Intimate Care : కలయికలో నొప్పికి అదీ ఓ కారణమేనట!

ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మహిళలు.. తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అలక్ష్యంగా ఉండడం వల్ల పలు అనారోగ్యాలు తలెత్తుతుంటాయి.

Published : 29 Nov 2023 13:10 IST

ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మహిళలు.. తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అలక్ష్యంగా ఉండడం వల్ల పలు అనారోగ్యాలు తలెత్తుతుంటాయి. వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, ఆ భాగం పొడిబారిపోవడం, శృంగార కోరికలు తగ్గిపోవడం, కలయికలో నొప్పి, నెలసరి సమస్యలు.. వీటన్నింటికీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటి సమస్యలు ఇటు ఆరోగ్యాన్ని, అటు అనుబంధాన్ని దెబ్బతీయకముందే జాగ్రత్తపడమంటున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

లోదుస్తుల ఎంపిక ఇలా!

లోదుస్తులు కూడా మహిళల వ్యక్తిగత ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమంది బిగుతుగా ఉండే లోదుస్తుల్ని ఎంచుకుంటుంటారు. దీనివల్ల అసౌకర్యంగా అనిపించడంతో పాటు గాలి సరిగ్గా ఆడక ఆ భాగంలో ఇన్ఫెక్షన్లు, దురద.. వంటి సమస్యలొస్తాయి. వీటిని నివారించాలంటే సౌకర్యవంతంగా, వదులుగా ఉండే కాటన్‌ లోదుస్తుల్ని ఎంచుకోవాలి. ప్రస్తుతం నిమ్మ, మొక్కజొన్న.. వంటి మొక్కల వ్యర్థాల నుంచి తయారైన ఫ్యాబ్రిక్స్‌తో లోదుస్తుల్ని రూపొందిస్తున్నారు. వీటిలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు.. వ్యక్తిగత భాగాల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా చేస్తాయి. ఫలితంగా వెజైనా వద్ద పీహెచ్‌ స్థాయులు బ్యాలన్స్‌ అవుతాయి. కాబట్టి ఆ భాగంలో ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఉపయోగించిన లోదుస్తుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే.

సబ్బు వాడద్దు!

కొంతమందిలో ఉండే అతి పరిశుభ్రతే ఒక్కోసారి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఈ క్రమంలో కొంతమంది తమ వ్యక్తిగత భాగాల్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, పరిమళాలు వెదజల్లే జెల్స్‌.. వంటివి వాడుతుంటారు. నిజానికి ఇందులోని రసాయనాలు వెజైనా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.. ఆ భాగంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంటాయి. అయితే ఆ భాగాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇలాంటి క్లీనింగ్‌ ఉత్పత్తులతో పనిలేదు. ఎందుకంటే వెజైనా నుంచి వెలువడే ఒక రకమైన డిశ్ఛార్జి ఆ భాగంలో పీహెచ్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరించి.. ఆ భాగాన్ని స్వయంగా పరిశుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి రోజూ స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకుంటే సరిపోతుంది. అలాగే పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉపయోగించినప్పుడు.. తడిగా ఉండే వైప్స్‌తో ఓసారి శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

ప్యాడ్స్‌ మార్చుతున్నారా?

వ్యక్తిగత పరిశుభ్రత లోపించడానికి నెలసరి సమయంలో కొంతమంది చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణమవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నిర్ణీత వ్యవధుల్లో శ్యానిటరీ న్యాప్‌కిన్లు మార్చుకోకపోవడం, పరిమళాలు వెదజల్లే ప్యాడ్స్‌ ఉపయోగించడం.. వంటి వాటి వల్ల ఆ భాగంలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెంది నెలసరి సమస్యలతో పాటు.. వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్‌ని బట్టి నిర్ణీత వ్యవధుల్లో శ్యానిటరీ ప్యాడ్స్‌, ట్యాంపూన్స్‌ మార్చుకోవాలి. అలాగే మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ కూడా తొలగించి శుభ్రం చేసుకోవాలి. పరిమళాలు వెదజల్లే శ్యానిటరీ ప్యాడ్స్‌ కంటే.. కాటన్‌, బనానా ఫైబర్‌, జ్యూట్‌, వెదురు.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ప్యాడ్స్‌ ఉపయోగిస్తే ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి మేలు జరుగుతుంది.

కలయికను ఆస్వాదించాలంటే..!

ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని పెంపొందించుకోవడంలో శృంగారం పాత్ర కీలకం. అయితే కొంతమందిలో కలయిక సమయంలో నొప్పి, వెజైనా పొడిబారిపోవడం, శృంగార కోరికలు తగ్గిపోవడం, పలు వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కలయికను ఆస్వాదించలేకపోతుంటారు. అయితే వీటన్నింటికీ వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వివిధ రకాల లైంగిక సంక్రమణ వ్యాధులు (STDs) వస్తుంటాయి. ఇవే పై సమస్యలకు కారణమవుతుంటాయి. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో భార్యాభర్తలిద్దరూ తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. తద్వారా అటు శృంగారాన్ని ఆస్వాదించడంతో పాటు.. ఇటు ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవచ్చు..

వీటితో పాటు వెజైనా ఆరోగ్యానికి ప్రొబయోటిక్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారం, పండ్లు, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆ భాగంలో పీహెచ్‌ స్థాయులు బ్యాలన్స్‌ అవుతాయి. అయితే ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా.. వెజైనా వద్ద దురద, నొప్పి, మంట, డిశ్ఛార్జ్‌.. వంటి లక్షణాలేవైనా కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. తద్వారా సకాలంలో చికిత్స అంది సమస్య పెద్దదవకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్