పొడిబారిన కేశాలు కళగా ఇలా..!

‘సీజన్ ఏదైనా సరే.. ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలి..' ఇది ప్రతి అమ్మాయికీ ఉండే కోరికే! కానీ చలికాలంలో

Updated : 07 Dec 2021 19:43 IST

‘సీజన్ ఏదైనా సరే.. ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలి..' ఇది ప్రతి అమ్మాయికీ ఉండే కోరికే! కానీ చలికాలంలో చర్మ, కేశ సంబంధిత సమస్యలు తలెత్తడం కూడా మామూలే! కేశాలు పొడిబారడం, నిర్జీవంగా మారడం.. చివర్లు చిట్లడం.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కేశాలు ఆరోగ్యంగా ఉండే వారికే ఇన్ని ఇబ్బందులు ఉంటే.. ఇక పొడి జుట్టు ఉన్న మహిళలు ఈ కాలంలో పడే ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? అందుకే వారు తమ కురుల సంరక్షణ పట్ల మరింత ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో శీతాకాలంలో పొడిజుట్టు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

చలికాలంలో ఉండే చలిగాలుల ప్రభావం మాత్రమే కాకుండా వాతావరణంలో ఉండే తేమ, పొగమంచు.. వంటి వాటి వల్ల కూడా కురులు పొడిబారినట్లుగా కనిపిస్తుంటాయి. ఇక సహజసిద్ధంగానే పొడితత్వం ఉండే కురులు ఉన్నవారు ఈ సమయంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే శీతాకాలంలో కేశ సంరక్షణ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేశాలకు పలు హెయిర్‌ప్యాక్స్ ద్వారా తేమను అందిస్తూనే అది అధిక సమయం నిలిచి ఉండేలా చూసుకోవాలి.

అవకాడో, కొబ్బరి పాలతో..

అరకప్పు కొబ్బరిపాలలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అవకాడో గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేసి, నాణ్యమైన కండిషనర్ అప్త్లె చేసుకోవాలి. ఈ ప్యాక్‌లో మనం ఉపయోగించే అవకాడో కురులకు తగినంత తేమ అందించి అవి ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

గుమ్మడికాయ, తేనెతో..

కురుల ఆరోగ్యానికి విటమిన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విటమిన్ ఎ, సిలతో పాటు బీటాకెరోటిన్, జింక్, పొటాషియం.. మొదలైనవన్నీ గుమ్మడికాయలో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే దీనిని ఉపయోగించి తయారుచేసే ప్యాక్స్ ద్వారా కూడా కేశాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కొద్దిగా గుమ్మడికాయ పేస్ట్ తీసుకొని అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసి మంచి కండిషనర్ అప్త్లె చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా కురులు మృదువుగా, పట్టులా మారతాయి.

అరటిపండుతో..

సహజసిద్ధంగా పండిన ఒక అరటిపండు తీసుకొని దానిని మెత్తగా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకొని కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ కేవలం శీతాకాలంలోనే కాదు.. ఏ కాలంలో అయినా పొడిబారిన కురుల సమస్య నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.

వేడిగా వద్దు..!

ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ద్వారా బయట నుంచి కురులకు తేమ అందించడం ఒక ఎత్తు అయితే; ఆ తేమ అధిక సమయం నిలిచి ఉండేలా జాగ్రత్తగా ఉండడం మరొక ఎత్తు. సాధారణంగా చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది వేడినీటితోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ బాగా ఎక్కువ వేడిగా ఉండే నీటి కారణంగా కేవలం కురులకే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలో కేవలం గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం.

తరచూ తలస్నానం..

శీతాకాలంలో తరచూ తలస్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. దీని కారణంగా కేశాలు చాలా త్వరగా తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారానికి రెండు లేదా మూడుసార్లు కంటే ఎక్కువగా తలస్నానం చేయకూడదు. అలాగే తడి కురులను వీలైనంత వరకు సహజసిద్ధంగానే ఆరబెట్టుకోవాలి. కురులకు సంబంధించి ఉపయోగించే ఉత్పత్తులు కూడా నాణ్యమైనవే ఎంపిక చేసుకోవాలి.

నూనెతో మర్దన తప్పనిసరి..

జుట్టు పొడిబారినట్లు కనిపించకుండా ఉండాలంటే తగినంత తేమను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి. అందుకే తలస్నానం చేసే ప్రతిసారీ కురులకు నూనెతో మర్దన చేసుకోవడం తప్పనిసరి. అయితే సాధారణ కొబ్బరినూనె ఉపయోగించడానికి బదులుగా బాదం నూనె, జొజోబా ఆయిల్‌లతో స్వచ్ఛమైన కొబ్బరినూనెని కలిపి ఆ మిశ్రమాన్ని కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కురులకు రాసుకోవాలి. కాసేపు మర్దన చేసి, గోరువెచ్చని నీళ్లలో ముంచిన టవల్ లేదా షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంటపాటు అలా ఉండనిచ్చి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా కుదుళ్ల నుంచి చివర్ల వరకు తేమ అంది కురులు కళగా కనిపిస్తాయి.

క్యాప్‌తో కవర్ చేయాలి..

శీతాకాలంలో జుట్టు పొడిబారడానికి గల ప్రధాన కారణాల్లో చల్లగాలి కూడా ఒకటి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కురులను కవర్ చేయడం కూడా తప్పనిసరి. అయితే ఇందుకోసం ఉన్ని లేదా ఇతర ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసిన స్కార్ఫ్ కంటే సిల్క్‌తో తయారుచేసినవి ఎంచుకుంటే మంచిది. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులో ఉంటుంది.

చూశారుగా.. చలికాలంలో పొడిజుట్టు ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు.. మీరు కూడా వీటిని గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. కళకళలాడే కురులతో మరింత అందంగా మెరిసిపోతూ శీతాకాలాన్ని ఎంజాయ్ చేసేయండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్