మెడను మెరిపించండిలా..!

ముఖం అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల క్రీములు, ప్యాక్‌లు వాడతాం. కానీ మెడ భాగానికొచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇరవైల్లో పెద్దగా తేడా తెలియకపోయినా.. వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం మెడ మీద బాగా కనిపిస్తుంది. మెడ చుట్టూ నల్లటి వలయం, సన్నటి ముడతలు, చిన్న చిన్న పొక్కులతో క్రమంగా చర్మం....

Published : 24 Sep 2022 19:53 IST

ముఖం అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల క్రీములు, ప్యాక్‌లు వాడతాం. కానీ మెడ భాగానికొచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇరవైల్లో పెద్దగా తేడా తెలియకపోయినా.. వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం మెడ మీద బాగా కనిపిస్తుంది. మెడ చుట్టూ నల్లటి వలయం, సన్నటి ముడతలు, చిన్న చిన్న పొక్కులతో క్రమంగా చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెడ సౌందర్యాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా మరి..!

ఇలా శుభ్రపరుచుకోవాలి..

ముఖంపై ఉండే చర్మం కన్నా మెడ చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకని ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడకూడదు. వీలైనంత వరకు రసాయనాలు లేని సబ్బు/ బాడీ వాష్‌లను వాడాలి. అంతేకాదు.. ముఖాన్ని శుభ్రం చేసుకునే ప్రతిసారీ మెడను కూడా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

స్క్రబ్ వాడాలి

చెమట వల్ల మెడపై చాలా త్వరగా మురికి చేరుతుంది. అంతేకాదు నిత్యం మనం ధరించే చెయిన్ల వల్ల కూడా మెడ పైన మురికి పేరుకునే అవకాశం ఉంది. సబ్బుతో పైపై మురికి పోయినా, చర్మ రంధ్రాల్లో పేరుకున్న మలినాలు పోవాలంటే స్క్రబ్బర్ తప్పనిసరి. ఇలా జరగకుండా ఉండాలంటే మనం వేసుకునే చెయిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి నాలుగుసార్లు స్క్రబ్బర్ వాడాలి.

❀ బాదం పలుకులని బరకగా పొడి చేసి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసి మెడకు పట్టించాలి. భుజాల నుంచి ముఖం వైపుగా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి, చల్లటి నీటితో కడిగేయాలి. ఐదు నిమిషాలకు మించి స్క్రబ్ చేయకూడదు. ఎందుకంటే అతిగా స్క్రబ్ చేయడం వల్ల పల్చని మెడ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

నెక్ ప్యాక్!

ఫేస్ ప్యాక్ వాడుతున్న ప్రతిసారీ మెడకి కూడా ప్యాక్ వేసుకోవడం తప్పనిసరి. బాగా పండిన అరటి పండు, లేదా గుమ్మడి పండు, బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఫ్రూట్ ప్యాక్‌లను వాడటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

❀ పాలమీగడలో పావు చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మెడ చుట్టూ పేరుకున్న నలుపు క్రమంగా తగ్గుతుంది.

టోనింగ్

ముఖంపై చర్మానికి టోనర్ వాడేప్పుడు మెడకు కూడా టోనర్ అప్త్లె చేయడం అలవాటు చేసుకోవాలి. కానీ మెడకి టోనర్ రాసుకునేప్పుడు నేరుగా చేతి వేళ్లతో కాకుండా దూదిని వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్