బరువు తగ్గించే ‘బీరకాయ సూప్’!

చాలామంది బరువు తగ్గే క్రమంలో డైటింగ్ చేయడం మామూలే. అయితే ఇలా నోరు కట్టేసుకోవడం వల్ల బరువు తగ్గడమేమో గానీ లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు....

Published : 19 Apr 2024 13:22 IST

చాలామంది బరువు తగ్గే క్రమంలో డైటింగ్ చేయడం మామూలే. అయితే ఇలా నోరు కట్టేసుకోవడం వల్ల బరువు తగ్గడమేమో గానీ లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు. అందుకే డైటింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టమంటున్నారు. క్యాలరీలు తక్కువగా, పోషకాలు మెండుగా ఉన్న ఈ ‘బీరకాయ రైస్‌ సూప్‌’ కూడా అలాంటిదే!

అరగంటలో రడీ!
అతి తక్కువ క్యాలరీలు ఉండే బీరకాయలతో కూర ఒక్కటే కాదు.. చట్నీ, రైతా, జ్యూస్‌ వంటి ఎన్నో రుచికరమైన వంటకాలు సైతం తయారుచేసుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు బీరకాయలతో తయారుచేసిన ఈ ‘రైస్‌ సూప్‌’ను ఎంచుకోవడం ఉత్తమం.

కావాల్సిన పదార్థాలు
* బీరకాయలు (మీడియం సైజు) - 2 (తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి)
* నానబెట్టిన బాస్మతీ బియ్యం - 2 కప్పులు
* నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
* పోపు దినుసులు - టీస్పూన్
* ఎండుమిర్చి - 3
* వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు
* ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
* బంగాళాదుంప – ఒకటి (తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి)
* ఎర్ర గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
* పసుపు - ముప్పావు టీస్పూన్
* నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్‌ (బరకగా దంచి పెట్టుకోవాలి)
* కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు
* నిమ్మకాయ – ఒకటి
* ఉప్పు - రుచికి సరిపడా

తయారీ
* ముందుగా నాన్‌స్టిక్‌ ప్యాన్‌లో నూనె వేడి చేసి.. అది వేడెక్కాక పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఎండు మిర్చి వేసి మరికాసేపు వేయించాలి.
* ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేసి వేగనివ్వాలి.
* ఇప్పుడు ఇందులో బంగాళాదుంప, గుమ్మడికాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
* ఇవి కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేసేయాలి. మరోసారి బాగా కలుపుకొని.. ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. స్టౌ సిమ్‌లో పెట్టి బియ్యంతో పాటు కూరగాయలు బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి.
* ఆఖర్లో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి.


ఆరోగ్య ప్రయోజనాలివే!
* రుచికరమైన ఈ బీరకాయ రైస్‌ సూప్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే వారికి ఇది మంచి ఆహారం.
* బీరకాయల్లో ఉండే అధిక ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచుతుంది.
* బీరకాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
* విటమిన్‌-సి, ఐరన్‌, మెగ్నీషియం, థయమిన్‌.. వంటి పోషకాలతో నిండి ఉండే బీరకాయలతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
* రక్తహీనతతో బాధపడే మహిళలు బీరకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
* ఆరోగ్యానికే కాదు.. అందానికీ బీరకాయ మంచిదంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్‌ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మానికి పోషణనందించి మెరుపునిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్