Forbes Asia List: వ్యాపారంలో వీళ్లెంతో పవర్‌ఫుల్!

వ్యాపారంలో రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు.. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, సరికొత్త వ్యూహాలతో వినియోగదారుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాల్లో సక్సెసయ్యారు ఈ ముగ్గురు మహిళా వ్యాపారవేత్తలు. తమ ఉత్పత్తులతో లక్షలాది మంది....

Published : 10 Nov 2022 12:51 IST

(Photos: Instagram)

వ్యాపారంలో రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు.. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, సరికొత్త వ్యూహాలతో వినియోగదారుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాల్లో సక్సెసయ్యారు ఈ ముగ్గురు మహిళా వ్యాపారవేత్తలు. తమ ఉత్పత్తులతో లక్షలాది మంది వినియోగదారులకు చేరువవడమే కాదు.. ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌ను అందుకుంటున్నారు. అందుకే వీళ్ల నాయకత్వ ప్రతిభ, విజయాల్ని ఫోర్బ్స్‌ పత్రిక కొనియాడింది. తాజాగా విడుదల చేసిన ‘ఫోర్బ్స్‌ ఆసియా పవర్‌ బిజినెస్‌ విమెన్‌ 2022’ జాబితాలో వీరికి చోటిచ్చి గౌరవించింది. ఇంతకీ, ఎవరా ముగ్గురు మహిళా వ్యాపారవేత్తలు? వారి వ్యాపార వ్యూహాలేంటి? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!

అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, తమ వ్యాపార దక్షతతో తమ సంస్థల్ని లాభాల బాట పట్టించిన 20 మంది అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తలకు ఫోర్బ్స్ ఆసియా పత్రిక.. తన నవంబర్‌ ఎడిషన్‌లో చోటు కల్పించింది. ఈ క్రమంలో విడుదల చేసిన ‘ఫోర్బ్స్‌ ఆసియా పవర్‌ బిజినెస్‌ విమెన్‌ 2022’ జాబితాలో ముగ్గురు భారతీయ మహిళా వ్యాపారవేత్తలు స్థానం దక్కించుకున్నారు.


కొడుకు కోసం సంస్థనే నెలకొల్పింది!

అవసరం సరికొత్త ఆలోచనల్ని సృష్టిస్తుందంటారు.. అదే విధంగా ఈ అవసరమే తనను వ్యాపారవేత్తను చేసిందంటోంది ఘజల్‌ అలగ్‌. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఆమె వృత్తిరీత్యా కార్పొరేట్‌ ట్రైనర్‌. ఐటీ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ‘న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో మోడ్రన్‌ ఆర్ట్‌, డిజైన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌.. వంటి విభాగాల్లో షార్ట్‌ టర్మ్‌ కోర్సులు చేసింది. NIITలో కార్పొరేట్‌ ట్రైనర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. వరుణ్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఘజల్‌.. 2016లో అగస్త్య అనే కొడుక్కి జన్మనిచ్చింది. అయితే ఆ పసివాడికి ఉన్న చర్మ సమస్యే తనతో వ్యాపారం ప్రారంభించేలా చేసిందంటోందీ మామ్‌ప్రెన్యూర్.

‘అగస్త్య పుట్టాక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే వాడికున్న చర్మ సమస్య మమ్మల్ని కుదురుగా ఉండనిచ్చేది కాదు. ఈ క్రమంలోనే మార్కెట్లో రసాయనాలు వాడకుండా తయారుచేసిన బేబీ కేర్‌ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగించాం. కానీ అలాంటి ఉత్పత్తులు చాలా తక్కువ అని తెలిశాక.. మేమే స్వయంగా వాటిని ఎందుకు తయారుచేయకూడదు అనిపించింది. ఈ ఆలోచనే ‘మామాఎర్త్‌’ సంస్థకు బీజం వేసింది. రసాయనాలు వాడకుండా పూర్తి సహజసిద్ధంగా పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు తయారుచేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. బేబీ వాష్‌, షాంపూ.. ఇలా చిన్నారులకు సంబంధించిన చర్మ, కేశ సౌందర్య ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి..’ అంటూ తన సంస్థ గురించి చెప్పుకొచ్చారు ఘజల్.

రెట్టింపు లాభాలతో..!

‘Honasa Consumer Pvt Ltd.’ అనే సంస్థలో భాగమైన ఈ కంపెనీ.. ఈ కాలంలో చాలామంది తల్లులకు సుపరిచితమే! దీంతో పాటు ‘The Derma Co.’, ‘Aqualogica’, ‘Ayuga’.. వంటి సంస్థలు కూడా ఇందులో భాగమే! ఇవి మహిళలకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నాయి. గతేడాది రూ. 460 కోట్ల ఆదాయాన్ని గడించిన ఈ సంస్థ.. ఈ ఏడాది రూ. 920 కోట్లతో రెట్టింపు లాభాల్ని ఆర్జించడం విశేషం. ఇక ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థకు యూనికార్న్‌ స్టేటస్‌ కూడా దక్కింది. ప్రస్తుతం అమ్మగా, ఆంత్రప్రెన్యూర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న ఘజల్‌.. వ్యాపారానికి సంబంధించిన చిట్కాల్నీ వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది.


వారసురాలిగా అడుగుపెట్టి..!

తమ సృజనాత్మక ఆలోచనలతో కొత్త వ్యాపారాల్ని ప్రారంభించేవారు కొందరైతే.. వారసులుగా తమ తల్లిదండ్రుల వ్యాపారాల్ని లాభాల బాట పట్టించే వారు మరికొందరు. పుణేకు చెందిన నమితా థాపర్‌ రెండో కోవకు చెందుతారు. గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. వ్యాపార రంగంలోకి రావాలన్న మక్కువతో ఎంబీఏ పూర్తిచేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని రెండు ప్రముఖ కంపెనీల్లో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఆరేళ్ల పాటు పనిచేసి.. వ్యాపారానికి సంబంధించిన వివిధ నైపుణ్యాల్ని గడించింది. ఆపై తన తండ్రి ప్రారంభించిన ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ వ్యాపారంలోకి అడుగుపెట్టింది నమిత. సీఎఫ్‌ఓగా సంస్థలో చేరిన ఆమె.. సంస్థను కొత్త పుంతలు తొక్కించే వ్యాపార వ్యూహాల్ని రచించింది. ఈ క్రమంలో హెచ్‌ఐవీ యాంటీ వైరల్స్‌, గుండె జబ్బులకు సంబంధించిన మందుల్ని తయారుచేయడంలో కీలకంగా వ్యవహరించిందామె.

యువతను ప్రోత్సహిస్తూ..!

ఇదే కాదు.. ‘ఇంక్రెడిబుల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ సంస్థనూ స్థాపించింది నమిత. 11-18 ఏళ్ల వయసున్న యువతకు వ్యాపార రంగంలో శిక్షణ ఇవ్వడం, ఈ దిశగా వారిని ప్రోత్సహించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. వీటితో పాటు ప్రస్తుతం ‘ఫినోలెక్స్‌ కేబుల్స్‌’, ‘Fuqua School of Business’ సంస్థల బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతోందీ ఉమన్‌ ఆంత్రప్రెన్యూర్‌. మరోవైపు ‘యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్’ పుణే ఛాప్టర్‌లో క్రియాశీల సభ్యురాలిగానూ వ్యవహరిస్తోంది నమిత. ప్రస్తుతం పేరొందిన రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో షార్క్‌ (పెట్టుబడిదారులు/న్యాయనిర్ణేతలు)గా వ్యవహరిస్తోన్న ఈ బిజినెస్‌ లేడీ.. ఇద్దరు పిల్లల తల్లిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ‘ఉద్యోగులు తమ ఉత్పాదకతను పెంచుకున్నప్పుడే.. బ్రాండ్‌ను సమర్థంగా వినియోగదారులకు చేరువ చేయగలం. అందుకోసమే సమాచార విశ్లేషణపై దృష్టి సారించాను. అలాగే పరిశ్రమలో అనుభవజ్ఞులు, నిపుణులతో పనిచేయగల సామర్థ్యమున్న యువ నాయకుల్ని చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యాను..’ అంటున్నారు నమిత.


‘ఉక్కు’ మహిళ ఆమె!

‘స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SAIL)’కు తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా గతేడాది నియమితులయ్యారు సోమా మోండల్‌. 2017లో ఈ సంస్థలో డైరెక్టర్‌గా చేరిన ఆమె.. కంపెనీ మార్కెటింగ్‌ వ్యూహాలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఏటికేడు స్టీల్‌ అమ్మకాలు పెరిగేలా చేయడంలో ఆమె వ్యూహాలు సమర్థంగా పనిచేశాయని చెప్పచ్చు. ముఖ్యంగా కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సంస్థ ఆదాయం తగ్గకుండా జాగ్రత్తపడ్డారామె. అంతేకాదు.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రాడ్స్‌, ప్లేట్స్‌, బార్స్‌.. వంటి స్టీలు వస్తువుల ఉత్పత్తిని పెంచుతూ.. సంస్థను లాభాల వెంట పరుగులు పెట్టించారు. ఈ ఏడాది కాలంలో సంస్థ వార్షికాదాయం 50 శాతం పెరిగి రూ. 1.03 ట్రిలియన్లకు చేరడమే తన పనితనానికి, వ్యాపారదక్షతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
భువనేశ్వర్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మోండల్‌.. రూర్కెలా నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. NALCO లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె.. లోహ పరిశ్రమలో 35 ఏళ్లకు పైగా అనుభవం గడించారు. సెయిల్‌లో చేరక ముందు ‘నేషనల్‌ అల్యూమినియం కో’ సంస్థలో పనిచేశారీ ఉక్కు మహిళ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్