Nurses Day: నిస్వార్థమైన సేవతో.. ‘మదర్’ వారసులుగా..!

వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే వృత్తినే ఎక్కువగా ప్రేమించారు ఈ ఇద్దరు మహిళలు.. రోగులకు సేవ చేయడమే తమ జీవిత పరమావధిగా మార్చుకున్నారు.. నలుగురి ఆరోగ్యంలోనే తమ సంతోషాన్ని వెతుక్కున్నారు.. నర్సింగ్‌ వృత్తిని ఎంచుకొని తమ నిస్వార్థమైన....

Updated : 13 May 2023 16:22 IST

(Photos: Instagram)

వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే వృత్తినే ఎక్కువగా ప్రేమించారు ఈ ఇద్దరు మహిళలు.. రోగులకు సేవ చేయడమే తమ జీవిత పరమావధిగా మార్చుకున్నారు.. నలుగురి ఆరోగ్యంలోనే తమ సంతోషాన్ని వెతుక్కున్నారు.. నర్సింగ్‌ వృత్తిని ఎంచుకొని తమ నిస్వార్థమైన సేవలతో ఎంతోమంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు భారత సంతతికి చెందిన ఇద్దరు నర్సులు.. శాంతి థెరెసా లక్రా, జిన్సీ జెర్రీ. వీరి అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది ‘అంతర్జాతీయ నర్సింగ్ అవార్డు’ పోటీల తుది జాబితాలో వీరికి చోటు దక్కింది. ఇందులో భాగంగా టాప్‌-10లో స్థానం సంపాదించిన ఈ ఇద్దరు నర్సుల సేవాదృక్పథం గురించి ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

నిష్కల్మషమైన మనసుకు, నిస్వార్థమైన సేవలకు ప్రతీక నర్సింగ్‌ వృత్తి. ఇలాంటి గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకొని.. రోగులకు వైద్యసేవలందిస్తున్నారు ఎందరో నర్సులు. తమకూ ఈ వృత్తిలోనే సంతోషం, సంతృప్తి దొరుకుతున్నాయంటున్నారు శాంతి, జిన్సీ. తమ నిస్వార్థమైన సేవలకు గుర్తింపుగా వీరిద్దరూ ఈ ఏడాది ‘అంతర్జాతీయ నర్సింగ్‌ అవార్డు’ తుది పోటీలో నిలిచారు. దుబాయ్‌ ప్రధాన కార్యాలయంగా భారత్‌, గల్ఫ్‌ దేశాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ప్రైవేట్‌ సంస్థ ‘ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌’ ఏటా ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఇందులో గెలుపొందిన విజేతకు అవార్డుతో పాటు, 2.50 లక్షల డాలర్ల (సుమారు రూ. 2.05 కోట్ల) నగదు బహుమతి అందిస్తారు.


గిరిజనుల సేవా మూర్తి!

సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, నీళ్లు.. వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఇక వైద్య సదుపాయాల ఊసే అక్కడ వినిపించదు. ఈ క్రమంలో చాలా వరకు తమకొచ్చిన ఆరోగ్య సమస్యల్ని మూలికా వైద్యంతోనే నయం చేసుకుంటుంటారు అక్కడి ప్రజలు. అయితే ఇది అన్ని సమయాల్లోనూ శ్రేయస్కరం కాదు.. ఈ విషయం చెప్పినా వాళ్లకు అర్థం కాదు. మరోవైపు తమ ఆరోగ్య సమస్యల గురించి బయటికి చెప్పుకోవడాన్ని కూడా తప్పుగా భావిస్తుంటారు. ఇలాంటి మనస్తత్వాల్ని అర్థం చేసుకొని.. కొన్నేళ్లుగా గిరిజన ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు అండమాన్‌ నికోబార్‌ దీవులకు చెందిన నర్సు శాంతి లక్రా. ఓవైపు పోర్ట్‌బ్లెయిర్‌లోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో పనిచేస్తూనే.. మరోవైపు ఆ దీవుల్లో నివాసముండే మారుమూల గిరిజన ప్రజలకు సేవ చేస్తున్నారామె. దశాబ్దాలుగా వీరి సేవలోనే తరిస్తోన్న శాంతి.. 2004లో వచ్చిన సునామీ సమయంలోనూ ఇక్కడి ఓంగీ ద్వీప ప్రజల వెన్నంటే ఉన్నారు. వారు తీర ప్రాంతాన్ని వదిలి అడవి లోపల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుంటే తానూ వాళ్లతో పాటే వెళ్లి.. వాళ్లలో ఒకరిగా గుడారం వేసుకొని మరీ వారికి వైద్య సేవలందించారామె. ఊపిరున్నంత వరకు తన జీవితం గిరిజన సేవకే అంకితం అంటోన్న శాంతి.. ఈ క్రమంలో పలు సవాళ్లూ ఎదుర్కొన్నానంటున్నారు.

వాళ్ల నమ్మకం చూరగొన్నాకే..!

‘మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరక్షరాస్యులు. ఇతరులు మంచి చెప్పినా వారు అర్థం చేసుకోలేరు. తమకు తెలిసిందే కరక్ట్‌ అన్న భావనలో ఉంటారు. ముఖ్యంగా ఇక్కడి మహిళలు తమ ఆరోగ్య సమస్యల్ని బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అలా చెబితే తామేదో పెద్ద తప్పు చేసినట్లుగా ఫీలవుతారు. ఇలాంటి మొండి మనస్తత్వం ఉన్న వాళ్లతో మొదట్లో మాట్లాడడం కూడా నాకు కష్టంగానే అనిపించేది. అందులోనూ వాళ్ల భాష నాకు రాదు.. నా భాష వాళ్లకు అర్థం కాదు. ఇది సవాలుగా మారింది. అయినా వాళ్లను నా దారిలోకి తెచ్చుకోవడం కాకుండా.. నేనే వాళ్ల దారిలోకి వెళ్లి.. ఆయా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మొదలుపెట్టా. దాంతో వాళ్లలో క్రమంగా మార్పు రావడం, నన్ను అర్థం చేసుకోవడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్నా.. ఊపిరున్నంత వరకు ఈ సేవను ఇలాగే కొనసాగిస్తా. గుర్తింపు కోసం నేనెప్పుడూ ఎదురుచూడలేదు.. తాజాగా ‘అంతర్జాతీయ నర్సింగ్‌ అవార్డు’ తుది రేసులో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడి దాకా వస్తానని కలలో కూడా అనుకోలేదు..’ అంటూ చెప్పుకొచ్చారు శాంతి.

ఇలా తన నిస్వార్థమైన సేవలకు గుర్తింపుగా.. 2010లో ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’, 2011లో ‘ఉత్తమ ఆరోగ్య కార్యకర్త అవార్డు’ అందుకున్న ఆమెను.. అదే ఏడాది ‘పద్మ శ్రీ’ కూడా వరించింది. అంతేకాదు.. ‘ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ బెస్ట్‌ వలంటీర్‌’గానూ గుర్తింపు పొందారు శాంతి.


టెక్నాలజీతో సేవలు!

ఈ సాంకేతిక యుగంలో ఎన్నో సమస్యలు టెక్నాలజీతో పరిష్కారమవుతున్నాయి.. ఇదే టెక్నాలజీతో వైద్య రంగంలోనూ పలు సమస్యలకు పరిష్కారం చూపచ్చని నిరూపిస్తున్నారు ఇండో-ఐర్లండ్‌ నర్సు జిన్సీ జెర్రీ. వైద్య పరీక్షల్లో నాణ్యత, రోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఇదే సాంకేతికతను ఉపయోగించుకొని పలు ఆవిష్కరణలకు తెర తీశారామె. కేరళలో పుట్టిపెరిగిన ఆమె ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం డబ్లిన్‌లోని Mater ఆస్పత్రిలో ‘ఇన్ఫెక్షన్‌ నివారణ-నియంత్రణ నర్సింగ్‌’ విభాగానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు జిన్సీ. మరోవైపు యూకేలోని ‘ఇన్ఫెక్షన్‌ నివారణ మండలి’లోనూ భాగమైన ఆమె.. రోగికి సంబంధించిన రోగనిర్ధారణ, చికిత్స ఫలితాల్ని తప్పుల్లేకుండా కచ్చితంగా అందించేందుకు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ చొరవే ఆమెను ఈ ఏటి ‘అంతర్జాతీయ నర్సింగ్‌ అవార్డు’ రేసులో నిలిపింది.

అదే నా లక్ష్యం!

‘ప్రతి రోజూ నా బృందంతో కలిసి రోగికి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తాను. ఒక్కోసారి ఈ చర్చలు పలు క్లినికల్‌ ట్రయల్స్‌కి దారితీస్తాయి. తద్వారా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. 2020లో కొవిడ్‌ విజృంభణ సమయంలో మా ఆస్పత్రిలో నేను తీసుకొచ్చిన రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ వ్యవస్థ కూడా ఇలాంటిదే! ఆ సమయంలో మా పని భారాన్ని తగ్గించుకొని, రోగులకు ఉత్తమ వైద్య సేవలందించే క్రమంలో ఇది మాకు ఎంతగానో ఉపయోగపడింది. మేం నిర్వహించే వర్క్‌షాప్స్‌లో భాగంగా ఆయా సమస్యల పరిష్కారానికి టీమ్‌ నుంచి సృజనాత్మక ఆలోచనల్ని ఆహ్వానిస్తాం. ఇక రోగికి సంబంధించిన రోగనిర్ధారణ, చికిత్స ఫలితాల్ని తప్పుల్లేకుండా కచ్చితంగా అందించేందుకు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాను. నా ఆవిష్కరణల్ని యాప్స్‌గా అభివృద్ధి చేసి.. ప్రపంచంలోని ప్రతి ఆస్పత్రి వాటిని ఉచితంగా పొందేలా చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం మరో ఎనిమిది సాంకేతిక ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందులో ఆస్పత్రి పరిశుభ్రత విషయంలో కృత్రిమ మేధను ఉపయోగించి మేం తయారుచేస్తోన్న పరికరం కూడా ఒకటి.. టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.. నర్సింగ్‌ వంటి తీరిక లేని వృత్తిలో ఇది మరింత ఉపయుక్తం..’ అంటూ చెప్పుకొచ్చారు జిన్సీ.

ప్రస్తుతం ‘RPA సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ సంస్థతో మమేకమై కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తోన్న ఆమె.. తన సాంకేతిక సేవలకు గుర్తింపుగా 2021లో ‘ప్రి హ్యూబర్ట్‌ ట్యూటర్‌ ఇన్నొవేషన్ అకాడమీ అవార్డు’ అందుకున్నారు. ‘2020 ఐరిష్‌ హెల్త్‌కేర్‌ అవార్డు’ల్లో భాగంగా ‘సాంకేతికతను అత్యుత్తమంగా ఉపయోగించుకున్నం’దుకు గాను ఆమెకు గుర్తింపొచ్చింది.

ఈ పోటీలో లండన్‌కు చెందిన మార్గరెట్‌ హెలెన్‌ షెఫర్డ్‌ గెలుపొందారు. ఆమె మోనోజెనిక్‌ డయాబెటిస్‌కు చికిత్స చేయడంలో యూకేలోనే అత్యుత్తమ నర్సుగా పేరు తెచ్చుకున్నారు.  అంతేకాకుండా ఈ సమస్యకు సంబంధించిన అంశాలపైనా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్