ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే..!

కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు....

Published : 13 Feb 2023 19:57 IST

కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు పెరగొచ్చు. అందులో కష్టమేముంది' అనుకుంటారు కొంతమంది. అలా తీసుకుంటే శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోయి.. కావాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగి.. రకరకాల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా, అవసరమున్నంత మేరకే బరువు పెరగడానికి నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలేంటో తెలుసుకుందాం రండి..

వయసు, ఎత్తు, జెండర్.. మొదలైన అంశాలను బట్టి ప్రతి వ్యక్తీ ఇంత బరువుండాలని కొన్ని ప్రమాణాలుంటాయి. కానీ వివిధ కారణాల వల్ల సరైన బరువు ఉండకపోవచ్చు. ఉదాహరణకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వేళాపాళాలేని భోజనం, శారీరక శ్రమకు సరిపడా ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు.. ఇలా నిర్ణీత బరువు లేకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి.

వ్యాయామం..

ఈక్రమంలో బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా వ్యాయామం చేయడం తప్పనిసరి. వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కండరాల బరువు పెరిగి తద్వారా శరీర బరువు పెరగొచ్చు. బరువు పెరగాలనుకునే వారికి ఈ ప్రక్రియ చాలా మంచిది. అయితే ఇది నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి.

మంచి ఆహారంతో..

'బరువు పెరగాలి కదా..' అని ఏది పడితే అది తింటే అవసరమైన దానికంటే ఎక్కువ బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సమతులాహారం తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు.. మొదలైనవి శరీరానికి కావాల్సిన మొత్తంలో సమకూరేలా ఉండాలి. కండరాల బరువు పెరగడంలో ప్రొటీన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. తద్వారా శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

శరీరానికి కావాల్సిన క్యాలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగని రోజూ దీన్నే తింటే ఇందులో ఎక్కువగా ఉండే కొవ్వులు శరీరంలోకి చేరతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. కాబట్టి వారానికోసారో.. రెండుసార్లో తినాలి.

శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, ఎ,డి,ఇ విటమిన్లు, కొవ్వులు.. మొదలైనవన్నీ ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోండి.

ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు తప్ప బ్రెడ్ జోలికి పోరు చాలామంది.. కానీ బరువు పెరగాలనుకునే వారు మాత్రం రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

మనం ఇంట్లో తయారు చేసుకునే పండ్ల రసాలు కూడా బరువు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. కాబట్టి బయట ఎక్కడో జ్యూస్ పాయింట్లలో తాగడం కంటే ఇంట్లో సహజంగా తయారు చేసుకునే పండ్ల రసాలే ఆరోగ్యానికి మంచివి.

శరీరానికి కావాల్సిన క్యాలరీలు అధికంగా ఉండే పీనట్ బటర్, ఆలివ్ ఆయిల్, చీజ్.. మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి.

ఒక్కో అరటి పండులో దాదాపు 100 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, పోషకాలు కూడా అరటి పండులో అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకో అరటి పండు తినడం అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

చేపల్లో ముఖ్యంగా ట్యూనా చేపలో శరీరానికి అవసరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మంచి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చు.

నట్స్, డ్రైఫ్రూట్స్‌లో క్యాలరీలు, ఫైబర్, ఇతర పోషకాలు కావాల్సినంత మొత్తంలో ఉంటాయి. రోజూ వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంలో పోషకాహార నిపుణులను సంప్రదించాలి.

ఓట్‌మీల్.. ఇది బరువు తగ్గడానికి ఎంత ముఖ్యమో.. బరువు పెరగాలనుకునే వారికీ అంతే అవసరం. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచుపదార్థం త్వరగా బరువు పెరగడంలో తోడ్పడుతుంది.

కొవ్వు లేని పెరుగును రోజూ తినడం వల్ల ఇట్టే బరువు పెరగొచ్చు. దీనిలో శరీరానికి అవసరమైన క్యాలరీలుంటాయి.

మితంగానే..

సులభంగా బరువు పెరగాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు.. బరువు పెరగాలనుకున్నా సరే మితంగానే ఆహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ ఎంత ఎక్కువగా తింటే శరీరానికి కావలసిన పోషకాలు అంత ఎక్కువగా కోల్పోతున్నామని మాత్రం గుర్తుంచుకోండి. కాబట్టి మితంగా తినండి.. అవసరమైన మేర బరువు పెరగండి..

గమనిక:

సాధారణంగా బరువు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్ధాలు, పద్ధతులు ఇవి. అయితే- ఈ సమాచారం ఒక ప్రాథమిక అవగాహనకు మాత్రమే. బరువు పెరగడం, తగ్గడం అనేది వ్యక్తిగతంగా ఎవరి ఆరోగ్య పరిస్థితుల పైన, శరీరతత్త్వం పైన ఆధారపడి ఉంటుంది. కొందరికి సరిపడే పదార్ధాలు, పద్ధతులు మరికొందరికి సరిపడకపోవచ్చు. అందువల్ల - బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా - సంబంధిత పోషకాహార నిపుణులను, వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించడం వల్ల- మరింత ఫలితముంటుంది. బరువు పెరగడమైనా, తగ్గడమైనా- ఏదైనా సరే- ఆరోగ్యకరమైన పద్ధతుల్లో మాత్రమే జరగాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్