ఆ ఇద్దరే నా ‘సూపర్ విమెన్’!

స్ఫూర్తైనా, సమానత్వమైనా ఇంటి నుంచే మొదలవ్వాలంటారు. అలా తన స్ఫూర్తిప్రదాతలూ ఇంట్లోనే ఉన్నారంటున్నాడు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.

Updated : 16 Mar 2024 15:33 IST

(Photos: Instagram)

స్ఫూర్తైనా, సమానత్వమైనా ఇంటి నుంచే మొదలవ్వాలంటారు. అలా తన స్ఫూర్తిప్రదాతలూ ఇంట్లోనే ఉన్నారంటున్నాడు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. ప్రతికూల పరిస్థితుల నుంచి తన కుటుంబాన్ని గట్టెక్కించిన క్రెడిట్‌ తన తల్లిదైతే.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సవాళ్లను ఎదుర్కొనగలిగే శక్తినిచ్చింది తన భార్యే అంటున్నాడీ హ్యాండ్‌సమ్‌. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తన విజయం వెనకున్న ఆ ఇద్దరు సూపర్‌ విమెన్ తనలో స్ఫూర్తి నింపిన వైనాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.

తనో స్ట్రాంగ్‌ ఉమన్!

‘పెద్ద పెద్ద కలలు కనమని, మన పైన మనకు నమ్మకంతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాల్ని చేరుకోగలమని అమ్మ సరోజ్‌ కోహ్లీ ఎప్పుడూ చెబుతుండేది. నా ఎనిమిదో ఏట మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అయినా క్రికెటర్‌ కావాలన్న నా కలను నెరవేర్చడానికి మా అమ్మానాన్నలు ఎంతగానో కష్టపడ్డారు. ఆర్థిక పరిస్థితుల్ని పక్కన పెట్టి నన్ను క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. ఇక నా 18 ఏట నాన్న పోయారు. అదే రోజు ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు హాజరు కావాల్సి ఉంది. నేను వెళ్లనన్నా అమ్మ వెళ్లమంటూ వెన్నుతట్టింది.. బాధను దిగమింగుకొని గుండె ధైర్యాన్ని నూరిపోసింది. ఆమె ప్రోత్సాహంతోనే ఆ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాను. మ్యాచ్‌ ముగిశాక అటు నుంచి అటే నాన్న అంత్యక్రియలకు హాజరయ్యా. అప్పటివరకు మ్యాచ్‌ను ఓ ఆటలాగే ఎంజాయ్‌ చేసిన నేను అప్పట్నుంచి సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టా. ప్రతి మ్యాచ్‌కూ నా క్రికెట్‌ నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాను. ప్రస్తుతం నేను స్టార్‌ క్రికెటర్‌గా మారగలిగానంటే అందులో మా అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే నా జీవితంలో తనో స్ట్రాంగ్‌ ఉమన్‌..’ అంటాడు కింగ్‌ కోహ్లీ.


నా జీవితాన్నే మార్చేసింది!

కెరీర్‌ పరంగా మార్గనిర్దేశనం చేసి తననో స్టార్‌గా మలచిన ఘనత తన తల్లిదైతే.. వ్యక్తిగతంగా తనను సన్మార్గంలో నడిపిన క్రెడిట్‌ తన భార్య అనుష్కా శర్మదే అంటున్నాడు కోహ్లీ.
‘మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఇంట్లోనే ఉంటారన్న విషయం అనుష్కను చూశాకే నాకు అర్థమైంది. నా జీవితానికి అతి పెద్ద స్ఫూర్తి ఆమె. వ్యక్తిగతంగా నన్ను తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు వారిలోని సద్గుణాలు, మంచి లక్షణాల్ని స్వీకరించి అనుసరించడానికి ఆసక్తి చూపుతాం. జీవితం పట్ల ఆమెకున్న భిన్నమైన దృక్పథమే నన్నో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది..’ అంటూ తన భార్యను ఆకాశానికెత్తేశాడు విరాట్.

అది సమానత్వం కంటే ఎక్కువ!

స్త్రీపురుష సమానత్వం.. చాలా సందర్భాల్లో ఇది మాటలకే తప్ప చేతల్లో కనిపించదు.  అయినా తమకు ఎదురయ్యే సవాళ్లకు ఎదురీదుతూ ఎంతోమంది మహిళలు రాణించడం వారి శక్తియుక్తులకు నిదర్శనం అంటున్నాడు కోహ్లీ.

‘మహిళా సమానత్వం.. మనందరం ఎంతగా కోరుకున్నా ఇప్పటికీ ఇది సిద్ధించలేదు. అయినా లైంగిక వేధింపులు, వివక్ష, గృహ హింస, అణచివేత, అసమానతలను ఎదుర్కొంటూనే.. వాటన్నింటినీ తట్టుకుని మహిళలు వివిధ రంగాల్లో రాణించడం వారి శక్తియుక్తులకు ప్రత్యక్ష నిదర్శనం’ అంటూ మహిళా సాధికారతను తన మాటల్లో అభివర్ణించాడీ స్టార్‌ క్రికెటర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్