రాత్రి పూట.. కాస్త శ్రద్ధ చూపిస్తే..!

సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, కంటి కింద నల్లని వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణాలేంటో తెలుసా? చర్మంపై పడిన దుమ్ము-ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్‌ తొలగించకపోవడం.

Published : 02 Apr 2024 12:44 IST

సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, కంటి కింద నల్లని వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణాలేంటో తెలుసా? చర్మంపై పడిన దుమ్ము-ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్‌ తొలగించకపోవడం. ఈ రెండింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే రాత్రి పూట చర్మం విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తే అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

మేకప్‌ని ఇలా తొలగించుకోవాలి..

మన శరీరం చర్మ కణాలను రిపేర్‌ చేస్తుంది. మేకప్‌ తొలగించకపోవడం వల్ల లోపలికి వెళ్లిన దుమ్ము కణాలను అది బయటకు పంపించడానికి వీలు పడదు. అయితే చాలామంది మేకప్‌ తొలగించుకోవడానికి క్లెన్సర్‌ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ మేకప్‌ రిమూవర్‌ని వాడడం మంచిది. దీనివల్ల చర్మపు పీహెచ్‌ మారకుండా ఉంటుంది. మేకప్‌ తొలగించుకోవడానికి ఒక కాటన్‌ బాల్‌ని తీసుకొని దాన్ని రిమూవర్‌లో ముంచి మసాజ్‌ చేస్తున్నట్టుగా తొలగించుకుంటే.. మేకప్‌ పూర్తిగా తొలగిపోతుంది.. చర్మ ఆరోగ్యం తగ్గకుండానూ జాగ్రత్తపడచ్చు.

ఐ క్రీమ్..

ఒక్క కంటి కింద తప్ప.. ముఖంపై అన్ని భాగాల్లో నూనె గ్రంథులుంటాయి. అందుకే ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ల కింద చర్మాన్ని కాపాడుకోవడానికి రోజూ రాత్రి ఐ క్రీమ్‌ని ఉపయోగించడం మంచి పద్ధతి.. దీనివల్ల కంటి కింది భాగంలో తేమ పెరిగి నల్లటి వలయాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందు కంటి కింద క్రీం అప్లై చేసి తర్వాత నెమ్మదిగా మసాజ్‌ చేయడం వల్ల రక్తప్రసరణ కూడా బాగుంటుంది. నల్లటి వలయాలు తొందరగా తగ్గుతాయి.

స్క్రబింగ్ చేయాలి..

రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడైనా చర్మాన్ని స్క్రబింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. ఫలితంగా చర్మరంధ్రాలు మూసుకుపోకుండానూ జాగ్రత్తపడచ్చు. అలాగే బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వంటివి రాకుండా ఉంటాయి. అలాగని మరీ రోజూ స్క్రబింగ్ చేసేయకండి.. దీనివల్ల చర్మం గరుకుగా తయారవుతుంది. దీంతో పాటు మీ చర్మతత్వానికి సరిపడే స్క్రబ్‌ని ఎంచుకోవడం కూడా ముఖ్యమే!

ఇవి కూడా..

⚛ కంటి కింది భాగం లాగే పెదాలు కూడా సున్నితంగా ఉంటాయి. అందుకే పెదాలపై స్క్రబింగ్‌ చేయకూడదు. పెదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఓ శుభ్రమైన బట్టతో తుడవాలి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా రుద్దడం వల్ల అక్కడ ఏర్పడిన మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత లిప్‌బామ్‌ పూయడం వల్ల వాటికి తేమ అందుతుంది. దీనివల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

⚛ ఇవన్నీ చేసినా మాయిశ్చరైజర్‌ రాసుకోవడం చాలా అవసరం. తద్వారా చర్మానికి తేమ అంది సున్నితంగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సిన విటమిన్లు, ఇతర పోషకాలు అంది.. చర్మం పీహెచ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్