వారి ఆందోళన తగ్గించాలంటే..!

ఆందోళన.. ఇది పరిమితుల్లో ఉన్నంతవరకు ఒక సహజసిద్ధమైన భావనగానే పరిగణిస్తాం. కానీ ఒక్కసారి పరిధులు దాటితే మాత్రం ఇదొక మానసిక సమస్యగా మారుతుంది.

Published : 12 Oct 2023 12:30 IST

ఆందోళన.. ఇది పరిమితుల్లో ఉన్నంతవరకు ఒక సహజసిద్ధమైన భావనగానే పరిగణిస్తాం. కానీ ఒక్కసారి పరిధులు దాటితే మాత్రం ఇదొక మానసిక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఒకే విషయం గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం, కలత చెందడం.. వంటివి దీనికి ప్రధాన లక్షణాలు. మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలను ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

ప్రధాన లక్షణాలు

ప్రతి చిన్న విషయానికీ బాధపడడం

రిలాక్స్ అవడానికి ఇష్టపడకపోడం లేదా సాధ్యం కాకపోవడం..

డల్‌గా అనిపించడం, వూపిరి ఆడనట్లు ఉండడం..

సరిగా నిద్ర పట్టకపోవడం

ఏకాగ్రత లోపించడం.. మొదలైనవి కూడా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే లక్షణాల్లో కొన్ని.

ఇలా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల మనస్తత్వం చాలావరకు సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది.

చెప్పేది వినండి..

ఆందోళన చెందే సమయంలో ఒక వ్యక్తి మెదడులో ఒకేసారి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంతకుమించి ఎన్నో భావోద్వేగాలు కూడా వారిలో కలుగుతాయి. ఇలాంటి సమయంలో మనసులో ఉన్న బాధ, ఆలోచనల గురించి ఇతరులతో పంచుకుంటే వారికి కాస్త రిలాక్డ్స్‌గా అనిపించే వీలు ఉంటుంది. అందుకే ఎవరైనా ఆందోళన చెందుతున్నట్లు మీకు అనిపిస్తే మొదట వారి మనసులో ఉన్న బాధ, ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా వారు వాటి నుంచి తేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారు చెప్పేదానిని బట్టి మనం ఎలా స్పందించాలనే విషయంలో కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది.

తోడుగా ఉండండి..

ఆందోళన చెందే వ్యక్తుల్లో చాలావరకు కాసేపటి తర్వాత ఎదుటి వ్యక్తి మాటలకు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు.. అలాంటి వారు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు వారిని ఒంటరిగా పంపించడం కాకుండా మీరూ వారికి తోడుగా వెళ్లండి. తద్వారా 'నీకు ఎల్లవేళలా నేను తోడున్నా..' అనే నమ్మకాన్ని వారిలో కలిగించే వీలు ఉంటుంది. ఇలా ఏర్పడే నమ్మకం కారణంగా మనం చెప్పే మాటలు కూడా వారి మనసుని బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇవి వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

సహనంతో మెలగండి..

సాధారణ స్థితిలోనే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తి వినకపోవచ్చు.. అలాంటిది అతిగా ఆందోళన చెందే వ్యక్తులు కూడా చెప్పిన వెంటనే మన మాట వినాలని ఆశించకూడదు. ఒకటికి పదిసార్లు వారికి నచ్చచెప్పాలి. మన మాట వినేలా చేసుకోవడానికి అవసరమయ్యే సహనాన్ని కలిగి ఉంటూనే వారిలోనూ మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న సహనం కూడా వారిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే సాధనమే అని గుర్తుంచుకోవాలి.

నిర్ణయాలు వద్దు..!

అతిగా ఆందోళన చెందే వ్యక్తులకు సాధారణ సమయాల్లో నిర్ణయాత్మక శక్తి బాగానే ఉంటుంది. కానీ ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించేటప్పుడు లేదా ఆందోళనకి గురైనప్పుడు మాత్రం వారు తమ నిర్ణయాత్మక శక్తిని కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకే ఆ సమయంలో వారు దేనికి సంబంధించైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. మరీ అవసరమైతే వారికి బదులుగా వారి సమక్షంలో వారి సమ్మతితోనే మీరే నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే.

ఏ విధంగా సహాయపడాలి?

ఆందోళన చెందే వ్యక్తికి మన సహాయం ఏ విధంగా అవసరమో వారినే అడిగి తెలుసుకోవాలట! వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇది కూడా చాలావరకు తోడ్పడుతుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వారి మనోభావాలు పంచుకోవడం, సరదాగా కలిసి బయటకు వెళ్లడం, పాటలు వినడం.. ఇలా వారికి నచ్చే పనుల్లో తోడు ఉండడం ద్వారా మానసికంగా వారిలో మరింత త్వరగా మార్పు వస్తుందట! ఫలితంగా వారు ఆందోళన నుంచి సత్వరమే బయటపడే వీలుంటుంది.

ఇలా చేయద్దు..!

సాధారణంగా ఆందోళన చెందే వ్యక్తులను చూడగానే 'రిలాక్స్.. రిలాక్స్..' అంటూ వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి వారిపై ఎంతో కొంత ఒత్తిడి కలిగిస్తాం. ఇది సరైంది కాదు.

అతిగా ఆందోళన చెందే వ్యక్తులను దూరం పెట్టడం లేదా వారి నుంచి తప్పించుకుని తిరగడం.. ఇలాంటివేవీ మనం చేయకూడదు. అంతేకాదు.. ఒకసారి తలెత్తిన ఆందోళన దానంతట అదే తగ్గిపోతుందని వదిలేయడం కూడా సమంజసం కాదంటున్నారు నిపుణులు. వారికి మన తోడు, ప్రేమ, సహాయం.. వంటివి అందించడం ద్వారానే తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే వీలు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్