Published : 20/10/2021 19:45 IST

Stone Fruits: ఆరోగ్యానికి.. అందానికీ!

సాధారణంగా చాలా పండ్లలో గింజలు/విత్తనాలు ఉండడం మనకు తెలిసిందే. అయితే కొన్ని పండ్లలో వీటిని కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్‌ ఫ్రూట్స్’ అంటారు. మామిడి, పీచ్‌, ఆప్రికాట్స్‌, ప్లమ్స్‌, చెర్రీస్‌, రాస్బెర్రీ.. వంటి పండ్లు ఇందుకు ఉదాహరణలు. అయితే వీటిలో ఎక్కువ శాతం ఆయా కాలాల్లో మాత్రమే లభ్యమవుతాయని.. తద్వారా అవి సహజంగా పరిపక్వం చెంది అమోఘమైన రుచిని అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

రోగనిరోధక శక్తికి..!

కాలం మారే కొద్దీ వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం సహజమే! అయితే వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే స్టోన్‌ ఫ్రూట్స్‌ అందుకు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. విటమిన్‌ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉండే ఈ పండ్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రక్తపోటు నియంత్రణలో..!

అధిక రక్తపోటుతో బాధపడేవారు తీసుకునే మందుల కారణంగా అప్పుడప్పుడూ అలసట, నీరసం వేధించడం సహజమే! అయితే వీటి నుంచి విముక్తి పొంది నరాలు, కండరాలు రిలాక్స్‌ కావాలంటే స్టోన్స్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం అత్యుత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పీచ్‌, ప్లమ్‌.. వంటి పండ్లలో పొటాషియం స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపు చేస్తాయి. తద్వారా అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి.
 

క్యాన్సర్లను అడ్డుకుంటాయి!

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లే వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి, వాటి బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా స్టోన్‌ ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటిలోని ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్‌ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు.

ఈ సిండ్రోమ్‌కు దూరంగా..!

ఊబకాయం, శరీరంలో వాపు.. వంటి దీర్ఘకాలిక సమస్యలు గుండె జబ్బులు, గుండెపోటు, మధుమేహం.. తదితర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు మూకుమ్మడిగా దాడి చేస్తే దాన్ని మెటబాలిక్‌ సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే స్టోన్‌ ఫ్రూట్స్‌ అందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. వీటిలోని ఫినోల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు ఈ సిండ్రోమ్‌తో పోరాడి ఇతర దుష్ప్రభావాలకు దారితీయకుండా అడ్డుకుంటాయట!

అందానికీ..!

జుట్టు, చర్మ ఆరోగ్యంలో కొలాజెన్‌ పాత్ర కీలకం! దీన్ని సప్లిమెంట్లు, క్రీముల రూపంలో బయటి నుంచి అందించకుండా శరీరంలోనే సహజసిద్ధంగా ఉత్పత్తి కావాలంటే అందుకు స్టోన్‌ ఫ్రూట్స్‌ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఆప్రికాట్స్‌, ప్లమ్స్‌.. వంటి పండ్ల గుజ్జు/ఎక్స్‌ట్రాక్ట్స్‌ని సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతుంటారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వయసు ఛాయల్ని దాచిపెట్టి నవయవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

ఇవి కూడా!

* ఫైబర్‌ పుష్కలంగా లభించే స్టోన్‌ ఫ్రూట్స్‌ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.. తద్వారా అధిక బరువు అదుపులోకొస్తుంది.

* పాలీఫినోల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్‌ నిండి ఉండే ఈ పండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని దగ్గర చేసే గుణాలు స్టోన్‌ ఫ్రూట్స్‌లో బోలెడున్నాయి. తద్వారా రాత్రుళ్లు సుఖంగా నిద్రపోవచ్చు.

ఇవి గుర్తు పెట్టుకోండి!

* ఎన్నో ఔషధ గుణాలు మిళితమై ఉన్న స్టోన్‌ ఫ్రూట్స్‌ని సలాడ్స్‌, స్మూతీస్‌, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు. కాస్త క్రిస్పీగా కావాలనుకునే వారు ఈ పండ్ల స్లైసుల్ని గ్రిల్ చేసుకొని లేదా కాల్చుకొని తీసుకున్నా సమాన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

* ఈ పండ్లను గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి. అలాకాకుండా ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడైపోతాయి. అలాగే ఇవి ఎంత ఎక్కువగా పండితే అంత రుచిగా ఉంటాయట!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని