స్పోర్ట్స్‌ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?

వక్షోజాల ఆకృతిని ఇనుమడింపజేయడంలో, వాటికి చక్కటి సపోర్ట్‌ని అందించడంలో బ్రా పాత్ర కీలకం! ఈ క్రమంలోనే ఆయా సందర్భాలకు తగినట్లుగా, డ్రస్‌కు నప్పేలా వివిధ రకాల బ్రాలను ఎంచుకుంటుంటాం. ఇందులో భాగంగానే వ్యాయామాలు చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు స్పోర్ట్స్‌ బ్రాకు ప్రాధాన్యమిస్తుంటాం.

Published : 18 Apr 2024 13:21 IST

వక్షోజాల ఆకృతిని ఇనుమడింపజేయడంలో, వాటికి చక్కటి సపోర్ట్‌ని అందించడంలో బ్రా పాత్ర కీలకం! ఈ క్రమంలోనే ఆయా సందర్భాలకు తగినట్లుగా, డ్రస్‌కు నప్పేలా వివిధ రకాల బ్రాలను ఎంచుకుంటుంటాం. ఇందులో భాగంగానే వ్యాయామాలు చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు స్పోర్ట్స్‌ బ్రాకు ప్రాధాన్యమిస్తుంటాం. అయితే దీన్ని ఎంచుకునే క్రమంలో కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకుంటే.. అటు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఇటు వ్యాయామాల వల్ల వక్షోజాలపై ఒత్తిడి పడకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

సైజును బట్టి!

బ్రాను ఎంచుకునే క్రమంలో మనం దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమైన అంశం వక్షోజాల పరిమాణం, ఆకృతి. స్పోర్ట్స్‌ బ్రా ఎంపిక విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో సరిగ్గా సరిపోయే బ్రాను ఎంచుకోవాలంటే.. ముందుగా వక్షోజాల కింది భాగాన్ని టేపుతో కొలవాల్సి ఉంటుంది. దీన్ని బ్రా సైజ్‌గా పరిగణిస్తారు. ఆపై నిపుల్స్‌ దగ్గర చుట్టుకొలత తీసుకోవాలి. ఇప్పుడు దీన్నుంచి బ్రా సైజ్‌ను తీసివేస్తే కప్‌ సైజ్‌ తెలుస్తుంది.

ఉదాహరణకు.. బ్రా సైజ్‌ 28 ఉందనుకోండి.. నిపుల్స్‌ వద్ద చుట్టుకొలత 30 వస్తే.. 30-28=2. ఇదే కప్‌ సైజ్‌ అన్నమాట! దీన్ని బట్టి నాణ్యమైన బ్రాను ఎంచుకుంటే వ్యాయామాలు చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.

పూర్తిగా కవరయ్యేలా!

స్పోర్ట్స్‌ బ్రాల్లోనూ వివిధ మోడల్స్‌లో ఉన్నవి మార్కెట్లో దొరుకుతున్నాయి. హై-నెక్‌, లో-కట్‌, ముందుభాగంలో జిప్‌ ఉన్నవి, కంప్రెషన్‌ స్పోర్ట్స్‌ బ్రాలు.. వీటిలో కొన్ని! అయితే కొన్ని రకాల స్పోర్ట్స్‌ బ్రాలు వక్షోజాల్ని పూర్తిగా కవర్‌ చేసేలా ఉండవు. ఇలాంటివి ఎంచుకోవడం వల్ల వాటికి పూర్తి సపోర్ట్‌ అందదు. పైగా వ్యాయామాలు చేసేటప్పుడు పొరపాటున ఏదైనా పరికరం తగలడం, గాయాలవడం.. వంటి ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి వక్షోజాలు పూర్తిగా కవరయ్యేలా ఉన్న బ్రాలనే ఎంచుకోమంటున్నారు నిపుణులు. తద్వారా వక్షోజాల ఆకృతి దెబ్బతినకుండా, వ్యాయామాలు/ఆటల వల్ల వాటిపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

ప్యాడెడ్‌వే మంచివట!

బ్రాలలో ప్యాడెడ్‌, నాన్‌-ప్యాడెడ్‌ తరహావి ఉన్నట్లే.. స్పోర్ట్స్‌ బ్రాలలోనూ ఈ రెండు రకాల బ్రాలు ఉంటాయి. అయితే వక్షోజాల పరిమాణం కాస్త పెద్దగా ఉన్న వారు ప్యాడెడ్‌ తరహా బ్రాలను ఇష్టపడరు.. కానీ స్పోర్ట్స్‌ బ్రాని ఎంచుకునే వారు వక్షోజాల పరిమాణంతో సంబంధం లేకుండా ప్యాడెడ్‌ బ్రానే ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల వ్యాయామాలు చేసేటప్పుడు రొమ్ములకు పూర్తి స్థాయిలో సపోర్ట్‌ అందుతుందంటున్నారు. తద్వారా వక్షోజాలు సాగకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు. అధిక తీవ్రత, తక్కువ తీవ్రత.. ఇలా ఎలాంటి వ్యాయామాలకైనా; వక్షోజాల పరిమాణం చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా.. ప్యాడెడ్‌ స్పోర్ట్స్‌ బ్రానే శ్రేయస్కరం అంటున్నారు.

వ్యాయామాల్ని బట్టి!

వక్షోజాలు పూర్తిగా కవరయ్యేలా, ప్యాడెడ్‌ తరహా స్పోర్ట్స్‌ బ్రాను ఎంచుకున్నా.. చేసే వ్యాయామాల్ని బట్టి వాటిని ఎంపిక చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అంటే.. రన్నింగ్, జాగింగ్‌ వంటి అధిక తీవ్రత గల వ్యాయామాల కోసం హై-ఇంపాక్ట్‌ స్పోర్ట్స్‌ బ్రా; బ్రిస్క్‌ వాకింగ్‌, వాటర్‌ ఏరోబిక్స్‌, డ్యాన్స్‌.. వంటి మధ్య స్థాయి వ్యాయామాల కోసం మీడియం-ఇంపాక్టెడ్‌ బ్రాలు; ఈత, యోగా, పిలాటిస్‌, సైక్లింగ్‌.. వంటి తక్కువ స్థాయి వ్యాయామాల కోసం లో-ఇంపాక్టెడ్‌ బ్రాలు ఎంచుకోవడం వల్ల వక్షోజాలపై ఒత్తిడి పడకుండా ఉండడంతో పాటు సౌకర్యవంతంగానూ ఉంటుంది. అలాగే ఆయా బ్రాలను వక్షోజాలకు పూర్తి సపోర్ట్‌ అందేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు డిజైనర్లు.

స్ట్రాప్స్‌ ఇలా!

కొన్ని బ్రాలు కంఫర్టబుల్‌గానే ఉన్నా.. వాటికి అనుసంధానమై ఉన్న స్ట్రాప్స్‌ బిగుతుగా ఉంటాయి. తద్వారా భుజాల్లో నొప్పి రావడం, అసౌకర్యం కలగడం సహజం. స్పోర్ట్స్‌ బ్రాల విషయంలో ఈ సమస్యలు ఎదురుకాకూడదంటే వెడల్పుగా, కుషన్‌ తరహాలో మెత్తగా, మృదువుగా ఉన్న స్ట్రాప్స్‌తో కూడుకున్న బ్రాలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే అడ్జెస్టబుల్‌ స్ట్రాప్స్‌ ఉన్నవి ఎంచుకుంటే మరీ మంచిది. వక్షోజాల పరిమాణం, ఆకృతిని బట్టి బ్రాలను సెట్‌ చేసుకోవచ్చు. కంఫర్టబుల్‌గా కనిపించేయచ్చు.

గమనిక : వ్యాయామాలు చేసేటప్పుడు చెమట రావడం సహజం! కాబట్టి చెమటను పీల్చుకొనేలా, గాలి శరీరానికి తగిలేలా, తక్కువ బరువుతో కూడిన స్పోర్ట్స్‌ బ్రాలను ఎంచుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నైలాన్‌, పాలియెస్టర్‌, లైక్రా.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేసిన బ్రాలను ఎంచుకోవడం మరీ మంచిదంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్