Ponniyin Selvan: ఈ రాజసం వెనుక.. ఆ ఇద్దరూ!

చరిత్రాత్మక చిత్రాలంటే.. అందరి కళ్లూ కథతో పాటు కథకు ప్రాణం పోసే పాత్రల పైనే ఉంటాయి. నాటి కాలానికి చెందిన రాజులు-రాణుల ఆహార్యం ఎలా ఉండేదో తెలుసుకోవాలన్న ఆతృత చాలామందిలో సహజం. నిజానికి వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలున్నా.. ఆ కాస్ట్యూమ్స్‌, నగలు రూపొందించడమంటే.....

Updated : 01 Oct 2022 13:28 IST

చరిత్రాత్మక చిత్రాలంటే.. అందరి కళ్లూ కథతో పాటు కథకు ప్రాణం పోసే పాత్రల పైనే ఉంటాయి. నాటి కాలానికి చెందిన రాజులు-రాణుల ఆహార్యం ఎలా ఉండేదో తెలుసుకోవాలన్న ఆతృత చాలామందిలో సహజం. నిజానికి వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలున్నా.. ఆ కాస్ట్యూమ్స్‌, నగలు రూపొందించడమంటే ఓ సవాలనే చెప్పాలి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం అలాంటి సవాలునే స్వీకరించి సక్సెసయ్యారు ఇద్దరు మహిళలు. వాళ్లే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఎకా లఖానీ, జ్యుయలరీ డిజైనర్‌ ప్రతీక్షా ప్రశాంత్‌. కుందవై, నందిని పాత్రలతో పాటు ఇందులోని ప్రతి పాత్రా ఓ అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకున్నారీ ఇద్దరు డిజైనర్లు. ఇది రోజుల శ్రమ కాదు.. నెలలు, సంవత్సరాల కృషి, అధ్యయనం అంటున్నారు. ‘ఇలాంటి సవాలుతో కూడుకున్న పాత్రలను తీర్చిదిద్దినప్పుడే మనలోని సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది!’ అంటోన్న ఎకా, ప్రతీక్షా.. ఈ జర్నీలో తమకెదురైన అనుభవాలు, అనుభూతుల్ని ఇలా పంచుకున్నారు.

దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బహు భాషా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్‌ టాక్‌ అందుకుంటోన్న ఈ సినిమాకు తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల మాతృక. చోళుల కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్‌, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రధానంగా కుందవై దేవిగా త్రిష, నందినిగా ఐష్‌ పాత్రలకు సంబంధించిన ప్రతి లుక్‌ ప్రేక్షకుల్ని ఆది నుంచే ఆకట్టుకుందని చెప్పచ్చు. దీనికి కారణం.. వారు ధరించిన కాస్ట్యూమ్స్‌, నగలే అనడంలో సందేహం లేదు. వీటి రూపకర్తలే ప్రముఖ డిజైనర్లు ఎకా లఖానీ, ప్రతీక్షా ప్రశాంత్‌. నాటి కాలానికి తగినట్లుగా నగల్ని, దుస్తుల్ని రూపొందించడానికి ఓ చిన్నపాటి అధ్యయనమే చేశామంటున్నారీ ఇద్దరు డిజైనర్లు.

వీటినే ఎక్కువగా ధరించేవారట!

సాధారణంగా చోళుల కాలంలో సంప్రదాయ వస్త్రాభరణాలంటే.. నేత వస్త్రాలు, టెంపుల్‌ జ్యుయలరీని ఎక్కువగా ధరించేవారట! నెక్‌పీసెస్‌ దగ్గర్నుంచి వడ్డాణం, ముక్కెర, చేతి వంకీలు, గాజులు, ఉంగరాల దాకా.. ఇలా ప్రతి ఒక్కటీ రూబీ, బంగారంతో.. ప్రత్యేకమైన డిజైన్లతో రూపుదిద్దుకునేది. ఇక దుస్తుల విషయానికొస్తే.. చేత్తో నేసిన కాటన్‌, టై&డై దుస్తులు, కాంజీవరం పట్టు చీరలు, పట్టుబట్టలు.. వంటివే ఎక్కువగా ధరించేవారట ఆ రాజవంశీయులు. ఇలా నాటి కాలానికి తగ్గట్లుగా నగల్ని, దుస్తుల్ని డిజైన్‌ చేయాలంటే.. వాటికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలు ఉంటే సరిపోదు.. అందుకు మరింత లోతుగా పరిశోధన జరగాలి. ఇలాంటి మధనమే చేశామంటున్నారు డిజైనర్లు ఎకా, ప్రతీక్షా.


పునఃసృష్టి చేసినట్లనిపించింది!

‘పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రం కోసం పని చేయడమంటే ఓ అధ్యయనమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రక కథ. అప్పటి వాళ్ల ఆహార్యం, భావోద్వేగాలు.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ అంతే! అందుకే చోళ రాజవంశీయుల సంప్రదాయ వస్త్రధారణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ముందుగా నేను తంజావూరు దేవాలయాల్ని సందర్శించాను. ఆలయ స్తంభాలు, గోపురాలు, పైకప్పులపై శిల్పులు చెక్కిన డిజైన్లను పరిశీలించాను. దీని ద్వారా వాళ్లు సాధారణంగా ఉపయోగించిన డిజైన్లేంటో నాకు అర్థమైంది. అలాగే వాళ్లు ఎక్కువగా చేనేత వస్త్రాలు, టై & డై దుస్తుల్నే ఎక్కువగా ఉపయోగించే వారని అక్కడి చేతివృత్తుల కళాకారులని కలిశాక నాకు అర్థమైంది. ఇక రంగుల విషయానికొస్తే.. పసుపు, ఎరుపు, ఊదా.. వంటి రంగులకే ప్రాధాన్యమిచ్చేవారట!

ఈ కనీస పరిజ్ఞానంతోనే ముందుగా ఆ రాజవంశీయుల స్కెచ్‌లు రూపొందించాం. వాటిని బట్టి పాత్రలకు తగినట్లుగా కొలతలు తీసుకొని మోడల్ దుస్తులు కుట్టి.. ఓసారి పరీక్షించాకే అసలైన దుస్తులు రూపొందించాం. ఇక దుస్తుల రంగుల కోసం సహజసిద్ధమైన డైలు, ఉత్పత్తుల్నే వాడాం. కొన్ని అవుట్‌ఫిట్స్‌ను కాంజీవరం పట్టు ఉపయోగించి రాయల్‌గా తీర్చిదిద్దాం. మొత్తానికి ఇలా నెలల పాటు మేం పడిన శ్రమతో ఆయా పాత్రలకు పునఃసృష్టి చేసినట్లనిపించింది.. ఇది నిజంగా ఓ అందమైన అనుభూతి!’ అంటోంది ఎకా.

నటనను వదిలి.. డిజైనింగ్‌ వైపు!

చిత్ర పరిశ్రమలో మేటి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎకా లఖానీకి పేరుంది. పాత్రకు తగినట్లుగా అది వింటేజ్‌ కాస్ట్యూమ్‌ అయినా, ఈ కాలానికి తగినట్లుగా ఆధునిక హంగులద్దాలన్నా, చారిత్రక థీమ్‌తో కూడినదైనా.. ఇలా ఎలాంటి దుస్తుల్నైనా రూపొందించడంలో ఎకాది అందెవేసిన చేయి. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించినా.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై మక్కువతో ఈ రంగంలోకి వచ్చారామె. ఈ క్రమంలోనే ఫ్యాషన్‌కు సంబంధించిన వివిధ విభాగాల్లో 18 షార్ట్‌టర్మ్‌ కోర్సులు కూడా పూర్తి చేశారు. అదృష్టమంటే తనదే అన్నట్లుగా.. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రావణ్‌’ సినిమాలో తొలిసారి ఆమెకు అవకాశమొచ్చింది. దీనికి అసిస్టెంట్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె తన నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచుకున్నారు. ఇక ఆపై ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

పన్నెండేళ్ల కెరీర్‌లో..!

‘ఉరుమి’ చిత్రంతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా తెరంగేట్రం చేసిన ఎకా.. తన పన్నెండేళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలకు పనిచేశారు. ‘సంజూ2, ‘ది స్కై ఈజ్‌ పింక్‌’, ‘ఎన్‌హెచ్‌ 10’, ‘ఓకే జానూ’, ‘24’, ‘రాధే శ్యామ్‌’.. వంటివి అందులో కొన్ని! ఇలా సినిమాలకే కాదు.. వ్యక్తిగతంగా హీరో హీరోయిన్లకు, పెళ్లిళ్లు-ఇతర శుభకార్యాలకూ దుస్తుల్ని రూపొందిస్తుంటారు ఎకా. తన కృషికి గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులూ అందుకున్నారామె. ఎప్పటికైనా దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఉపయోగించే పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే తన లక్ష్యమం’టున్నారీ ట్యాలెంటెడ్‌ డిజైనర్.


పూల నగలకే ప్రాధాన్యం!

దుస్తులకు తగిన ఆభరణాలుంటేనే.. ఆ పాత్రలోని రాజసం ఉట్టిపడుతుంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం అంచనాల్ని అందుకోవడంలో వందకు వంద శాతం సక్సెసయ్యారు ప్రముఖ జ్యుయలరీ డిజైనర్‌ ప్రతీక్షా ప్రశాంత్‌. ఈ చిత్రం కోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు.

‘ఆభరణాల డిజైన్‌ కోసం.. ముందుగా చోళుల వర్తక వ్యాపారాల గురించి తెలుసుకున్నాం. ఈ క్రమంలో వాళ్లు తమ నగల కోసం బర్మా రూబీలను ఉపయోగించేవారని అవగతమైంది. ఇక నగల కోసం వారు వాడిన డిజైన్ల గురించి తెలుసుకోవడానికి మరింత లోతైన పరిశోధన చేశా. చోళులు ఎక్కువగా శైవ సిద్ధాంతాన్నే అనుసరించేవారు. కాబట్టి వాళ్ల నగల్లో శివుడు, పాములకు సంబంధించిన డిజైన్లు ఎక్కువగా ఉండేవి. ఇక మహిళల కోసం పక్షులు, నెమళ్లు, చిలుకలు, దేవతామూర్తుల డిజైన్లతో పాటు పూల డిజైన్లకు అధికంగా ప్రాధాన్యమిచ్చాం. ఈ డిజైన్ల ఆధారంగానే వంకీలు, వడ్డాణాలు, గాజులు, నెక్‌పీసెస్‌, హెయిర్‌ పీసెస్‌, పాపిడబిళ్లలు, మాతాపట్టీలు, ఉంగరాలు.. వంటివన్నీ సినిమాలోని పాత్రలు, కాస్ట్యూమ్స్‌కు తగినట్లుగా రూపొందించాం..’

ఆ వ్యత్యాసం చూపించాం!

‘ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం కోసం ఆభరణాలు రూపొందించాలంటే ఎంతో అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే అంతకుమించిన ఓపిక అవసరం. ముఖ్యంగా ఇందులో 18 కీలక పాత్రలున్నాయి. ఒక్కో పాత్ర కోసం 300 నుంచి 400 జ్యుయలరీ పీసెస్‌ అవసరమవుతాయి. కొన్ని నగలు కొద్ది తేడాతో ఒకే తరహాలోనూ ఉండచ్చు. కానీ ఆ పోలిక ఎక్కడా లేకుండా జాగ్రత్తపడ్డాం. అంటే.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇది ఎంత పెద్ద పనో.. ఎన్ని వేల నగలు మా చేతుల్లో రూపుదిద్దుకున్నాయో! ఇక ఇదంతా ఒకెత్తయితే.. తెరపై కనిపించే ఇతర నటీనటుల కోసం నగలు డిజైన్‌ చేయడం మరో ఎత్తు. వాళ్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. కాస్ట్యూమ్స్‌లో ఆ వ్యత్యాసం కనిపించకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ నగల కోసం కూడా విలువైన లోహాలు, మెటీరియల్‌నే ఉపయోగించాం.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ జర్నీ ఎంతో సవాలుతో కూడుకున్నది. అయినా ఈ క్రమంలో ఎంతో అనుభవం, మధురానుభూతుల్ని సొంతం చేసుకోగలిగా..’ అంటున్నారు ప్రతీక్షా.

ఆర్కిటెక్ట్‌గానూ రాణిస్తోంది!

ప్రతీక్షా ప్రశాంత్‌.. హైదరాబాద్‌కు చెందిన ‘కృష్ణదాస్‌ అండ్‌ కో.’ జ్యుయలరీ సంస్థ యజమాని కృష్ణదాస్‌ కోడలు. ముత్యాల ఆభరణాలు, భారీ నగలు తయారుచేయడంలో ఈ సంస్థకు పేరుంది. ఇలాంటి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన ప్రతీక్షకూ జ్యుయలరీ డిజైనింగ్‌ అంటే మక్కువే! వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌ అయిన ఆమె.. 1995లో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇక్కడా తన ఆర్కిటెక్ట్‌ నైపుణ్యాలను ప్రదర్శించారామె. 2017లో తన కళాత్మక నైపుణ్యాలతో బేగంపేట్‌లోని స్టోర్‌కు తానే ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థకు క్రియేటివ్‌ డైరెక్టర్‌, సీఈఓగా వ్యవహరిస్తోన్న ప్రతీక్షకు జ్యుయలరీ డిజైనర్‌గా ఇది తొలి చిత్రం.

‘2019లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి ముందే డిజైనర్‌ ఎకా నాకు కాల్‌ చేశారు.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఓ అవకాశం ఉందన్నారు. అయితే గతంలో సినిమా ప్రాజెక్టుల కోసం పనిచేసిన అనుభవం నాకు లేదు. అయినా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నా.. నిజానికి ఇదో అద్భుతమైన ప్రయాణం!’ అంటూ చెప్పుకొచ్చారు ప్రతీక్ష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్