గ్రామాల దాహార్తి తీరుస్తోంది!

గుక్కెడు నీళ్ల కోసం...మైళ్ల దూరం ప్రయాణించే పల్లెలెన్నో. తడారిన గొంతులు తడుపుకోవడానికి పడే తిప్పలెన్నో! ఈ బాధల్ని కళ్లారా చూసిన విభ.. గ్రామీణుల జల ఆర్తిని తీర్చాలనుకున్నారు.

Updated : 22 Mar 2023 04:52 IST

ప్రపంచ జల దినోత్సవం

గుక్కెడు నీళ్ల కోసం...మైళ్ల దూరం ప్రయాణించే పల్లెలెన్నో. తడారిన గొంతులు తడుపుకోవడానికి పడే తిప్పలెన్నో! ఈ బాధల్ని కళ్లారా చూసిన విభ.. గ్రామీణుల జల ఆర్తిని తీర్చాలనుకున్నారు. వాటర్‌ ఏటీఎంలతో దేశవ్యాప్తంగా వందల గ్రామాల దాహాన్ని తీరుస్తున్నారు. ఆమె ప్రయాణమిది!

‘ఆలోచనల్లో స్పష్టత, చేసే పనిమీద నమ్మకం ఉంటే చాలు...ఆకాశానికి నిచ్చెనలు వేయొచ్చు. సముద్రాల లోతూ కొలవచ్చు’ అంటారు విభా త్రిపాఠి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌ అనే చిన్నపల్లెలో పుట్టి పెరిగారు. ఐఐటీ కాన్పూర్‌లో చదివారు. అక్కడే ప్రొఫెసర్‌గా కెరియర్‌ ప్రారంభించారు. ఎంతో ఇష్టంగా చేరిన ఉద్యోగమే అయినా... ‘ఫ్లెక్సిబుల్‌ ఆర్గానిక్‌ సోలార్‌ సెల్స్‌’ అనే అంశంపై కలిగిన ఇష్టం ఆవిడ గమ్యాన్ని మార్చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి ‘సౌర్య ఎనర్‌టెక్‌’ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అప్పటికి కొత్త విషయమైన సౌరశక్తి వినియోగంపై వర్క్‌షాపులూ, శిక్షణ, సెమినార్‌లు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఎక్కడికెళ్లినా... నీళ్లకోసం మైళ్లదూరం నడిచే మహిళలు కనిపించేవారు. సాంకేతికత, సౌరశక్తితో... వాళ్ల నీటి కష్టాలను తీర్చాలనుకున్నారు. ‘ప్రపంచ జనాభాలో 18శాతం మనదేశంలో ఉన్నారు. మంచినీటి వనరులేమో నాలుగు శాతం మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయని అర్థం చేసుకున్నాకే ముందడుగు వేశా’ అంటారు విభ.

మురికి వాడల్లో...

అది 2011. యూఎన్‌డీపీ దేశవ్యాప్తంగా సౌరశక్తి ఆధారిత నీటి శుద్ధి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న విభ ప్రతిపాదనలు ఆ సంస్థకు నచ్చి ఎంపిక చేయడమే కాదు.. ప్రాజెక్ట్‌ కోసం నిధుల్నీ అందించింది. రెండేళ్లకు ఈ లక్ష్యం పూర్తయినా విభ మాత్రం సాంకేతికతతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ‘రెన్యువబుల్‌ ఎనర్జీస్‌ అండ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ’ భాగస్వామ్యంతో రూ. కోటి గ్రాంట్‌ అందుకున్నారు. ఆ మొత్తంతో ఐవోటీ, ఏఐ సాంకేతికతో ఆరు నెలల్లో వాటర్‌ ఏటీఎంలను తయారు చేసి ‘స్వజల్‌’ పేరిట గుడ్‌గావ్‌లోని ఐదు మురికివాడల్లో అమర్చారు. వాళ్లబ్బాయి అద్వైత్‌ కూడా విభకు తోడయ్యారు.

రూపాయికే...

అల్ట్రా ఫిల్ట్రేషన్‌ రివర్స్‌ ఓస్మోసిస్‌ టెక్నాలజీతో శుద్ధి చేసిన నీటిని వాటర్‌ ఏటీఎంల ద్వారా పంపిణీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో లీటర్‌ 75 పైసలకు, పట్టణ ప్రాంతాల్లో రూపాయికి అందిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌, స్మార్ట్‌ కార్డ్స్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని సుమారు 500 గ్రామాల్లో ఈ వాటర్‌ ఏటీఎమ్‌లను ఏర్పాటు చేసిందీ సంస్థ. హైదరాబాద్‌, ముల్హాహెరా, గుడ్‌గావ్‌లోని రైల్వే స్టేషన్‌లతో పాటూ వివిధ పాఠశాలల్లో ఈ ఏటీఎంలున్నాయి. దీన్ని వ్యాపార మార్గంగానూ మలచుకున్నారు విభ. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ హోటళ్లు, ఆసుపత్రులు, ఎంఎన్‌సీలకు సేవలందిస్తున్నారు. గతేడాది సంస్థ పేరును ‘బూన్‌’గా మార్చారు. ‘స్వచ్ఛమైన నీళ్లు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఏ సాంకేతిక ఫలమైనా...సామాన్యులకు చేరువైనప్పుడే  అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది’ అంటారు విభ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్