ఈ అందగత్తె వయసెంతో తెలుసా..?

చాలామంది దృష్టిలో అందమంటే.. చక్కటి చర్మ ఛాయ, నాజూకైన శరీరాకృతి. సాధారణంగా ఈ ప్రమాణాలు యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఏడు పదుల వయసులో.. పాతికేళ్ల అమ్మాయిలతో పోటీ పడుతూ మరీ అందంగా మెరిసిపోతోంది వెరా వాంగ్.

Published : 05 Jun 2024 12:03 IST

(Photos: Instagram)

చాలామంది దృష్టిలో అందమంటే.. చక్కటి చర్మ ఛాయ, నాజూకైన శరీరాకృతి. సాధారణంగా ఈ ప్రమాణాలు యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఏడు పదుల వయసులో.. పాతికేళ్ల అమ్మాయిలతో పోటీ పడుతూ మరీ అందంగా మెరిసిపోతోంది వెరా వాంగ్. సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసే ఫొటోలు ఎప్పటికప్పుడు సెన్సేషన్‌ని క్రియేట్‌ చేస్తూనే ఉంటాయి. అయితే ఇటీవలే తెలుపు రంగు స్విమ్‌ సూట్‌లో పూల్‌ బయట కూర్చున్న ఓ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్‌ చేసింది వాంగ్‌. ఇది చూసి చాలామంది కుర్రకారు ఆమె అందానికి, నాజూకైన శరీరాకృతికి ఫిదా అయిపోయారు. కానీ ఆపై ఆమె అసలు వయసు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. మరి, ఈ వయసులోనూ ఇంత అందంగా.. ఎలా సాధ్యం? అనడిగితే.. తాను పాటించే కొన్ని చిట్కాలే ఇందుకు కారణమంటోందామె.

సాధారణంగా వయసు మీద పడే కొద్దీ చర్మంపై ముడతలు, గీతలు కనిపించడంతో పాటు ముఖం పాలిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అయితే వెరా వాంగ్‌ని చూస్తే పాతికేళ్ల అమ్మాయేమోనని చాలామంది పొరబడుతుంటారు. ఎందుకంటే ఆమె వయసు 74 ఏళ్లు. ఈ వయసులోనూ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా తన అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందామె.

ప్రతి ఫొటో సెన్సేషనే!

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే వెరా.. విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ ధరించి దిగిన ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తన నాజూకైన శరీరాకృతికే కాదు.. తన అపురూప లావణ్యానికీ నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలా ఓసారి ఆరెంజ్‌ కలర్‌ బ్రాలెట్, షార్ట్స్‌ ధరించిన ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో తన అందాన్నే కాదు.. తన నల్లటి, పొడవాటి కురులు చూసి అప్పట్లో ఎంతోమంది ముగ్ధులయ్యారు. ఇక ఇటీవలే మరో ఫొటోతో ఇన్‌స్టా లవర్స్‌ని మాయ చేసింది వాంగ్‌. తెలుపు రంగు సింగిల్‌ పీస్‌ స్విమ్‌ సూట్‌లో, స్టైలిష్‌ గ్లాసెస్‌ ధరించి స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన సేదదీరుతోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందామె. ఇది చూసిన నెటిజన్లు ఆమె వయసు 30ల్లోపు ఉంటుందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఎందుకంటే 74 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ను, చక్కటి శరీరాకృతిని, అంతకుమించిన అందాన్ని మెయింటెయిన్‌ చేయడమంటే మాటలు కాదు. అందుకే చాలామంది.. ‘74 ఏళ్ల వయసులోనూ ఇంత అందమా.. ఇదెలా సాధ్యమైంది?’ అంటూ స్పందించారు. ఇక మరికొందరు.. ‘ఇది ఫిల్టర్‌ చేసిన ఫొటోనేమో’ అంటూ పొరపాటు పడ్డారు. కానీ ఇదే నిజమైన ఫొటో అని ఆ తర్వాత తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇలా సోషల్‌ మీడియాలో వాంగ్‌ పెట్టే ప్రతి ఫొటో సెన్సేషన్‌గానే నిలుస్తుంటుందని చెప్పచ్చు.


అవే.. నా బ్యూటీ సీక్రెట్స్!

వాంగ్‌కు ఇద్దరు కూతుళ్లు. ఈ ముగ్గురూ ఒకే వరుసలో నిలబడితే అక్కచెల్లెళ్లలా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలా అందం విషయంలో తన ఇద్దరు కూతుళ్లతో పోటీపడుతూ మరీ మెరిసిపోతోందామె. అయితే ఇటీవలే తన ఫొటో మరోసారి వైరలవడంతో చాలామంది ఆమె సౌందర్య రహస్యాలేంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో తన అపురూప లావణ్యం వెనకున్న సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ ఓల్డెస్ట్‌ బ్యూటీ.

⚛ నేను చెప్తే చాలామంది నమ్మరు.. కానీ మనం ఎలా ఆలోచిస్తే.. అది మన శరీరాకృతి, చర్మ సౌందర్యంలో ప్రస్ఫుటమవుతుంది. నేనెప్పుడూ యంగ్‌గా ఆలోచిస్తా. ఈ కాలపు అమ్మాయిలా ఆలోచిస్తూ.. ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తా. ఇదే నా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

⚛ ఇక నిద్ర విషయంలో అస్సలు రాజీ పడను. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోతా.

⚛ సన్‌స్క్రీన్‌ రాసుకోకుండా బయట అడుగుపెట్టను. బహుశా.. ఇదే నా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందేమో అనిపిస్తుంది.

⚛ ఎప్పుడూ సంతోషంగా, బిజీగా గడుపుతా. నా చర్మంపై ముడతలు, గీతలు రాకుండా ఇవే అడ్డుపడుతున్నాయి.

⚛ Sashimi (ఇదో రకమైన చేప), బ్రౌన్‌ రైస్‌, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటా. చైనీస్‌ పద్ధతిలో ఆవిరిపై ఉడికించిన బ్రకలీ, చికెన్‌, రైస్‌.. కూడా ఆహారంలో చేర్చుకుంటా. ఆహారం విషయంలో సమతుల్యత కోల్పోకుండా జాగ్రత్తపడతా.

⚛ ఇక నా డైట్‌లో వోడ్కా కాక్‌టెయిల్ ఉండాల్సిందే! ఎందుకంటే.. ఇదే నా బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి నన్ను బయటపడేసి ప్రశాంతంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. అయితే అది కూడా మితంగానే తీసుకుంటా.

⚛ ఇక మేకప్‌, బ్యూటీ ఉత్పత్తులకు సాధ్యమైనంత దూరంగా ఉంటా.. అత్యవసర పరిస్థితుల్లోనే, అది కూడా తక్కువ స్థాయిలో మేకప్‌ వేసుకుంటా..’ అంటూ తన యూత్‌ఫుల్‌ లుక్స్‌ వెనకున్న సీక్రెట్స్‌ని పంచుకుంది వాంగ్.


‘బ్రైడల్‌ గౌన్స్‌’కి పెట్టింది పేరు!

ఇలా 74 ఏళ్ల వయసులోనూ తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న వాంగ్‌.. వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ఆమె సొంత దేశం చైనా. అయితే వాంగ్‌ పుట్టకముందే ఆమె పేరెంట్స్‌ అమెరికా వచ్చి స్థిరపడ్డారు. ఆర్ట్‌ హిస్టరీలో డిగ్రీ పూర్తిచేసిన వాంగ్‌.. ఫిగర్‌ స్కేటింగ్‌పై మక్కువతో ఎనిమిదేళ్ల వయసులోనే ఈ క్రీడలో శిక్షణ తీసుకుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని పలు పతకాలు సైతం సొంతం చేసుకుంది. ఆపై ఇదే క్రీడను కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. జాతీయ స్థాయిలో పలు ఫిగర్‌ స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. అయితే ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన కల నెరవేరకపోవడంతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిందామె. అప్పుడు ఆమె వయసు 40 ఏళ్లు. 1990లో ‘వెరా వాంగ్‌’ పేరుతోనే ఫ్యాషన్‌ లేబుల్‌ని ప్రారంభించిన ఆమె.. ఈ వేదికగా బ్రైడల్‌ గౌన్స్‌ని రూపొందించడం ప్రారంభించింది. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పెళ్లి గౌన్లను కస్టమైజ్‌ చేయడంలో క్రమంగా ప్రావీణ్యం సంపాదించిన ఆమె.. హైలీ బీబర్‌, అరియానా గ్రాండే, గ్వెన్‌ స్టెఫానీ.. తదితర హాలీవుడ్‌ తారలకూ బ్రైడల్‌ గౌన్లు రూపొందించింది. ఇలా తనదైన ఫ్యాషన్‌ నైపుణ్యాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. తన లేబుల్‌ను ఫ్యాషన్‌కే పరిమితం చేయకుండా.. పలు యాక్సెసరీల తయారీకీ విస్తరించింది. ప్రస్తుతం ఈ వేదికగా నగలు, పెర్‌ఫ్యూమ్స్‌, గృహాలంకరణ వస్తువులూ రూపొందిస్తోందామె. ఆమె రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌.. పలు అంతర్జాతీయ వేదికల పైనా ప్రదర్శితమయ్యాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్