Updated : 04/03/2022 15:23 IST

కిడ్డీపూల్‌ని శుభ్రపరచడమెలా?

స్విమ్మింగ్ పూల్ తరహాలోనే పిల్లల కోసం కిడ్డీపూల్‌ని ఉపయోగిస్తుంటారు. కిడ్డీపూల్ వేసవికాలంలో పిల్లలు వేడినుంచి తట్టుకోవడానికి, రకరకాల ఆటలు ఆడుకొని సేదతీరడానికి ఉపయోగపడుతుంది. పెద్దపెద్ద పూల్స్‌కైతే వాటంతట అవే శుభ్రపడే పద్ధతులుంటాయి. కానీ చిన్న పూల్స్‌కి అలా కాదు. మనమే శుభ్రం చేయాలి. నీటిలో బ్యాక్టీరియా, పాచి పెరగకుండా పూల్స్‌ని శుభ్రం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి మీ పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ఎలా శుభ్రపరచాలో చూద్దాం.

శుభ్రపరచడం చాలా ముఖ్యం

పిల్లలు.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి, ఇంకా రకరకాల ఆటలు ఆడుకోవడానికి కిడ్డీపూల్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ పూల్స్‌లోనూ ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పూల్‌ని శుభ్రం చేయకపోతే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా, నీటిలో ఉండే పాచి, చెత్త, నీటిలో తేలే అనవరసమైన పదార్థాలు, దోమ గుడ్లు.. మొదలైనవి పిల్లల ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. అంతేకాకుండా చంటిపిల్లలు విసర్జించే వాటివల్ల కిడ్డీపూల్ అపరిశుభ్రంగా తయారవుతుంది. కాబట్టి పూల్‌ని శుభ్రంచేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే.. అయినా దాన్ని శుభ్రపరచడం మన బాధ్యత కూడా.

బ్లీచ్‌తో క్రిములు నాశనం

పిల్లలు విసర్జించే వాటివల్ల శ్వాసనాళాలకు సంబంధించిన సమస్యలు, వికారం, అతిసారం, జలుబు, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలతోపాటు.. పలు రకాలైన అంటువ్యాధులు వస్తాయి. ఈ క్రమంలో కిడ్డీపూల్‌ని బ్లీచ్, బోరాక్స్‌తో శుభ్రం చేయవచ్చు. బ్లీచ్ దుస్తులపై ఉండే జిడ్డు మరకల్ని పోగొట్టి వాటిని తెల్లగా చేస్తుంది. దీన్ని బాత్‌రూమ్స్, కిచెన్‌ని కడగడానికి కూడా ఉపయోగిస్తారు. బ్లీచ్‌లో బలమైన బ్యాక్టీరిసైడల్ ధర్మాలుంటాయి. ఇవి కిడ్డీపూల్‌లో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తాయి.

ప్రతివారం కిడ్డీపూల్‌ని శుభ్రపరచి, ఎండబెట్టి, తిరిగి నీరు నింపడం చాలా ముఖ్యం. పెద్ద కిడ్డీపూల్స్‌ల్లో అయితే.. నీరు నింపడానికి వాటి అవసరాన్ని బట్టి ఒక పంపు, ఫిల్టర్‌ను ఏర్పాటు చేయవచ్చు.

పూల్స్‌ని శుభ్రపరచడానికి కావలసినవేంటో చూద్దాం.

* క్లోరిన్ టెస్ట్ కిట్

* పూల్ లోపలి వైపు శుభ్రం చేయడానికి ఒక ప్లాస్టిక్ బ్రష్

* క్లోరిన్

* బోరాక్స్

* పూల్ ఆల్గేసైడ్

* బ్లీచ్

ఎలా శుభ్రం చేయాలి?

పూల్‌ని శుభ్రపరచడానికి ఏయే వస్తువులు, పదార్థాలు అవసరమో తెలిసింది కదా! మరి వీటితో కిడ్డీపూల్‌ని ఎలా శుభ్రం చేయవచ్చో చూద్దాం.

* ముందుగా పూల్‌ని పూర్తిగా ఆరబెట్టి.. తర్వాత పాచిని తొలగించడానికి ఒక బ్రష్ లేదా టవల్‌ని ఉపయోగించాలి.

* బ్లీచ్, నీటిని 1:5 నిష్పత్తిలో తీసుకొని.. దాంతో ఎక్కువ పాచి ఉండే చోట బ్రష్ లేదా టవల్‌తో పాచి పోయేవరకూ శుభ్రం చేయాలి. ఈ మిశ్రమానికి బోరాక్స్ కూడా కలపచ్చు.

* అవసరమైతే క్లోరిన్‌ని, ఆల్గేసైడ్‌ని కూడా కలపచ్చు.

* ప్రతి 10 గ్యాలన్ల నీటిలో పావు టీస్పూన్ బ్లీచ్‌ని వేసి పూల్‌ని శుభ్రపరచవచ్చు. దీనివల్ల నీటిపై దోమలు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.

* పూల్ ఘనపరిమాణాన్ని బట్టి రసాయనాలను వాడాలి. పూల్‌ని శుభ్రపరచిన తర్వాత మళ్లీ నీటిని నింపాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* ఒకవేళ మీ పూల్‌కి పంపు లేదా ఫిల్టర్ లేకపోతే.. ప్రతివారం దాన్ని ఎండబెట్టి మళ్లీ నీళ్లు పట్టాలి. శుభ్రం చేయడానికి వాడే రసాయనాలను తగు మోతాదులో వాడాలి. పూల్ సరఫరా చేసే కంపెనీల సూచనలు పాటిస్తే మంచిది.

* ఇండోర్ అక్వేరియంలను మూసి ఉంచాలి. ఎందుకంటే అందులో నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఆ నీటిపై క్రిములు, కీటకాలు తేలియాడతాయి.

* పిల్లలు పూల్‌లో ఆడుకుంటున్నప్పుడు మీ పర్యవేక్షణ చాలా అవసరం.

* స్విమ్మింగ్ సీజన్‌కు ముందు పూల్‌ని చక్కగా శుభ్రపరచాలి. అలాగే పూల్‌లో అడుగుపెట్టే ముందు పిల్లల పాదాలను కూడా శుభ్రంగా కడగాలి.

* ఒకవేళ నీరు మురికిగా ఉంటే.. ఆ నీటిని పారబోసి, పూల్‌ని ఎండబెట్టి మళ్లీ నీరు నింపాలి.

* క్లోరిన్ లెవెల్ 3.0 లేదా అంతకంటే ఎక్కువ, పీహెచ్ విలువ 7.4 లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

* రసాయనాలు ఎక్కువగా వాడితే చర్మం పాడవుతుంది. ఒకవేళ రసాయనాలేమీ వాడకపోతే మాత్రం పూల్‌ని ప్రతి 24 గంటలకోసారి ఎండబెట్టడం చాలా ముఖ్యం.

* పూల్‌ని ఉపయోగించనప్పుడు ఖాళీగా ఉంచడం మంచిది. ఎందుకంటే నీరు ఉంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి అందులో పడే ప్రమాదం ఉంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని