Summer Tips: చర్మం జిడ్డుగా ఉంటోందా?

జిడ్డు చర్మతత్వం ఉన్న వారు వేసవికాలంలో అధికంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖం మరింత జిడ్డుగా కనిపిస్తూ, అందాన్ని తగ్గించి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు.

Published : 07 Apr 2024 15:56 IST

జిడ్డు చర్మతత్వం ఉన్న వారు వేసవికాలంలో అధికంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖం మరింత జిడ్డుగా కనిపిస్తూ, అందాన్ని తగ్గించి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు.

రెండుసార్లు క్లెన్సింగ్..

ఎండ నుంచి నీడలోకి వచ్చిన తర్వాత చర్మం కమిలిపోయినట్లు కనిపించడం లేదా కాస్త మంటగా అనిపించడం సహజం. అందుకే కొంతమంది చల్లని నీళ్లు ముఖం మీద చిలకరించుకుంటూ ఉంటారు. అయితే దానికి బదులు క్లెన్సింగ్ మిల్క్‌ని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి తప్పనిసరి..

ఎలాగూ చర్మం జిడ్డుగానే ఉంటుంది కదా.. ఇక వేసవిలో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదని భావిస్తే కనుక పొరపడినట్లే. ఎందుకంటే కాలానికి అనుగుణమైన ఉత్పత్తులను ఎంచుకొంటూనే, వాటిని వినియోగించాలి. లేదంటే చర్మం ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బ్లాటింగ్ పేపర్స్‌తో..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ముఖం మరీ జిడ్డుగా ఉంటే బ్లాటింగ్ పేపర్స్‌ని ఉపయోగించి ఆ సమస్యను అధిగమించవచ్చు. వీటిని బ్యాగ్‌లో పెట్టుకుని, జిడ్డుగా అనిపించినప్పుడల్లా వెంటనే వాటితో తుడుచుకోవడం వల్ల ఆయిలీనెస్ తగ్గడంతో పాటు ముఖం కూడా శుభ్రంగా కనిపిస్తుంది.

మేకప్ నప్పేలా..

స్నానానంతరం లేదా ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం సహజం. అయితే అందుకు ఉపయోగించే ఉత్పత్తులు కూడా జిడ్డుదనాన్ని అధిక సమయం నివారించేలా ఉండాలి. అప్పుడే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. లేదంటే మేకప్ వేసుకున్నా అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో ఇలాంటివారు ఆయిల్ ఆధారిత ఉత్పత్తులకు కాస్త దూరంగా ఉండటం మేలు.

అలాగే వేసవిలో తీసుకునే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. నూనె పదార్థాలు అధికంగా తీసుకుంటే సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం.

ఈ ఫేస్‌ప్యాక్స్‌తో ఫ్రెష్‌గా..

⚛ బాగా పండిన ఒక అరటిపండు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల ఓట్స్, చెంచా పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

⚛ కీరాదోస రసం, నిమ్మరసం కొద్దికొద్దిగా తీసుకుని బాగా కలపాలి. అందులో చిటికెడు పసుపు కూడా వేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల సేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం తాజాదనం సంతరించుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్