‘డబుల్‌ చిన్‌’కు ఇలా చెక్‌ పెట్టేద్దాం!

అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న చిన్న సమస్యలు ముఖాకృతిని దెబ్బతీస్తుంటాయి. డబుల్‌ చిన్‌ కూడా అలాంటిదే! గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం వల్ల అదనపు లేయర్‌లా కనిపిస్తుంటుంది. ఈ సమస్యతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరమ్మాయిలు.

Published : 05 Jun 2024 12:04 IST

అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న చిన్న సమస్యలు ముఖాకృతిని దెబ్బతీస్తుంటాయి. డబుల్‌ చిన్‌ కూడా అలాంటిదే! గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం వల్ల అదనపు లేయర్‌లా కనిపిస్తుంటుంది. ఈ సమస్యతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరమ్మాయిలు. అయితే కొన్ని ఇంటి చిట్కాల పాటిస్తూ డబుల్‌ చిన్‌ను సులభంగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఎందుకిలా?

డబుల్‌ చిన్‌ రావడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

⚛ అధిక బరువు - అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం, తగ్గినప్పుడు అక్కడి చర్మం వదులుగా మారడమే ఇందుకు కారణం.

⚛ వంశపారంపర్యంగా - డబుల్‌ చిన్‌ రావడానికి జన్యుపరమైన కారణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు.

⚛ వయసు పైబడడం - వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం, తద్వారా గడ్డం కింద కొవ్వు పేరుకుపోవడం, అక్కడి చర్మం వదులవడం వల్ల కూడా డబుల్‌ చిన్‌ వస్తుందట!

ఇంటి చిట్కాలతో ఉపశమనం!

బాగా నమలండి..!

డబుల్‌ చిన్ సమస్యతో బాధపడే వారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది పటిష్టంగా తయారవుతాయి. దీనివల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా చక్కటి ముఖాకృతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే మార్కెట్లో లభించే షుగర్‌ ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే. తద్వారా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు సులభంగా కరుగుతుంది.

తెల్లసొనతో..

రెండు గుడ్లలోని తెల్లసొన, ఒక టేబుల్‌స్పూన్ పాలు, కొద్దిగా తేనె-నిమ్మరసం.. ఇవన్నీ బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల డబుల్‌ చిన్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గుడ్డు వాసన నచ్చని వారు ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌ కూడా కలుపుకోవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి కాఫీ, టీలకు బదులుగా గ్రీన్‌ టీని డైట్‌లో చేర్చుకుంటే డబుల్‌ చిన్‌ను క్రమంగా తగ్గించుకోవచ్చు.

విటమిన్ ‘ఇ’

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, స్వీట్ కార్న్, యాపిల్, సోయా బీన్స్, పప్పు దినుసులు.. ఇలాంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా లభిస్తుంది.. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

నీళ్లు ఎక్కువగా..

రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వుతో పాటు దవడ, గడ్డం కింద పేరుకున్న అనవసర కొవ్వులు కూడా కరిగిపోతాయి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ వ్యాయామాలతో..!

⚛ ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. తద్వారా డబుల్‌ చిన్‌నూ తగ్గించుకోవచ్చు.

⚛ మెడ గుండ్రంగా, నెమ్మదిగా కొద్ది సమయం పాటు తిప్పడం, పైకి-కిందకు కదిలించడం.. వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది.

⚛ ​​​​​​​అలాగే క్యాలరీలు, కొవ్వులు లేని ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్