Yashoda Lodhi : పల్లెటూరి ‘ఇంగ్లిష్‌’ టీచరమ్మ!

తలపై మేలి ముసుగు, పాపిట్లో సింధూరం, నుదుటన గుండ్రటి బొట్టు.. ఈ తరహా గ్రామీణ నేపథ్యం ఉన్న కట్టూ-బొట్టును తలపించే మహిళలు మాతృభాష తప్ప మరో భాష మాట్లాడడం అరుదు.

Updated : 06 Dec 2023 18:42 IST

(Photos: Instagram)

తలపై మేలి ముసుగు, పాపిట్లో సింధూరం, నుదుటన గుండ్రటి బొట్టు.. ఈ తరహా గ్రామీణ నేపథ్యం ఉన్న కట్టూ-బొట్టును తలపించే మహిళలు మాతృభాష తప్ప మరో భాష మాట్లాడడం అరుదు. అలాంటిది ఇంగ్లిష్‌ మాట్లాడడం ఊహించగలమా? కానీ యశోద లోధి ఈ ఆలోచన తప్పని నిరూపిస్తోంది. పక్కా పల్లెటూరు, పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చదివింది ఇంటరే! అదీ హిందీ మీడియంలో! అయినా ఇప్పుడు ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడేస్తోంది. అంతేకాదు.. తనలాంటి పల్లెటూరి మహిళలు/అమ్మాయిలకూ ఇంగ్లిష్‌ భాష నేర్పడానికి ఓ యూట్యూబ్‌ ఛానల్‌నూ ప్రారంభించింది. ఏడాది కాలంలోనే సోషల్‌ స్టార్‌గా ఎదిగిన యశోదకు అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి..

దెహతీ (Dehati) అంటే హిందీలో గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అని అర్థం. సాధారణంగా పల్లెటూరు వాళ్ల వేషభాషల్ని చాలామంది వింతగా, విచిత్రంగా చూస్తుంటారు. సమాజంలో ఉన్న ఈ ధోరణిని మార్చాలనుకుంది యశోద. పల్లెటూరి మహిళలూ తలచుకుంటే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరని నిరూపించాలనుకుందామె. ఈ క్రమంలోనే తన యూట్యూబ్‌ ఛానల్‌కు ‘ఇంగ్లిష్‌ విత్‌ దెహతీ మేడం’ అని పేరు పెట్టుకున్న ఆమె.. ‘దెహతీ మేడం’గానూ పాపులరైంది.

అష్టకష్టాలు ఎదుర్కొని..!

యశోదది ఉత్తరప్రదేశ్‌లోని సిరతు నగర్‌ అనే చిన్న గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె.. తన మేనమామ ఇంట్లోనే పెరిగింది. చదువంటే మక్కువ ఉన్నా.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతి కష్టమ్మీద ఇంటర్‌ పూర్తిచేసింది. ఆపై కుటుంబానికి అండగా నిలవడం కోసం స్థానిక పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించిందామె. ఈ క్రమంలోనే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది యశోద. అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో.. బయటికొచ్చేసి కాపురం పెట్టారు. అయినా ఆమె కష్టాలు తీరలేదు. దినసరి కూలీ అయిన ఆమె భర్త ఓసారి ప్రమాదానికి గురవడంతో నడవలేని పరిస్థితి తలెత్తింది. దాంతో కుటుంబ భారమంతా యశోదపైనే పడింది. ఓవైపు ఇంటి పనులు, మరోవైపు పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడం ప్రారంభించిందామె. అయితే ఇలా రోజంతా కష్టపడ్డా వచ్చిన డబ్బు ఏ మూలకూ సరిపోయేది కాదు. ఎలాగైనా ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని సంకల్పించుకున్న ఆమె.. ఇంగ్లిష్‌ నేర్చుకొని ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంది.

అలా వచ్చింది ఆలోచన!

ఈ క్రమంలోనే తాను దాచుకున్న కొంత డబ్బుతో 2021లో ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొన్నది యశోద. మొబైల్‌ని ఆపరేట్‌ చేయడం, యూట్యూబ్‌లో వీడియోలు చూడడం.. ఇలా ఒక్కో సాంకేతికతను సొంతంగా నేర్చుకోవడం ప్రారంభించిందామె. ఇలా వీడియోలు చూస్తూ ఇంగ్లిష్‌ నేర్చుకునే క్రమంలోనే స్ఫూర్తిదాయక ప్రసంగాలకు సంబంధించిన పలు వీడియోలు ఆమె కంట పడ్డాయి. అందులోనూ ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ సందీప్‌ మహేశ్వరి చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక మాటలు ఆమె కెరీర్‌నే మలుపు తిప్పాయంటోంది యశోద.

‘మహిళలు ఇంటి నుంచే డబ్బు సంపాదించే పలు మార్గాల గురించి సందీప్‌ ఒక వీడియోలో వివరించారు. అది చూశాకే నా కెరీర్‌ లక్ష్యమేంటో నాకు తెలిసింది. యూట్యూబ్‌లో నేను నేర్చుకునే ఇంగ్లిష్‌ పాఠాలే నాలాంటి గ్రామీణ మహిళలకు నేర్పించాలనిపించింది. ఈ ఆలోచనతోనే గతేడాది మేలో ‘ఇంగ్లిష్‌ విత్‌ దెహతీ మేడం’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ తెరిచాను. ఈ వేదికగా సులభంగా ఇంగ్లిష్‌ నేర్చుకునే మార్గాలపై వీడియోలు రూపొందిస్తున్నా..’ అంటోందీ ఇంగ్లిష్‌ టీచరమ్మ.

ఇంగ్లిష్‌.. ఈజీగా!

ఇప్పటికీ ఇంగ్లిష్‌ భాషంటే భయపడేవారున్నారు.. ఈ భాష నేర్చుకోవడం కష్టమని అనాసక్తి చూపే వారూ లేకపోలేదు. అలాంటి వారికి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఇంగ్లిష్‌ నేర్పిస్తోంది యశోద.

‘ఇంగ్లిష్‌ నేర్చుకునే క్రమంలో నేనూ చాలా వీడియోలు చూశాను. అయితే చాలామంది ఇంగ్లిష్‌ భాషంటే భయపడడానికి ప్రధాన కారణం.. దాన్నో సబ్జెక్ట్‌లా భావించడమే! ఇంగ్లిష్‌ను సబ్జెక్ట్‌లా కాకుండా సంభాషణ సాధనంగా ఉపయోగిస్తే ఈ భాష నేర్చుకోవడం సులభమవుతుంది. నేనూ అలాగే ఆంగ్ల భాష నేర్చుకున్నా. ఈ క్రమంలో తప్పో, ఒప్పో మీరు చేసే రోజువారీ పనుల గురించి ఆంగ్లంలో మాట్లాడే ప్రయత్నం చేయండి.. కొంతమంది ఇంగ్లిష్‌ సినిమాలు, ప్రోగ్రామ్స్‌ చూస్తే, ప్రసంగాలు వింటే భాష వస్తుందనుకుంటారు. అది పొరపాటు. ఇతరుల ప్రసంగాలు/మాటలు వినడం కంటే.. మన సొంత పదాలు, వాక్యాలు ఇంగ్లిష్‌లో కూర్చుకొని మాట్లాడగలిగితే భాష త్వరగా వస్తుంది..’ అంటోన్న యశోద.. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా.. ఆంగ్ల పదాలు, పదజాలాలు, సందర్భానుసారం వాటిని ఉపయోగించే విధానం, సులభంగా భాష నేర్చుకోవడానికి పాటించే చిట్కాలు.. వంటివన్నీ వివరిస్తోంది. అంతేకాదు.. తన జీవితంలో తానెదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించీ పలు వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోందీ ఇంగ్లిష్‌ టీచర్‌.
ఇలా తన ఆంగ్ల పాఠాలతో ఏడాది కాలంలోనే సెన్సేషన్‌గా మారిపోయిన యశోద యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఇప్పటివరకు 377కు పైగా వీడియోలు పోస్ట్‌ చేసిన యశోదను ‘దెహతీ మేడం’ అని కూడా పిలుచుకుంటారు ఆమె ఫ్యాన్స్‌. ఒకప్పుడు ఆర్థికంగా పలు కష్టాలు పడిన ఆమె.. తన సొంత ట్యాలెంట్‌తో ఇప్పుడు చేతినిండా డబ్బు సంపాదిస్తూ ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్