చీర.. చక్కగా!

మిగతా వేడుకలు ఎలాగున్నా.. పండగ సమయంలో చీరే అందం. ఇబ్బందల్లా.. ఆరోజంతా మనకు పని హడావుడే! చీర త్వరగా కట్టాలి.. అందంగా కనిపించాలి.. సౌకర్యంగా ఉండాలి.

Published : 14 Jan 2023 00:48 IST

మిగతా వేడుకలు ఎలాగున్నా.. పండగ సమయంలో చీరే అందం. ఇబ్బందల్లా.. ఆరోజంతా మనకు పని హడావుడే! చీర త్వరగా కట్టాలి.. అందంగా కనిపించాలి.. సౌకర్యంగా ఉండాలి.. ఎన్ని ఇబ్బందులు! తప్పించుకోవాలా.. ఈ చిట్కాలు పాటించేస్తే సరి!

* కావాల్సిన పిన్నులు, బ్లౌజు, పెట్టికోట్‌, నగలు సహా ముందే సిద్ధం చేసుకోండి. బ్లౌజు సరిపోతోందా, ఇస్త్రీ సరిగా ఉందా అన్నవీ చూసుకుంటే ఆరోజుకి ఇబ్బందుండదు. కొంగునీ ముందే సిద్ధం చేసుకుంటే సగం పని పూర్తవుతుంది.

* సరైన షేప్‌లో కనిపిస్తేనే చీర అందం. కాబట్టి సాధారణ పెట్టికోట్‌కి బదులుగా షేప్‌వేర్‌ పెట్టికోట్‌ను ఎంచుకోండి. శరీరానికి చీర అద్దినట్లుగా కనిపిస్తుంది.

* చీర కట్టేముందే చాలామంది కాస్త కిందకి కడతారు. చెప్పులు వేసినా పైకి వెళ్లినట్లుగా కనిపించకూడదని! తీరా వేసుకున్నాక కొన్నిసార్లు కింద ఈడుస్తున్నట్లు కనిపించడమో, కొద్దిగా పైకి వెళ్లినట్లో కనిపిస్తుంటుంది. ఈ సమస్య తీరాలంటే చెప్పులు వేసుకొని చీరకట్టుకోండి.

* ముందు చీర కొనను చిన్న ముడిగా వేసి దాన్ని లోపలికి దోపి, ఆపై మిగతా ప్రక్రియను కొనసాగించండి. మీ కాళ్ల కింద పడినా, ఎవరైనా తొక్కినా జారుతుందన్న భయం ఉండదు. చీర పక్కన కుచ్చులుగా కనిపిస్తోంటేనే చూడ్డానికి బాగుంటుంది కదా! ఫిష్‌ కట్‌గా పిలిచే ఇది సరిగ్గా అమరాలంటే.. కుచ్చిళ్లు పెట్టగా పక్కన మిగిలిన వస్త్రాన్ని వాటి కిందగా పక్కకులాగి తిప్పినట్లుగా చేసి, ఆపై దోపితే సరి.

* సాధారణంగా కుచ్చిళ్లను చీరతో కలిపి ఒకే పిన్ను పెడుతుంటాం. అలా కాకుండా కుచ్చిళ్లన్నింటినీ కలిపి ఒక పిన్ను పెట్టండి. చివరగా చీరతో కలిపి పెడితే లాగినట్లుగా అయినా సమస్య ఉండదు. కదలకుండానూ ఉంటాయి.

* పెద్ద పనుండదు.. కూర్చోవడమే అంటే ఏ చీర కట్టినా ఫర్లేదు. ఎక్కువ నడక, హడావుడి ఉంటే మాత్రం తేలికగా కదలడానికి వీలైనవి ఎంచుకోవాలి. పొయ్యి దగ్గర పని ఉంటుందనిపిస్తే వేడిని తట్టుకునేవి, చెమట చిరాకు కలిగించనివై ఉండాలి. ఇలా ఎంచుకుంటే అందంతోపాటు.. చీర సౌకర్యంగానూ అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్