పీసీఓఎస్‌ ఉందా? బరువును అదుపులో ఉంచుకోండిలా..

పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్య.. ఎన్నో అనారోగ్యాల్ని వెంటబెట్టుకొస్తుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తి బరువు పెరగడం కూడా ఇందులో ఒకటి.

Published : 10 Jun 2024 12:59 IST

పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్య.. ఎన్నో అనారోగ్యాల్ని వెంటబెట్టుకొస్తుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తి బరువు పెరగడం కూడా ఇందులో ఒకటి. అయితే పీసీఓఎస్‌ ఉన్న వాళ్లు ఇలా పెరిగిన బరువును తగ్గించుకోలేమన్న భావనలో ఉంటారు. నిజానికి ఇది పూర్తిగా అపోహేనని, పీసీఓఎస్‌ ఉన్నా.. చక్కటి ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో తక్కువ సమయంలోనే బరువు తగ్గచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఇన్సులిన్‌ హార్మోన్‌ మన శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి బరువు పెరిగేలా చేస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న వారిలో ఈ హార్మోన్‌ నియంత్రణలో ఉండదు. తద్వారా పెరిగే గ్లూకోజ్‌ స్థాయులకు శరీరం సరిగ్గా స్పందించదు. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడంతో క్రమంగా బరువు పెరుగుతాం. అయితే రోజువారీ ఆహారంలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఇలా పెరిగిన బరువును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

పులియబెట్టిన పదార్థాలు

పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా జీవక్రియల పనితీరును మెరుగుపరిచి తద్వారా బరువు అదుపులో ఉండేందుకు సహకరిస్తుంది. అయితే ఇది పీసీఓఎస్‌ లేని వారి కంటే ఉన్న వారిలో తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగానే పీసీఓఎస్‌ ఉన్న వారు బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. అందుకే పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసుకోవాలంటే పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో పెరుగు, చద్దన్నం, ఇడ్లీ/దోసె, పచ్చళ్లు.. వంటివి మేలు చేస్తాయంటున్నారు.

ఫైబర్‌ ఎక్కువగా..!

ఫైబర్‌ అధికంగా ఉండే పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలేయకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇది ఇన్సులిన్‌ను నిరోధించే శక్తిని శరీరానికి అందించి.. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.. హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి దోహదం చేసేవే! అందుకే ఫైబర్‌ అధికంగా ఉండే బీన్స్‌, బెర్రీస్‌, అవకాడో, బ్రకలీ, తృణధాన్యాలు, యాపిల్స్‌, ఎండు ఫలాలు.. వంటివి తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాపు తగ్గించేలా..!

శరీరానికి దెబ్బ తగిలినా, ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురైనా వాపు రావడం సహజం. అయితే పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో ఈ వాపు దీర్ఘకాలం పాటు ఉంటుందంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా బరువు పెరిగి స్థూలకాయం బారిన పడేలా చేస్తుందంటున్నారు. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మెడిటేరియన్‌ డైట్‌ చక్కగా తోడ్పడుతుందంటున్నారు. ఇందులో భాగంగా పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, ఆలివ్‌ నూనె.. వంటి మొక్కల ఆధారిత ఆహారంతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల్ని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

కొవ్వులూ మంచివేనట!

కొవ్వులంటేనే బరువు పెరిగిపోతామన్న భావన చాలామందిలో ఉంటుంది. అయితే ఇవే కొవ్వులు బరువు తగ్గించడంలోనూ సహకరిస్తాయంటున్నారు నిపుణులు. అది కూడా మంచి కొవ్వులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. తద్వారా ఆకలేయదు. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే!

ఇవి కూడా!

⚛ బరువు తగ్గాలన్న ఉద్దేశంతో క్యాలరీలను పూర్తి దూరంగా పెట్టేస్తుంటారు కొందరు. నిజానికి ఇలా దీర్ఘకాలం పాటు క్యాలరీలు తీసుకోకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతామట! అందుకే తగిన మోతాదులో వీటిని తీసుకుంటూనే ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు, జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి.

⚛ గుడ్లు, నట్స్‌, పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు.. వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాల్ని రోజూ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలేయకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా క్రమంగా బరువు తగ్గచ్చు.

⚛ వ్యాయామం.. అందులోనూ బరువులెత్తే వర్కవుట్లు వారానికి మూడు రోజుల పాటు క్రమంగా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వులు కూడా కరుగుతాయని ఓ అధ్యయనం చెబుతోంది.

వీటితో పాటు 6-8 గంటల పాటు సుఖ నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా-ధ్యానం.. వంటివీ పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో బరువు తగ్గించడానికి దోహదం చేస్తాయి. అలాగే మరీ అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా సప్లిమెంట్లు తీసుకుని కూడా బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్