Sugar Addiction: తీపికి బానిసయ్యారా? తెలుసుకోండిలా..!

తీపి పదార్థాల్ని ఇష్టపడని వారుండరు. అయితే సందర్భాన్ని బట్టి, లేదంటే తినాలనిపించినప్పుడు ఓ స్వీటు ముక్క నోట్లో వేసుకొని మనసును తృప్తిపరుస్తాం. కానీ కొంతమంది అదే పనిగా తీపి పదార్థాల్ని లాగిస్తుంటారు.. చాక్లెట్స్‌, క్యాండీస్‌.. వంటివీ వదిలిపెట్టరు.

Published : 14 Sep 2023 12:52 IST

తీపి పదార్థాల్ని ఇష్టపడని వారుండరు. అయితే సందర్భాన్ని బట్టి, లేదంటే తినాలనిపించినప్పుడు ఓ స్వీటు ముక్క నోట్లో వేసుకొని మనసును తృప్తిపరుస్తాం. కానీ కొంతమంది అదే పనిగా తీపి పదార్థాల్ని లాగిస్తుంటారు.. చాక్లెట్స్‌, క్యాండీస్‌.. వంటివీ వదిలిపెట్టరు. ఈ అలవాటే కొన్నాళ్లకు వ్యసనంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలా చక్కెర ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలూ చుట్టుముడతాయి. కాబట్టి వ్యసనంలా మారకముందే ఈ అలవాటును అదుపు చేసుకోమంటున్నారు. మరి, ఇంతకీ మన శరీరం తీపి పదార్థాలకు బానిసయ్యిందన్న విషయం ఎలా తెలుసుకోవాలి? తీపి తినాలన్న కోరికను ఎలా అదుపు చేసుకోవాలి? తెలుసుకుందాం రండి..!

మనం రోజువారీ తీసుకునే చాలా పదార్థాల్లో చక్కెరలు నిక్షిప్తమై ఉంటాయి. పండ్లు, కాయగూరలు, పాలు-పాల పదార్థాలు, కొన్ని రకాల ధాన్యాలు.. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతేకాదు.. వీటిలో ఉండే ఫైబర్‌ రక్తంలో ఉండే చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తుందని, అందుకే ఈ సహజ చక్కెరలను తగిన మోతాదులో తీసుకోవడం మంచిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. అయితే వచ్చిన చిక్కల్లా చక్కెరలు ఉపయోగించి తయారుచేసిన పదార్థాలతోనే! స్వీట్లు, చాక్లెట్స్‌, బిస్కట్స్‌, చిప్స్‌, ఐస్‌క్రీమ్స్‌, జ్యూస్‌లు, పేస్ట్రీస్‌, కుకీస్‌, శీతల పానీయాలు, సాస్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చక్కెరలు ఉపయోగించి తయారుచేసిన పదార్థాలు ఎన్నో! వీటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనికి తోడు మధుమేహం, అధిక రక్తపోటు, బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు.

తీపి కోరికలు.. ఎందుకు?

సాధారణంగా తీపి తినాలన్న కోరిక మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందనుకుంటాం. కానీ శరీరంలో జరిగే పలు మార్పులే ఈ కోరికలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

శరీరం తేమను కోల్పోయినప్పుడు.. జీవక్రియల పనితీరు కోసం శక్తిని ఉత్పత్తి చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో అత్యవసర శక్తి కోసం శరీరానికి చక్కెరలు అవసరమవుతాయి. తద్వారా తీపి తినాలన్న కోరికలు పెరుగుతాయంటున్నారు నిపుణులు.

పోషకాహారలేమి కూడా తీపి పదార్థాలు తినాలన్న కోరికను పెంచుతుందంటున్నారు నిపుణులు. ప్రొటీన్‌, ఫైబర్.. వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సరైన మోతాదులో తీసుకోకపోతే.. ఆకలి హార్మోన్లైన లెప్టిన్‌, గ్రెలిన్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇవి తీపి కోరికల్ని పెంచుతాయట!

హార్మోన్ల అసమతుల్యత మన శరీరంలో పలు సమస్యలకు కారణమవుతుంటుంది. తీపి తినాలన్న కోరికకూ ఇదే కారణమంటున్నారు నిపుణులు. ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిసాల్‌, లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు.. శరీరం తీపిని కోరుకుంటుందట!

పొట్టలోని బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కీలకం! అయితే ఒక్కోసారి ఇది ఇన్సులిన్‌ నిరోధకతతో అనుసంధానమై పనిచేస్తుంది. ఇలాంటప్పుడూ శరీరం తీపి తినాలన్న కోరికను వ్యక్తం చేస్తుందట!

నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో అధిక క్యాలరీలుండే ఆహార పదార్థాలు తినాలన్న కోరిక కలుగుతుంది. నిజానికి ఇవీ చక్కెరలు నిండిన పదార్థాలే! కాబట్టి ఈ సమయంలో వీటికి దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.


ఎలా తెలుసుకోవాలి?

తీపి తినాలనిపించినప్పుడల్లా స్వీటో, చాక్లెటో లాగించేస్తుంటాం.. అలాగని పదే పదే వీటిని తినడం వల్ల కొన్నాళ్లకు శరీరం తీపికి అలవాటు పడిపోతుంది. ఆపై మనకు తెలియకుండానే చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాల్ని తీసుకోవడం మొదలుపెడతాం. ఇలా మనకు తెలియకుండానే మన శరీరం చక్కెరకు అలవాటు పడిందని కొన్ని శారీరక లక్షణాలు/సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

చక్కెరలో క్యాలరీలు తప్ప ఎలాంటి పోషక విలువలు ఉండవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు.. వంటి పోషకాల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాల పైకి మనసు లాగుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తోందంటే.. మీరు చక్కెరకు బానిసయ్యారనడానికి సంకేతంగా భావించమంటున్నారు. ఇక ఈ రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరం.. కాబట్టి వీటిని దూరం పెట్టడం మంచిదంటున్నారు.

చర్మ ఆరోగ్యాన్ని బట్టి కూడా తీపి తినాలన్న కోరికల్ని అంచనా వేయచ్చంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం వల్ల, ఇవి ప్రొటీన్లతో అనుసంధానమై ‘అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ ప్రొడక్ట్స్‌ (AGEs)’ అనే కణజాలాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియను గ్లైకేషన్‌ అంటారు. ఇది మోతాదుకు మించి జరిగితే.. చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా చర్మంపై ముడతలు, గీతలు.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి చిన్న వయసులోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీరు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లేనట!

సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత ఏమీ తినాలనిపించదు. అదే స్వీట్లు, ఇతర తీపి పదార్థాలు తినాలనిపిస్తోందంటే.. శరీరం చక్కెరకు అలవాటు పడిందనడానికి ఓ సంకేతంగా భావించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి వారిలో తీపి పదార్థాలు తినడానికి, ఆకలికి సంబంధం ఉండదట!

యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళనలు, ఒంటరితనం.. వంటి సమస్యలతో మనసు కకావికలమవుతున్నప్పుడూ తియ్యటి పదార్థాల పైకి మనకు లాగుతోందంటే.. మీరు తీపి పదార్థాలకు అలవాటు పడ్డట్లేనట!

మనసు బాగోకపోయినప్పుడూ నచ్చినవి తిని ఆ మూడ్‌ నుంచి బయటపడుతుంటాం. ఇలాంటప్పుడూ తీపి తినాలని మనసు లాగుతుంటే మాత్రం స్వీట్లకు బానిసైనట్లే అంటున్నారు నిపుణులు.

కొన్నిసార్లు శారీరక అలసట, నీరసం కూడా తీపి పదార్థాలకు బానిసయ్యారనడానికి సూచికగా చెప్పచ్చంటున్నారు నిపుణులు.


ఇలా తగ్గించుకోండి!

తీపి పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటు వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే చక్కెర కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

ప్రొ-బయోటిక్‌ పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేసి ఆకలిని తగ్గిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. తద్వారా తీపి పదార్థాల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఇవి ఎక్కువగా ఉండే పెరుగు, చీజ్‌, సోయా, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

శరీరం డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు నీరసించిపోతాం. తిరిగి శక్తి కోసం చక్కెర అవసరమవుతుంది. ఫలితంగా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ప్రొటీన్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. తీపి తినాలన్న కోరిక కలగకుండా కూడా జాగ్రత్తపడచ్చు. కాబట్టి ఈ పోషకాలు లభించే గుడ్లు, నట్స్‌, అవకాడో, బ్రకలీ, బాదం, క్యాలీఫ్లవర్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

అల్పాహారం మానేయడం, భోజనానికి-భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్‌ రావడం వల్ల ఎక్కువ ఆకలి వేస్తుంటుంది. ఇది కూడా తీపి తినాలన్న కోరికను పెంచుతుంది. కాబట్టి ఆకలయ్యే దాకా వేచి చూడకుండా.. మధ్యమధ్యలో ఏదైనా పండు, నట్స్‌.. వంటి తేలికపాటి పదార్థాలు తీసుకోవడం మంచిది.

చూయింగ్‌ గమ్‌ తీపి తినాలన్న కోరికను తగ్గిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. కాబట్టి తీపి పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టాలనుకున్న వారు.. తినాలనిపించిన ప్రతిసారీ ఈ పద్ధతిని ప్రయత్నించచ్చు. అది కూడా చక్కెర రహిత చూయింగ్‌ గమ్‌తోనే!

తీపి పదార్థాల్లోనే ఆరోగ్యకరమైన ఆప్షన్లను ఎంచుకొని చక్కెర కోరికల్ని అదుపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఓ బైట్‌ డార్క్‌ చాక్లెట్‌, హెల్దీ బార్స్‌, ఖర్జూరాలు, చిలగడదుంపలు.. వంటివి తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్