Wellness Trends: ఆహారం, వ్యాయామం, హాలిడే.. అన్నీ ‘ఆరోగ్య’కరంగానే!

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటుంటారు. అయితే తెలిసో, తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు లేనిపోని అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంటాయి. తద్వారా శారీరకంగానే కాదు.. మానసికంగానూ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఇకపై పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అంటున్నారు....

Published : 07 Jan 2023 12:51 IST

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటుంటారు. అయితే తెలిసో, తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు లేనిపోని అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంటాయి. తద్వారా శారీరకంగానే కాదు.. మానసికంగానూ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఇకపై పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి. కరోనా తర్వాత ఆరోగ్యంపై అందరిలో స్పృహ పెరిగిన నేపథ్యంలో.. ఈ ఏడాది కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని వెల్‌నెస్‌ ట్రెండ్స్‌ ఏంటి? సంపూర్ణ ఆరోగ్యానికి అవి ఎలా దోహదం చేస్తాయి? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!

హాలిడే.. ఆరోగ్యకరంగా..!

సాధారణంగా మనం హాలిడే ఎందుకు ప్లాన్‌ చేసుకుంటాం? ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త విరామం తీసుకొని మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి! ఈ ఆలోచనతోనే మనకు నచ్చిన ప్రదేశాల్ని ఎంచుకుంటాం. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతే కాదు.. శారీరకంగా దృఢంగా ఉండడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అందుకే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేలా ఈసారి వెకేషన్‌ ప్లాన్‌ చేసుకోమంటున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల ప్రాచీన థెరపీలు, చికిత్సలు అందించే ప్రదేశాలు మన దేశంలో బోలెడున్నాయి. ఆయుర్వేదానికి కేరళ, స్పా చికిత్సల కోసం హిమాలయాల్లోని రిషికేశ్‌, న్యాచురోపతీ-యోగా కోసం గోవా, ఆక్యుప్రెజర్‌-వెస్ట్రన్‌ మసాజ్‌-ఏరోబిక్స్‌.. వంటి చికిత్సల కోసం మహారాష్ట్రలోని ముల్షీ.. వంటివి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. ఆయా ప్రదేశాల్లో వాటికి సంబంధించిన ప్రత్యేక స్టూడియోలు, ఇతర సదుపాయాలు పర్యటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి ఎన్ని రోజుల పాటు వెకేషన్‌ని ప్లాన్‌ చేసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది.. అలాగే తమ ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవాలని భావించే వారు.. చికిత్స పూర్తయ్యే వరకు అక్కడే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఫలితం ఉంటుంది.

ఐదు నిమిషాలు చాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి! అయితే ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌స్టైల్లో దానికి ప్రత్యేక సమయం కేటాయించే వీలుండట్లేదు చాలామందికి! దీంతో వర్కవుట్‌ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు కొందరు. ఇలాంటి వారికోసమే మైక్రో వర్కవుట్స్‌ ట్రెండ్‌ ప్రాచుర్యంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇకపై వ్యాయామాలకు గంటల తరబడి సమయం కేటాయించక్కర్లేదు.. విరామ సమయంలో ఐదు పది నిమిషాల సమయం, అది కూడా శరీరంపై విపరీతమైన ఒత్తిడి లేకుండా చేసే సింపుల్‌ వర్కవుట్స్‌ని సాధన చేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. స్క్వాట్స్‌, పుషప్స్‌, జంపింగ్, పరుగు, నడక, మెట్లెక్కడం.. వంటివి ఫిట్‌నెస్‌నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. ఇక ఈ వ్యాయామాల్ని సులభంగా చేయడానికి వీలుగా స్ట్రెచ్‌ రింగ్‌, ఎక్సర్‌సైజ్‌ బ్యాండ్‌, యోగా వీల్‌.. వంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్‌ ఉండనే ఉన్నాయి. ఇలాంటి సింపుల్‌ వ్యాయామాలకు తోడు ఇంటి పనులూ మన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

‘పుట్టగొడుగు’తో.. ప్రయోజనాలెన్నో !

శారీరక, మానసిక ఆరోగ్యం దూరమైతే.. పలు దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి. వాటిలో నెలసరి సమస్యలు, పీసీఓఎస్‌.. వంటివి ఈతరం మహిళలకు సవాలుగా మారుతున్నాయి. వీటివల్ల చాలామంది స్త్రీలు సంతాన భాగ్యానికి నోచుకోవట్లేదంటున్నారు నిపుణులు. అలాంటి వారు ఈ దీర్ఘ కాలిక అనారోగ్యాల్ని దూరం చేసుకొని సంతాన యోగం పొందాలంటే పుట్టగొడుగుల్ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు. క్రమంగా దీని వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది దీన్ని తీసుకునే వారి శాతం మరింత పెరగనుందని చెబుతున్నారు. ఇది మహిళల్లో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయుల్ని పెంచుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది. అలాగే ఇది నెలసరి సమస్యల్ని దూరం చేయడానికి, పీసీఓఎస్‌ను అదుపులో ఉంచడానికీ తోడ్పడుతుందట! ఇక ఇందులో ఉండే విటమిన్‌ ‘డి’.. శరీరం క్యాల్షియంను ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది. ఇదొక్కటనే కాదు.. ఇతర పండ్లు, కాయగూరల్ని కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

‘నిద్ర’కంటూ ఓ ప్రణాళిక..!

మన శరీరానికి ఏది అలవాటు చేయాలన్నా.. ఒక కచ్చితమైన ప్రణాళిక వేసుకొని కొన్నాళ్ల పాటు ఫాలో అవ్వాలి. నిద్రకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలామందిని గమనిస్తే.. పని దినాల్లో ఒకలా, సెలవు రోజుల్లో మరోలా నిద్ర సమయాలుంటాయి. ఇది కూడా శారీరక, మానసిక ఆరోగ్యాల్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇక నుంచైనా నిద్రకు చక్కటి ప్రణాళిక వేసుకొని దాన్ని పాటించమంటున్నారు. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి.. అన్నది నిర్ణయించుకొని.. రోజూ దాని ప్రకారం ఫాలో అయితే కొన్నాళ్లకు ఈ సమయాలే అలవాటవుతాయి. దీనివల్ల బద్ధకం కూడా దూరమవుతుంది. సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. కావాలంటే మీరూ ప్రయత్నించి చూడండి!

వీటితో పాటు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, శీతల పానీయాలకు బదులు మొక్కలు-మూలికా ఆధారిత పానీయాల్ని తీసుకోవడం, డిజిటల్‌ డీటాక్స్‌ (గ్యాడ్జెట్స్‌ను దూరం పెట్టడం)కు మరింత ప్రాధాన్యమివ్వడం.. వంటివి చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్