వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!

వ్యాయామంతో శరీరానికే కాదు.. చర్మానికీ బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి. చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడి నవయవ్వనంగా మెరిసిపోయేలా చేస్తుంది.. అలాగే ఒత్తిడిని తగ్గించి దాని వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది. అయితే ఇదే వ్యాయామం కొన్ని సార్లు మొటిమల సమస్యకూ కారణమవుతుందంటున్నారు నిపుణులు.

Published : 26 Mar 2024 15:23 IST

వ్యాయామంతో శరీరానికే కాదు.. చర్మానికీ బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి. చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడి నవయవ్వనంగా మెరిసిపోయేలా చేస్తుంది.. అలాగే ఒత్తిడిని తగ్గించి దాని వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది. అయితే ఇదే వ్యాయామం కొన్ని సార్లు మొటిమల సమస్యకూ కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకు వ్యాయామానికి ముందు, వెనుక పలు జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమంటున్నారు. మరి, ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే వ్యాయామం చేసే క్రమంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

చెమటే కారణమా?

వ్యాయామం చేసే క్రమంలో విపరీతంగా చెమట రావడం సహజమే! నిజానికి శరీరంలోని విషతుల్యాలు ఈ చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియ శరీర, చర్మ ఆరోగ్యానికి మంచిది. అయితే ఇదే చెమట వల్ల చర్మంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ చెమటను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోవడం, వ్యాయామం చేసే క్రమంలో సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మొటిమల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అలా జరగకూడదంటే ఈ పరిశుభ్రతా ప్రమాణాలు తప్పనిసరి అని చెబుతున్నారు. అవేంటంటే..!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

⚛ కొంతమంది మేకప్‌ వేసుకొని జిమ్‌కి వెళ్తుంటారు.. లేదంటే ఇంట్లోనే వ్యాయామాలు సాధన చేస్తుంటారు. అయితే వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో రక్తప్రసరణ మెరుగై చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఈ క్రమంలో విడుదలయ్యే చెమటతో మేకప్‌ అవశేషాలు కలిసిపోయి చర్మ రంధ్రాల్లోకి చేరి వాటిని మూసేస్తాయి. ఇది క్రమంగా మొటిమలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి వ్యాయామం చేసే ముందే ముఖంపై నుంచి మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. తద్వారా చర్మం శ్వాసిస్తుంది.. ఫలితంగా మొటిమలే కాదు.. ఇతర చర్మ సమస్యలూ రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ జుట్టును పోనీ వేసుకొని వ్యాయామం చేయడం చాలామందికి అలవాటు. అయితే దీనివల్ల ఎక్సర్‌సైజ్‌ చేసేటప్పుడు జుట్టు పదే పదే ముఖాన్ని తాకుతుంటుంది. తద్వారా జుట్టులోని సహజసిద్ధమైన నూనెలు చర్మానికి అంటుకొని చర్మ రంధ్రాల్లోకి చేరతాయి. ఇదీ క్రమంగా మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

⚛ వ్యాయామం చేసే క్రమంలో కుదుళ్లలోని సహజసిద్ధమైన నూనెలు చెమటతో కలిసి ముఖంపైకి చేరతాయి. తద్వారా ముఖం జిడ్డుగా మారుతుంది. ఇదీ మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి వ్యాయామం చేసే క్రమంలో కుదుళ్లకు మరీ ఎక్కువగా నూనె పట్టించకపోవడం మంచిది.

⚛ ​​​​​​​ఎక్సర్‌సైజ్‌ చేసే క్రమంలో ఎన్నో పరికరాల్ని తాకుతుంటాం.. తిరిగి అవే చేతులతో ముఖాన్నీ తాకుతుంటాం.. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి చేరి మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి ముఖాన్ని పదే పదే తాకకుండా, చేతుల్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది.

⚛ ​​​​​​​జిమ్‌లో వ్యాయామాలు చేసే వాళ్లు ఇతరులు వాడిన పరికరాల్నే వాడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆయా జిమ్‌ పరికరాల్ని వాడే ముందు శానిటైజ్‌ చేసుకోవడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మొటిమల సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ​​​​​​​వ్యాయామం చేసే క్రమంలో వచ్చే చెమట వల్ల ముఖంపైనే కాదు.. మెడ, వీపు, ఛాతీ.. వంటి భాగాల్లోనూ మొటిమలొస్తాయి. ఇందుకు కారణం బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్లే! తద్వారా చర్మానికి గాలి తగలక ఆయా భాగాల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది మొటిమలొస్తుంటాయి. ఇలా జరగకూడదంటే వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ కాటన్‌ దుస్తులు చెమటను పీల్చుకొని చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుతాయి.

⚛ ​​​​​​​​​​​​​​వ్యాయామం చేసే క్రమంలో వదులైన, కాటన్‌ దుస్తులు ధరించినా.. ఎక్సర్‌సైజ్‌ పూర్తయ్యే సరికి చెమటకు అవి తడిసిపోతాయి. కాబట్టి వాటిని వెంటనే తొలగించి.. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. తద్వారా చెమట, చర్మంపై పేరుకున్న మురికి, జిడ్డుదనం.. వంటివన్నీ తొలగిపోతాయి. ఫలితంగా మొటిమలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ​​​​​​​వ్యాయామం చేసే క్రమంలో మొటిమల సమస్య వేధించకుండా డాక్టర్‌ సలహా మేరకు రెటినాయిడ్‌ క్రీమ్‌/జెల్‌ను ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు. ఇది చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా, తద్వారా మొటిమలు రాకుండా నివారిస్తుంది.

అయితే ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా కొంతమంది మొటిమల సమస్యతో సతమతమవుతుంటారు. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని, తగిన చికిత్స అందిస్తారు.. ఫలితంగా సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్