క్యారెట్‌ నూనెతో..

చలికాలంలో చర్మసౌందర్య పరిరక్షణకు క్యారెట్‌తో ఇంట్లోనే నూనె, క్రీములు తయారుచేసుకోవచ్చు. ముఖచర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయొచ్చు.

Published : 09 Jan 2023 00:32 IST

చలికాలంలో చర్మసౌందర్య పరిరక్షణకు క్యారెట్‌తో ఇంట్లోనే నూనె, క్రీములు తయారుచేసుకోవచ్చు. ముఖచర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయొచ్చు.

క క్యారెట్‌ దుంపను శుభ్రపరిచి చిన్నగా తురుముకోవాలి. 50గ్రాముల వర్జిన్‌ కొబ్బరి నూనెను పొయ్యిపై ఉంచి రెండు చెంచాల బాదంనూనె కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత క్యారెట్‌ తురుమును వేసి కాసేపు మరగనిచ్చి దించాలి. చల్లార్చి వడకట్టి, రెండు ఈ విటమిన్‌ క్యాప్సూల్స్‌ ఆయిల్‌, రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ కలిపి పొడి గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే నెలరోజులు  నిల్వ ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు రెండు చుక్కల నూనెను ముఖానికి మృదువుగా రాసి ఇంకనివ్వాలి. ఉదయాన్నె ముఖాన్ని శుభ్రపరిస్తే చాలు. ఇలా రెండు వారాలు చేస్తే చర్మం కాంతిమంతమవుతుంది. ఇందులోని బీటా కెరొటిన్‌, ఏ, సీ విటమిన్లు చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.  కొల్లాజెన్‌ ఉత్పత్తిలో తోడ్పడి మృదుత్వాన్ని అందిస్తాయి. కంటి కింద నలుపుచారలు, పెదవుల చుట్టూ ఏర్పడే నల్లని మచ్చలు, గీతలు, ముడతలను పోగొడతాయి. కొబ్బరి నూనె ముఖచర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ముంజేతులకు, మెడకు కూడా ఈ నూనె రాస్తే, ముఖచర్మ వర్ణంతో సమానంగా కనిపిస్తాయి. 

బంగాళాదుంపను కలిపి.. ఒక క్యారెట్‌, బంగాళాదుంపలను శుభ్రపరిచి తురుముకోవాలి. అలాగే ఒక నిమ్మకాయపై తొక్కను చిన్నగా తురమాలి. ఈ మూడు తురుములను మెత్తని వస్త్రంలో వేసి రసం తీయాలి. నాలుగు చిన్నచెంచాల ఈ మిశ్రమంలో నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు, మూడు చిన్న చెంచాల వర్జిన్‌ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. చివరగా ఒక ఈ విటమిన్‌ క్యాప్సుల్‌, మూడు చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్‌ నూనెలు వేసి మరోసారి కలిపి పొడి గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచితే రెండు వారాలుంటుంది. ఉదయం, సాయంత్రం ముఖాన్ని శుభ్రపరిచి ఈ క్రీంను మృదువుగా రాయాలి. నిమ్మకాయ తొక్క చర్మసంబంధిత సమస్యలతో పోరాడుతుంది. మొటిమల మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్‌ వంటివాటిని దూరం చేస్తుంది. బంగాళా దుంపలో ఉండే కాటికలేజ్‌ ఎంజైం నల్ల మచ్చలను మాయం చేసి ముఖాన్ని మెరిపిస్తుంది.

క్రీంగా.. రెండు క్యారెట్‌ దుంపలను శుభ్రపరిచి తురిమి, రెండురోజులు ఫ్యాను గాలికి ఆరనివ్వాలి. దీన్ని పొడి గాజు సీసాలో వేసి తురుము మునిగేలా వంటకు వినియోగించే వర్జిన్‌ కొబ్బరినూనె నింపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటల పాటు గది వాతావరణంలో ఉంచి వడకట్టి సమాన పాళ్లలో కలబందగుజ్జును కలిపి బాగా గిలకొట్టి పొడిసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే చాలు. ఈ క్యారెట్‌ క్రీంను రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి, మెడకు రాసి ఇంకనిస్తే చాలు. ఉదయానికల్లా ముఖం తాజాగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలను ముందుగానే రాకుండా నిరోధిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్