దకే ఫుడ్‌ డెలివరీ చేస్తూ మా వ్యాపారం నష్టపోకుండా నిలబెట్టుకోగలిగాం. ప్రస్తుతం నా భర్త బాబ్‌ కూడా నా ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో నాకు సహకరిస్తున్నారు..’ అంటూ చెబుతోంది లులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్