చీరచీరకో కథ!

ఎన్ని ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా, పాశ్చాత్య పోకడల ప్రభావం ఎంత ఉన్నా.. చేనేత వస్త్రాలతో వచ్చే కళ, అందమే వేరు! అయితే స్వచ్ఛమైన నూలుతో తయారవ్వాల్సిన దుస్తులు కాస్తా రసాయనమయం అవుతున్నాయి.

Published : 17 Feb 2023 17:46 IST

ఎన్ని ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా, పాశ్చాత్య పోకడల ప్రభావం ఎంత ఉన్నా.. చేనేత వస్త్రాలతో వచ్చే కళ, అందమే వేరు! అయితే స్వచ్ఛమైన నూలుతో తయారవ్వాల్సిన దుస్తులు కాస్తా రసాయనమయం అవుతున్నాయి. మరోవైపు పత్తి సేకరించడం దగ్గర్నుంచి.. దాన్ని వస్త్రంగా మలిచేంతవరకు.. ప్రతిదీ యంత్రాల ద్వారానే జరిగిపోతోంది. తద్వారా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఇలా మొత్తానికి మన ప్రాచీన చేనేత సంస్కృతి కనుమరుగైపోతోందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు తమిళనాడులోని పొల్లాచ్చికి చెందిన విజయలక్ష్మి నాచియార్‌. చేనేత వస్త్ర పరిశ్రమకు పునర్వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్న ఆమె.. తన భర్తతో కలిసి ‘ఎథికస్‌ స్టూడియో’ను ప్రారంభించారు. పత్తి పండించడం దగ్గర్నుంచి వాటిని అంతిమంగా దుస్తులుగా మలచడం వరకు.. ప్రతి దశలోనూ పర్యావరణహిత మార్గాల్నే అనుసరిస్తున్నారామె. చీరచీరలో ఓ కథ దాగుందంటోన్న విజయలక్ష్మి.. తమ చీరలు స్మృతీ ఇరానీ, సోనియా గాంధీ, సుధా మూర్తి.. వంటి ఎంతోమంది ప్రముఖుల మనసు దోచుకున్నాయంటున్నారు.

విజయలక్ష్మి నాచియార్‌ తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగారు. ముఖ్యంగా ఆమె కుటుంబంలోని మూడు తరాల పూర్వీకులు పత్తి వ్యాపారంలో కొనసాగారు. ఇలా చిన్న వయసు నుంచి ఈ వాతావరణంలో పెరిగిన ఆమెకు చేనేత వస్త్ర రంగంపై మక్కువ పెరిగింది. అందుకే భవిష్యత్తులో ఇదే రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు విజయలక్ష్మి. ఈ క్రమంలోనే టెక్స్‌టైల్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేశారామె.

అది జీర్ణించుకోలేకే..!

విజయలక్ష్మి భర్త మణి చిన్నస్వామిది కూడా పత్తి వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబమే! అయితే ఒకానొక సందర్భంలో పత్తి ఉత్పత్తి దగ్గర్నుంచి.. దాంతో తయారయ్యే ఫ్యాబ్రిక్స్‌ దాకా.. ప్రతిదీ రసాయనమయం అవుతోందని, ప్రతి దశలోనూ మెషినరీ ఉపయోగించడంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం గుర్తించింది విజయలక్ష్మి. ఇలా ప్రాచీన చేనేత పరిశ్రమ అంతరించిపోవడం ఈ దంపతుల్ని ఆలోచనలో పడేసింది. ఎలాగైనా స్థానికంగా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్న ఆమె.. తన భర్తతో కలిసి 2008లో ‘ఎథికస్‌ స్టూడియో’ పేరుతో చేనేత వ్యాపారాన్ని ప్రారంభించారు. సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేయడం, దాన్ని మిల్లుల్లో కాకుండా.. స్థానిక కార్మికులతో చేత్తో వడికించడం, సహజసిద్ధమైన రంగులద్దడం, ఇలా తయారైన ఫ్యాబ్రిక్‌తో చీరలు, ఇతర దుస్తులు నేయడం.. ఇలా ప్రతి దశలోనూ పర్యావరణహిత మార్గాల్నే అనుసరిస్తున్నారు విజయలక్ష్మి.

ప్రతి దశా పర్యావరణహితమే!

‘మన దేశంలో ప్రధాన కాలుష్య పరిశ్రమల్లో పత్తి ఒకటి. పత్తి వ్యాపార కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మేము మళ్లీ ఇదే పొరపాటు చేయకూడదనుకున్నాం. అందుకే అటు పర్యావరణహితంగా, ఇటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే ముఖ్యోద్దేశంతోనే ఎథికస్‌ను ప్రారంభించాం. పత్తి పంటకు సేంద్రియ పద్ధతుల్లో సేకరించిన పత్తి గింజల్నే వాడతాం. మిల్లులో తయారయ్యే నూలు కంటే వడికించడం అనేది చాలా ఆలస్యంగా జరిగే ప్రక్రియ. కానీ దాని అందం, ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. మరోవైపు దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధీ దక్కుతుంది. అందుకే పత్తి గింజలు, పంట దగ్గర్నుంచి సహజసిద్ధమైన పద్ధతుల్నే అనుసరిస్తున్నాం. స్థానిక రైతులు, చేనేత కార్మికులతో పాటు కర్ణాటకలో పత్తి సాగు చేసే రైతుల్ని ఈ ప్రాసెస్‌లో భాగం చేస్తున్నాం. ఇక టై అండ్‌ డై కోసం కూడా సహజసిద్ధమైన రంగుల్నే ఉపయోగిస్తున్నాం. తద్వారా ఆరోగ్యానికి, చర్మానికీ ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు..’ అంటూ తన చేనేత వస్త్ర వ్యాపారం గురించి చెప్పుకొచ్చారు విజయలక్ష్మి.

చీరచీరకో కథ!

ఇలా వడికించిన పత్తితో చేనేత చీరలే కాదు.. స్టోల్స్‌, స్కార్ఫ్స్‌, దుపట్టాలు.. వంటివెన్నో తయారుచేస్తున్నారు విజయలక్ష్మి. ఇలా తన ప్రతి ఉత్పత్తిపై.. దానికి సంబంధించిన ఓ చిన్న కథను ట్యాగ్‌గా అటాచ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో దాని తయారీలో వాడిన పత్తి ఎక్కడ పండింది?, ఎవరు పండించారు?, ఆ ఉత్పత్తి నేయడానికి ఎంత సమయం పట్టింది? వంటి వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు.
‘కొన్నేళ్ల క్రితం నేను, మావారు ముంబయిలో ఆర్నిథాలజీ (పక్షి శాస్త్రం) కోర్సు చేశాం. అక్కడ చుట్టుపక్కల రంగురంగుల పక్షులుండేవి. వాటిని చూసినప్పుడల్లా మనసు ఆహ్లాదంతో నిండిపోయేది. ఇలాంటి మనసుకు హత్తుకునే రంగులతో చీరల్ని ఎందుకు నేయకూడదు..? అనిపించింది. అంతే.. ఆయా రంగుల థీమ్‌తో చీరల్ని రూపొందించాం. ఆ తర్వాత ‘మద్రాస్‌ చెక్స్‌’ పేరుతో జామెట్రిక్స్‌ లైన్స్‌/యాంగిల్స్‌/బ్లాక్స్‌ నేపథ్యంలో మరిన్ని దుస్తులు నేయించాం. స్ప్రింగ్‌/సమ్మర్‌ కలెక్షన్‌గా ‘క్రాస్‌రోడ్స్‌’ అనే థీమ్‌తో సరికొత్త చేనేత దుస్తుల్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే ‘మ్యాచ్‌మేకర్‌’, యష్‌ చోప్రా సినిమాల్లోని ప్రేమను ప్రతిబింబించేలా ‘లవ్‌’ థీమ్‌తో, విక్టోరియన్‌ పువ్వులు/ఉద్యానవనాల నేపథ్యంలో ‘బలద్ ఆఫ్‌ బ్లాసమ్స్‌’ పేరుతో మరో కలెక్షన్‌.. ఇలా మేము రూపొందించే దుస్తుల్లో ఎన్నో కథలు దాగున్నాయి.. అలాగే ప్రతి చీరకో ప్రత్యేకత ఉంటుంది..’ అంటున్నారు విజయలక్ష్మి.

ప్రముఖులు మెచ్చిన బ్రాండ్‌!

ప్రస్తుతం 800 మందికి పైగా రైతులు, వందలాది చేనేత కార్మికులు, అనుభవజ్ఞులైన డిజైనర్లతో ఎథికస్‌ స్టూడియోను నడుపుతున్నారీ హ్యాండ్లూమ్‌ వారియర్‌.. ‘దుస్తులు ధరించడంతోనే సరిపోదు.. వాటితో మనసులో ఓ ఆహ్లాదకరమైన భావన కలగాలి.. శరీరానికి సౌకర్యవంతంగానూ ఉండాలి.. అందుకే మేము రూపొందించిన చీరలు స్మృతీ ఇరానీ, సుష్మా స్వరాజ్‌, సోనియా గాంధీ, సుధామూర్తి, శోభా దే.. వంటి ఎంతోమంది ప్రముఖుల వార్డ్‌రోబ్‌లో చేరాయి..’ అంటున్నారు విజయలక్ష్మి. ఇలా తన సంస్థ ద్వారా ఎంతోమంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తోన్న ఆమె.. వాళ్ల పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్‌ని కూడా నడుపుతున్నారు. మరోవైపు పర్యావరణహితమైన పంటలు పండించడంలో రైతుల్ని నిష్ణాతుల్ని చేయడానికి వారిని ప్రత్యేక పర్యటనలకు కూడా తీసుకెళ్తున్నారు. ఇలా విభిన్న రకాలుగా తనలోని సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు విజయలక్ష్మి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్