తమ వంటలతో డిజిటల్ స్టార్లయ్యారు!
ఎంత ఆహార ప్రియులైనా ఎప్పుడూ తినే వంటకాలంటే బోర్ కొట్టేస్తుంటుంది. అందుకని చాలామంది విభిన్న వంటకాలను ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు.. కొంతమంది తమకు వచ్చిన వెరైటీ వంటల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇతరులతోనూ పంచుకుంటున్నారు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో....
(Photos: Instagram)
ఎంత ఆహార ప్రియులైనా ఎప్పుడూ తినే వంటకాలంటే బోర్ కొట్టేస్తుంటుంది. అందుకని చాలామంది విభిన్న వంటకాలను ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు.. కొంతమంది తమకు వచ్చిన వెరైటీ వంటల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇతరులతోనూ పంచుకుంటున్నారు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫుడ్ బ్లాగర్లుగానూ రాణిస్తున్నారు.. ఈ నలుగురూ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు.. మరి వీళ్ల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం రండి..
ఆ సమస్య నుంచి బయటపడడంతో..
తమిళనాడుకు చెందిన విజయలక్ష్మి ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) సమస్యతో బాధపడేవారట. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎంతోమంది డాక్టర్లను సంప్రదించినా పరిష్కారం లభించలేదు. ఒక దశలో తన సమస్యను చూసి స్నేహితులు కూడా ‘నువ్వు డైపర్లు వేసుకోవాలి’ అంటూ ఆట పట్టించేవారట. ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాల తర్వాత ఒక డాక్టర్ సలహా మేరకు వీగన్ డైట్ (మొక్కల ఆధారిత పదార్థాలు)ను పాటించడం మొదలుపెట్టారట. అది ఫలితాన్నివ్వడంతో కొంతకాలానికి సమస్య నుంచి బయటపడగలిగారు. ఈ క్రమంలో- వీగన్ డైట్ వల్ల తనకు లభించిన ఫలితాలను అందరికీ అందించాలనుకున్నారు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి విభిన్నమైన వీగన్ వంటకాల గురించి పంచుకోవడం ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో- ఆమె ఖాతాను అనుసరించే వారి సంఖ్య సుమారు 4 లక్షలకు చేరడం గమనార్హం.
బేకింగ్‌కి ఫొటోగ్రఫీ జత చేసి..
దిల్లీకి చెందిన దీబా రాజ్‌పాల్‌కు బేకింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు బేకింగ్‌తో పాటు ఫొటోగ్రఫీలో కూడా ప్రావీణ్యం ఉంది. అంతేకాకుండా వివిధ పత్రికలకు ఫుడ్ కన్సల్టెంట్‌గానూ పనిచేస్తున్నారు. బేకింగ్‌పై తనకున్న ఆసక్తితో Passionate About Baking అనే పుస్తకాన్ని కూడా రాశారు. అదే పేరుతో ఇన్‌స్టా ఖాతాను కూడా ప్రారంభించిన దీబా.. తన బేకింగ్ నైపుణ్యాలకు ఫొటోగ్రఫీని జత చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 2013లోనే ఇన్‌స్టా ఖాతాను ప్రారంభించిన ఆమెకు దాదాపు 4 లక్షల మంది అభిమానులు ఉన్నారు. దీబా కూడా 2022 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా తొలి 100 మంది డిజిటల్ స్టార్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
సాఫ్ట్‌వేర్‌ను వదిలేసి...
అర్చన తల్లికి వంటలు చేయడమంటే చాలా ఇష్టమట. ఆమె వివిధ రకాల వంటలకు సంబంధించిన వివరాలను సేకరించి ఇంట్లో ప్రయత్నించేవారట. అలా చిన్నప్పటి నుంచి తనకి కూడా వంటలు చేయడంపై ఆసక్తి పెరిగిందంటారు అర్చన. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా తన మనసు మాత్రం వంటలు చేయడం పైనే ఉండేదట. తల్లైన తర్వాత ఎక్కువ సమయాన్ని వంటలకే కేటాయిస్తూ, కొంతకాలానికి ‘అర్చనాస్ కిచెన్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 3.65 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె వెబ్‌సైట్‌లో దాదాపు 10 వేల వంటకాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. వివిధ వంటకాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంతో పాటు వీక్లీ మీల్ ప్లాన్స్, డిన్నర్ ఐడియాస్, లంచ్ బాక్స్ ఐడియాస్ కూడా అందిస్తున్నారు అర్చన.
డిజిటల్ స్టార్..!
తమిళనాడుకు చెందిన ఉమా రఘురామన్ (47)కి వంటలు చేయడమంటే ఆసక్తి. సుమారు 20 ఏళ్ల నుంచీ పిల్లల కోసం విభిన్నమైన వంటకాలను తయారు చేస్తున్నారామె. తన వంటకాల్లో ఎక్కువగా స్థానికంగా లభించే పదార్థాలనే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో తను చేసే వంటలను నలుగురికీ పరిచయం చేయాలనుకున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మాస్టర్ చెఫ్ మామ్’ అనే ఖాతాను ప్రారంభించారు. ఇందులో దోసెలు, పకోడీలు వంటి వివిధ రకాల స్నాక్స్‌తో పాటు వివిధ సలాడ్‌లకు సంబంధించిన రెసిపీలు, వాటి తయారీ విధానాన్ని పోస్ట్ చేయడం ప్రారంభించారు. అనతి కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఖాతాను దాదాపు 2.35 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వంటల వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా ‘మై జీనియస్ లంచ్ బాక్స్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ క్రమంలో పలు అవార్డులనూ అందుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా తొలి 100 మంది డిజిటల్ స్టార్స్ జాబితాలో కూడా ఉమ స్థానం దక్కించుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.