టీనేజ్ పిల్లల్లో ఊబకాయం రాకుండా..!

మీ పిల్లలు చిన్న వయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చేసరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చేసరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలావరకు తగ్గుతుందట.

Published : 20 Dec 2023 12:34 IST

మీ పిల్లలు చిన్న వయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చేసరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చేసరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలావరకు తగ్గుతుందట. ఈ సమయంలో సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటివన్నీ ఇందుకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు వారు. కాబట్టి బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా టీనేజ్‌లో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర అనారోగ్యాల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో టీనేజ్‌లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే పిల్లల విషయంలో తల్లులు ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి...

చొరవ చూపాలి..

చాలామంది పిల్లలు వారిని ఏది చేయొద్దంటామో.. అదే చేస్తుంటారు. ఆహారం విషయంలోనూ అంతే! ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.. అని చెప్పినా సరే.. అవే తింటామని మొండికేస్తుంటారు. కానీ, వారిని అలాగే వదిలేస్తే టీనేజీలో స్థూలకాయం బారిన పడచ్చు. కాబట్టి చిన్నతనం నుంచే జంక్‌ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్.. వంటి కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు పిల్లల్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. అలాగని వాటిని పూర్తిగా తీసుకోవడం మానేయమంటే వాళ్లు అస్సలే వినరు. కాబట్టి మీరే నెలకో, పదిహేను రోజులకోసారో.. వారికి నచ్చిన ఏదో ఒక పదార్థం తక్కువ మొత్తంలో తినేలా చూడొచ్చు. అలాగే వారు రోజూ ఏం తింటున్నారు..? అనే దాని పైనా ఓ కన్నేసి ఉంచడం మంచిది. తద్వారా కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు వారు చేరువ కాకుండా జాగ్రత్తపడచ్చు.

ఓ అలవాటుగా..

టీనేజీలో స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అలాగని బరువు పెరిగిన తర్వాత కఠినతరమైన వ్యాయామాలు చేసి దాన్ని తగ్గించుకోవడం కంటే చిన్నతనం నుంచే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ మంచి జీవనవిధానాన్ని అలవర్చుకోవడం మంచిది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ వహించడం ఉత్తమం. ఈ క్రమంలో పెద్దలు వ్యాయామం చేస్తూ.. తమతో పాటు పిల్లల్ని పలు రకాల వ్యాయామాల్లో భాగం చేయాలి. నడక, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, మెట్లెక్కడం, యోగా, ఈత, డ్యాన్స్, ఆటలు.. వంటి వాటిని వారి వర్కవుట్‌ రొటీన్‌లో భాగం చేయాలి. ఇలా అలవాటైన తర్వాత క్రమంగా జిమ్, మెడిటేషన్ తరగతులు, ప్రత్యేక శిక్షణ తరగతుల్లో చేర్పించడం.. మొదలైనవి చేయడం వల్ల అటు మంచి లైఫ్‌స్త్టెల్ అలవడడమే కాకుండా.. ఇటు బరువు కూడా అదుపులో ఉంటుంది. తద్వారా టీనేజీలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవకుండా జాగ్రత్తపడచ్చు.

వీటికి దూరంగా..

పిల్లలు చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడడం వల్ల కూడా వారు టీనేజీకి వచ్చేసరికి స్థూలకాయం బారిన పడుతున్నారంటున్నారు నిపుణులు. టీవీ చూడడం.. మొబైల్స్, పీసీలో ఆటలాడడం, సోషల్‌ మీడియాలో చాటింగ్.. వంటివన్నీ కూర్చొని చేసేవే. ఇలా రోజులో అధిక సమయం కూర్చోవడం వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అసలు టీవీ చూడొద్దు.. గ్యాడ్జెట్స్ ముట్టుకోవద్దు.. అంటే వారు వినరు కాబట్టి రోజులో కొద్దిసేపు ఓ వినోదాత్మక కార్యక్రమమో, వారికి ఇష్టమైన మరేదైనా ప్రోగ్రామో.. చూడనివ్వడం మంచిది. అలాగే మొబైల్‌ ఉపయోగించేటప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచడం కూడా ముఖ్యమే! తద్వారా వాళ్లు తప్పు దారి పట్టకుండా ముందుగానే జాగ్రత్తపడచ్చు. ఫలితంగా ఊబకాయం రాకుండానూ ఉంటుంది.

కాస్త కష్టమైనా..

చిన్నపిల్లల్ని పండ్లు, పచ్చి కూరగాయలు, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినమంటే అస్సలు తినరు. కేక్స్, చిప్స్.. వంటివైతే ఇష్టంగా లాగించేస్తారు. ఎందుకంటే వాటి రుచి అలాంటిది మరి. అయితే పిల్లలు అమితంగా ఇష్టపడి తినే ఇలాంటి ఆహార పదార్థాలు వారి ఆరోగ్యానికి అంత మంచివి కావు అన్న సంగతి తెలిసిందే. అందుకే కాస్త కష్టమైనా వారికి చిన్నతనం నుంచే పండ్లు.. క్యారట్, బీట్‌రూట్ వంటి దుంపలు.. బాదం, జీడిపప్పు, పల్లీలు.. వంటి నట్స్ తినిపించడం అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా పెద్దవారిని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఆ పని మీరూ చేస్తూ.. వారిని కూడా చేయమని ప్రోత్సహించాలి. ఇలా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు చేయడం వల్ల వారు టీనేజీలో స్థూలకాయం బారిన పడకుండా కాపాడచ్చు.. తద్వారా వారి ఆరోగ్యాన్నీ సంరక్షించచ్చు.

టీనేజీ పిల్లల్లో స్థూలకాయాన్ని ఆపాలంటే చిన్నతనం నుంచే పిల్లల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవీ. మరి, మీరూ ఇలాంటి విషయాల్లో శ్రద్ధ వహించి.. నిపుణులు చెప్పిన చిట్కాల్ని పాటిస్తే ఈ సమస్యను చాలావరకు తగ్గించవచ్చు. ఫలితంగా మీ పిల్లల ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్