చిన్నారులకు తియ్యతియ్యగా..

వేసవి మొదలైంది. ఎండ వేడికి పిల్లలు త్వరగా అలసిపోతుంటారు. తియ్యతియ్యగా పోషకమయమైన పానీయాలు, స్మూతీలను అందించడం మంచిదంటున్నారు ఆహారనిపుణులు. పాలను మాత్రమే ఇస్తుంటే పిల్లలు బోర్‌ ఫీలవుతుంటారు. తీసుకోవడానికి ఇష్టపడరు.

Published : 25 Feb 2023 00:27 IST

వేసవి మొదలైంది. ఎండ వేడికి పిల్లలు త్వరగా అలసిపోతుంటారు. తియ్యతియ్యగా పోషకమయమైన పానీయాలు, స్మూతీలను అందించడం మంచిదంటున్నారు ఆహారనిపుణులు.

పాలను మాత్రమే ఇస్తుంటే పిల్లలు బోర్‌ ఫీలవుతుంటారు. తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు పండ్లరసానికి కాస్తంత గట్టి పెరుగు కలపాలి. వీలైతే నాలుగైదు చెంచాల ఓట్‌మీల్‌ను కూడా జత చేసి...పైన ఆకర్షణీయంగా గుప్పెడు దానిమ్మ గింజలను చల్లి స్మూతీగా ఇచ్చి చూడండి. పోషకవిలువలతోపాటు కొత్తగా, మరింత రుచిగా అనిపిస్తుంది. లొట్టలేసుకుంటూ పిల్లలు మొత్తం ఆరగించేస్తారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచి..

ఆటలాడి అలసిపోయి వచ్చిన చిన్నారులకు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి ఉండే నారింజ రసంతో వేసవి పానీయం చేసి ఇవ్వొచ్చు. ఇది నిమిషాల్లో తయారవుతుంది కూడా. తక్షణ శక్తినీ ఇస్తుంది. నారింజ రసానికి చిటికెడు చక్కెర కలిపి నాలుగు పుదీనా ఆకులు వేయాలి. సర్వ్‌ చేసేముందు అర్ధచంద్రాకారంలో పలుచగా కట్‌ చేసిన నారింజ కాయ ముక్కలను పానీయంలో మునిగేలా వేసి స్ట్రాతో ఇవ్వండి. ఈ చల్లని పానీయంతో పిల్లలకు తక్షణ శక్తి అందుతుంది.

కీరదోస కలిపి..

ఎండలో ఆడి.. అలసి ఇంటికి చేరిన పిల్లలకు నిమ్మ, కీరదోస పానీయం అద్భుతమైన ఔషధం. గ్లాసు నీటిలో ఒక నిమ్మచెక్క రసాన్ని పిండి తగినంత చక్కెరను కలపాలి. ఇందులో సన్నగా పల్చని చక్రాల్లా కోసిన కీరదోస ముక్కలు, నాలుగైదు పుదీనా ఆకులు వేసి అలంకరణగా అందించి చూడండి. రిఫ్రెష్‌ చేయడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుందీ పానీయం.

జీర్ణశక్తికి..

దాహానికి అడ్డుకట్ట వేయాలా? దానికి సాయపడుతుంది ఇది. కప్పు తీయని పెరుగు, సమానంగా నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. సర్వ్‌ చేసే ముందు నాలుగైదు మిరియాల పొడి, అయిదారు పుదీనా ఆకులు వేసి ఇచ్చి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్