అమ్మదిద్దిన ఐపీఎస్‌లు

చదువుకున్న అమ్మ తన కుటుంబానికి మాత్రమే అండగా ఉండదు. తన బిడ్డలని సమాజం మొత్తానికి వెలుగునిచ్చే చైతన్య దీపికల్లా తీర్చిదిద్దుతుంది.

Updated : 10 Feb 2023 07:10 IST

చదువుకున్న అమ్మ తన కుటుంబానికి మాత్రమే అండగా ఉండదు. తన బిడ్డలని సమాజం మొత్తానికి వెలుగునిచ్చే చైతన్య దీపికల్లా తీర్చిదిద్దుతుంది. ఈ ముగ్గురూ అలా అమ్మలు దిద్దిన ఐపీఎస్‌లే. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీ నుంచి శిక్షణ పొంది వివిధ విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని వసుంధర పలకరించింది...


ఎందుకొచ్చిన కష్టం అనుకున్నా..

మాది రాజస్థాన్‌లోని ఖేత్రి. నాన్న భూపేష్‌ ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌. అమ్మ సునీత ఉపాధ్యాయురాలు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తపన పడేది. ఆ స్ఫూర్తితోనే.. దిల్లీ ఐఐటీలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదివేటప్పుడు సివిల్స్‌ రాయాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఎంపికై ఇక్కడ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాక రోజులో 13 గంటలపాటు శ్రమించేదాన్ని. ఈత, పరుగు, ఫైరింగ్‌, డ్రిల్‌ అంటూ కఠినమైన శిక్షణ ఉండేది. తొమ్మిది కేజీల బరువుతో 40 కిలోమీటర్ల దూరం అర్ధరాత్రుళ్లు నడవాల్సి ఉంటుంది. ఎందుకీ కష్టం అనిపించేది. సాధారణ మహిళగా ఉండే నన్ను ఓ శక్తిమంతమైన పోలీసు ఆఫీసర్‌గా తీర్చిదిద్దింది ఈ శిక్షణే కదా అని గుర్తుకొచ్చిన మరుక్షణం.. నైరాశ్యాన్ని పక్కనపెట్టి అందరికన్నా ముందుండేదాన్ని. ఈ శిక్షణలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నా. ఇండోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణలో ప్రథమ స్థానంతోపాటు స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ గౌరవాన్ని అందుకున్నా. ది బెస్ట్‌ అవుట్‌డోర్‌ ప్రొబెషనర్‌గా, ప్లటూన్‌ కమాండర్‌గా నిలిచాక నేను పడిన కష్టమంతా మరచిపోయా. అకాడమీ చరిత్రలో ఈ స్థానాన్ని దక్కించుకున్న రెండో మహిళగా నిలవడం గర్వంగా ఉంది. క్షేత్ర పర్యటనలో భాగంగా ఒకసారి జైలుకెళ్లాం. అనుకోని తప్పిదాలతో శిక్ష అనుభవిస్తూ.. ఆ తర్వాత  పశ్చాత్తాపంతో కుంగిపోతున్న వారినెందరినో చూశా. వారి కథలను మరవలేను. అనుకున్నది సాధించగలిగే సత్తా మనందరిలోనూ ఉంటుంది. మనల్ని మనం నమ్మితే చాలు.


ప్రయత్నం ఆపకూడదు

శేషాద్రినిరెడ్డి

మాది హైదరాబాద్‌. నాన్న సుధాకర్‌రెడ్డి సివిల్‌ కాంట్రాక్టర్‌. అమ్మ కవిత గృహిణి. ఒక తమ్ముడు. సేవాగుణం ఉన్న నాన్నను చూసి నాకూ ప్రజాసేవ చేయాలని ఉండేది. హైదరాబాద్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. ఆ తర్వాత సివిల్స్‌కు హాజరయ్యా. మొదటిసారి నిరాశే ఎదురయ్యింది. బాధపడ్డా. అమ్మానాన్నల ప్రోత్సాహంతో వైఫల్యం నుంచే విజయాన్ని వెతుక్కోవాలని రెండోసారి పట్టుదలగా ప్రయత్నించా. నేను కోరుకున్నట్టుగా ఐఏఎస్‌ దక్కలేదు కానీ ఐపీఎస్‌ వచ్చింది. రెండింటికీ ప్రజాసేవే లక్ష్యం కదా. అందుకే సంతోషంగా శిక్షణ తీసుకున్నా. మీకెవరు స్ఫూర్తి? అని చాలామంది అడుగుతుంటారు. నాకెదురయ్యే ప్రతి వ్యక్తి నుంచీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. అమ్మానాన్న, స్నేహితులు.. నాకు తెలియనివెన్నో నేర్పారు. ఆడవాళ్లం అనే కారణంతో భయపడి వెనుకడుగు వేయకూడదు. అనుకున్నది సాధించడానికి ప్రయత్నం ఆపకూడదు. ప్రస్తుతం సైబర్‌క్రైం ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై పనిచేయాలని ఉంది.


ఉద్యోగం వదులుకుని..
నిత్య రాధాకృష్ణన్‌

నాలుగేళ్ల పాటు ఐటీలో, రెండున్నరేళ్లు అకౌంట్స్‌లో పనిచేశా. పెళ్లై, బాబు ఉన్నాడు. ఆ తర్వాతే ఐపీఎస్‌ అవ్వాలనిపించింది. అమ్మయ్యాక ఐపీఎస్‌ కావాలన్న ఆలోచన రావడానికి కారణం మా అమ్మ అనుపమాదేవి. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పట్టుదలగా చదివి ఉపాధ్యాయిని అయ్యింది. ఆమె ఇచ్చిన స్ఫూర్తి.. మావారి ప్రోత్సాహంతో సివిల్స్‌ రాసి విజయం సాధించా. మాది తమిళనాడులోని తలైవాసల్‌. నాన్న రాధాకృష్ణన్‌ రైతు. పెళ్లై బాబుకు ఏడేళ్లొచ్చాక ప్రవేశపరీక్ష రాసి సివిల్స్‌కు ఎంపికయ్యా. క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. అందుకే యోగా, ఫైరింగ్‌, గుర్రపుస్వారీ, ఈత అన్నింటినీ ఆస్వాదించా. ఇష్టపడి వచ్చినందుకేమో కష్టమనిపించలేదు. శిక్షణలో భాగంగా అర్ధరాత్రి 9 కేజీల బరువుతో ఎనిమిది గంటలపాటు 40 కి.మీ. రూట్‌ మార్చ్‌, రెండు గంటల్లో  21 కి.మీ. మారథాన్‌ వంటివి ఎప్పటికీ మరిచిపోను. అవుట్‌డోర్‌ ట్రైనింగ్‌లో ‘బెస్ట్‌ లేడీ ప్రొబెషనర్‌’గా ట్రోఫీ తీసుకున్నా. ట్రాన్స్‌ జెండర్స్‌, వేశ్యా వృత్తుల్లో ఉన్నవారికి చట్టపూర్వకంగా చేయూతనందించాలని ఉంది. ‘అమ్మా.. నాన్న కదా పోలీసు అవ్వాలి. నువ్వు అయ్యావేంటి? అని మా అబ్బాయి అడిగినప్పుడు ఆశ్చర్యమేసింది. లింగభేదం లేదనే విషయాన్ని ముందుగా వాడికి నేర్పడం మొదలుపెట్టా. నేటి తరం అమ్మాయిలకూ ఇదే చెబుతున్నా... మనసుకిష్టమైంది చేయండి. పట్టుదల ముందు ఏదైనా తల వంచి తీరాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్