మోచేతుల నలుపు తగ్గిస్తాయివి!

అందంగా, యవ్వనంగా, కోమలంగా మెరిసే చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలుండరు. అందుకే ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే తరచూ పార్లర్‌లో పెడిక్యూర్‌, మానిక్యూర్‌ చేయించుకుంటారు.

Published : 29 Nov 2023 20:12 IST

అందంగా, యవ్వనంగా, కోమలంగా మెరిసే చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలుండరు. అందుకే ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే తరచూ పార్లర్‌లో పెడిక్యూర్‌, మానిక్యూర్‌ చేయించుకుంటారు. అయితే ఇంత చేసినా కొందరిలో మోచేతులు, కాలిమడమలు, మోకాళ్లపై చర్మం నల్లగా, గరుకుగా మారుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు మన వంటింట్లోనే బోలెడున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

కలబందతో..

అందానికి.. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల్లో కలబంద ముందు వరుసలో ఉంటుంది. దీన్ని ఉపయోగించి మోచేతులపై నలుపును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం కలబంద గుజ్జును మోచేతులు, మోకాళ్లపై నల్లగా ఉన్న చోట రాసుకోవాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి.. ఇలా రోజుకి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కలబందలో ఉన్న పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతో పాటు మృదువుగా మార్చుతాయి.

చక్కెరతో..

కొంతమందిలో మోచేతుల దగ్గర చర్మం మరీ నల్లగా ఉంటుంది. అలాంటి వారు చక్కెర ఉపయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. దీనికోసం ఒక టీస్పూన్‌ ఆలివ్ నూనెలో కొద్దిగా చక్కెర వేసి బరకగా ఉన్న మిశ్రమంలా కలుపుకోవాలి. దీన్ని నల్లగా మారిన మోచేతులపై రాసుకొని ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పంచదార మంచి స్క్రబ్‌లా పని చేసి మృతకణాలను తొలగిస్తుంది. ఆలివ్ నూనె చర్మం మృదువుగా మారేందుకు తోడ్పడుతుంది. ఇలా రోజుకోసారి చేస్తే క్రమంగా మోచేతులపై నలుపు కనుమరుగవుతుంది.

కొబ్బరినూనెతో..

కొబ్బరినూనెలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మానికి పోషణనందించి మృదువుగా మారుస్తాయి. రోజూ స్నానం చేసిన వెంటనే మోచేతులు, మోకాళ్లపై కాస్త కొబ్బరినూనె రాసుకొని రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల అక్కడి చర్మం మృదువుగా తయారవుతుంది. కొబ్బరినూనెలో అర టీస్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుంది.

నిమ్మతో..

నిమ్మ మంచి క్లెన్సర్‌గా పనిచేసి మృతకణాలను సమర్థంగా తొలగిస్తుంది. ఇందుకోసం నిమ్మచెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్న చోట కాసేపు రుద్ది, ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మచెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపును తగ్గించుకోవచ్చు.

పెరుగుతో..

ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకొని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని నల్లగా మారిన మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్‌తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపుదనం తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్