ఉన్నట్లుండి బరువు తగ్గడం.. అనారోగ్యానికి సూచనా?

బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి? అయితే కొంతమందిలో ఇది ఒకేసారి ఎక్కువగా కనిపిస్తుంటుంది. శారీరక శ్రమ అధికంగా లేకపోయినా, కచ్చితమైన ఆహార నియమాలేవీ పాటించకపోయినా.. ఇలా ఉన్నట్లుండి ఎక్కువ కిలోలు తగ్గుతుంటారు కొందరు. ‘హమ్మయ్య! ఏదైతేనేం.. బరువు తగ్గిపోయాం!’ అంటూ....

Published : 05 Nov 2022 12:24 IST

బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి? అయితే కొంతమందిలో ఇది ఒకేసారి ఎక్కువగా కనిపిస్తుంటుంది. శారీరక శ్రమ అధికంగా లేకపోయినా, కచ్చితమైన ఆహార నియమాలేవీ పాటించకపోయినా.. ఇలా ఉన్నట్లుండి ఎక్కువ కిలోలు తగ్గుతుంటారు కొందరు. ‘హమ్మయ్య! ఏదైతేనేం.. బరువు తగ్గిపోయాం!’ అంటూ సంబరపడిపోతారు. కానీ ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడమనేది వివిధ రకాల అనారోగ్యాలకు సూచన కావచ్చంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల తలెత్తే దుష్ప్రభావాల ఫలితంగానే ఇలా జరుగుతుందంటున్నారు. మరి, శరీరంలో ఎలాంటి అనారోగ్యాలుంటే సడెన్‌గా బరువు తగ్గుతారో తెలుసుకుందాం రండి..

క్యాన్సర్‌ ఉందేమో?!

నెలల కొద్దీ కఠినమైన వ్యాయామాలు చేయడం, నోరు కట్టేసుకొని కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం.. వంటివి చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం! అలాంటిది ఏ కష్టం లేకుండా బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? కాబట్టి ఇది ఏదో ఒక ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చని సందేహించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరు నెలల్లో మీ శరీర బరువులో సుమారు ఐదు శాతం తగ్గుదలను గమనిస్తే మాత్రం అది ఏదో ఒక క్యాన్సర్‌కు సంకేతం కావచ్చంటున్నారు. అంతేకాదు.. క్యాన్సర్‌ ఉన్న వారిలో కనిపించే తొలి సంకేతం కూడా ఉన్నట్లుండి బరువు తగ్గడమేనట! కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ కిలోలు తగ్గినట్లు గుర్తిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్‌ ఉందని నిర్ధరణ అయితే.. ఆపై వ్యాధి తీవ్రతను బట్టి చేసే రేడియేషన్‌, కీమోథెరపీ.. వంటి చికిత్సల వల్ల ఆకలి మందగించి బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మధుమేహం కూడా..!

ఉన్నట్లుండి ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడానికి మధుమేహం కూడా ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ప్రతి వంద మందిలో 13 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అయితే ఈ సమస్య ఉన్న వారిలో ఇన్సులిన్‌ తగినంత మొత్తంలో ఉత్పత్తి కాదు. తద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మార్చి శరీరానికి అందించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు జీవక్రియల పనితీరు సజావుగా సాగేందుకు శరీరం కొవ్వులు, కండరాలపై ఆధారపడుతుంది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో బరువు తగ్గే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలా జరుగుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా.. మధుమేహ పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆ హార్మోన్లలో మార్పులు..

తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు ఉండవు.. చేసే వ్యాయామాల్లోనూ తేడా ఉండదు.. అయినా ఉన్నట్లుండి బరువు తగ్గామంటూ కొంతమంది డాక్టర్లకు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఇలా జరగడానికి హైపర్‌థైరాయిడిజం సమస్య కూడా ఓ కారణం అయి ఉండచ్చంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా థైరాయిడ్‌ గ్రంథి ఎక్కువ మొత్తంలో థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులను సంప్రదించి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకొని.. వాళ్ల సలహా మేరకు మందులు వాడడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం.. వంటివి చేస్తే ఫలితం ఉంటుంది.

పొట్టలో అల్సర్లున్నా..

ఎంతసేపు తినకపోయినా ఆకలేయదు.. బలవంతంగా ఆహారం తీసుకున్నా వెంటనే వాంతులవుతుంటాయి. ఎప్పుడు చూసినా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంటుంది.. ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఉన్నట్లుండి బరువు తగ్గడం చూస్తుంటాం. అయితే దీనికంతటికీ కారణం పొట్టలో/జీర్ణాశయంలో/పేగుల్లో అల్సర్లు ఏర్పడడమే అంటున్నారు నిపుణులు. ఇవి తీసుకున్న ఆహారాన్ని జీర్ణమవకుండా అడ్డుకుంటాయి.. ఆకలిని మందగింపజేస్తాయి. అలాగని ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పూ పొంచి ఉండచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ కిలోలు తగ్గినా, పొట్టలో అసౌకర్యంగా అనిపించినా.. వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించి.. వ్యాధి నిర్ధారణ చేసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

వీటితో పాటు నాడీ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, పార్కిన్సన్స్ వ్యాధి, సెలియాక్ (గ్లూటెన్‌ ఉన్న పదార్థాలు పడకపోవడం), డిమెన్షియా.. వంటి సమస్యలు కూడా ఒక్కసారిగా శరీర బరువు పడిపోయేందుకు కారణమవుతాయట! కాబట్టి ఇలాంటి మార్పు కనిపిస్తే మాత్రం వెంటనే నిపుణుల్ని సంప్రదించి.. దీని వెనకున్న ఆరోగ్య సమస్యేంటో నిర్ధారించుకొని.. వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం, మందులు వాడడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం.. వంటి జాగ్రత్తలన్నీ పాటించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్