..కళ్లద్దాల అవసరం రాలేదిక!

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... తరచూ అనారోగ్యానికి గురయ్యే కుటుంబసభ్యుల్ని చూసి పరిష్కారం కోసం వెతికారు మాదాసు సునంద.

Updated : 16 Feb 2023 03:06 IST

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... తరచూ అనారోగ్యానికి గురయ్యే కుటుంబసభ్యుల్ని చూసి పరిష్కారం కోసం వెతికారు మాదాసు సునంద. సేంద్రియ పంటల సాగుతో అనారోగ్య సమస్యలకి చెక్‌ పెట్టిన ఆమె తోటివారి కోసం వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ అవగాహన పెంచుతున్నారు. ఇందుకోసం చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకున్నారు..

‘35 ఏళ్లకే మావారిని రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ చుట్టుముట్టాయి. మా బాబుకి కంటి చూపు తగ్గింది. అద్దాలుంటేనే కనిపించేది. అప్పుడే ‘మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామా?’ అనిపించింది. ఆ ఆలోచనే సేంద్రియ పంటలు పండించే స్ఫూర్తినిచ్చింది’ అంటారు సునంద. ఎంఎస్సీ (కెమిస్ట్రీ) చదివిన సునంద స్వస్థలం కడపలోని రామపురం. 2012లో కుమురం భీం జిల్లాకు చెందిన రవికుమార్‌తో వివాహం అయ్యింది. ‘ఆయన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి. నేను తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా చేసేదాన్ని. కొవిడ్‌ తర్వాత మావారు తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. అత్తమ్మకు కీళ్లనొప్పులు. ఈ నేపథ్యంలోనే.. సేంద్రియ వ్యవసాయం చేసి మనం తినేవి మనమే పండించుకోవాలనుకున్నా. ఈ సమయంలోనే మా అత్తమామలు పత్తి, కంది పండించి ఏటా నష్టపోతున్నాం. కావాలంటే మా చేనును కూడా తీసుకుని సాగు చేసుకోండని అనడంతో రెండేళ్ల క్రితం అత్తింటికి వచ్చేశా. ఎనిమిది ఎకరాల్లో సాగు మొదలుపెట్టా. నీటి వసతి తక్కువ. అందుకే సాంప్రదాయిక పంటలకు బదులుగా దేశీరకం చిక్కుడు, టొమాటో, గోబీ, క్యారెట్, అలసంద, పుచ్చకాయ, ఎర్ర, నల్ల రకాలుండే వరి, మినుములు, ఆముదం, నువ్వులు, కుసుమ ఇలా ఒక్కో పంటను అర ఎకరం, ఎకరం చొప్పున వేశా. కృష్ణవ్రీహి నల్లబియ్యం, నాటురకం దేశీ చిక్కుడు, మాసిల్లే సాంబా రకం వరి, కుజుపటాలీయం, ఇంద్రాణి, జీరాపూర్‌ ఇలా ఏడు రకాల వరిని పండించా. వీటిని తిన్న తర్వాత మా అబ్బాయి సాత్విక్‌ (12)కి కంటి అద్దాల అవసరం పోయింది. అత్తమ్మకు కీళ్లనొప్పులు తగ్గాయి. మా ఆయన ఆసుపత్రికి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది’ అంటూ సేంద్రియ పంటలు చేసిన అద్భుతాల గురించి వివరించారు సునంద.

ఆముదంతో ఎరువులు..

రసాయనిక ఎరువులు లేని పంటని పండించాలన్నది సునంద లక్ష్యం. ఇందుకోసం సీనియర్‌ రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్రెడ్డి (సీవీఆర్‌) సూచనలతో మట్టి, ఆముదం, కొబ్బరి పీచులతో సేంద్రియ ఎరువును తయారు చేస్తూ వాటినే వాడుతున్నారు. ‘ఈ సేంద్రియ పంటల విశేషాలను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం చేయడంతో హైదరాబాద్‌, తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, కరీంనగర్‌ నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి. దాంతో ఇతరుల కోసం కూడా పండించడం మొదలుపెట్టా. కేజీ నుంచి పది, ఇరవై, ముప్పై కేజీల వరకు ప్యాక్‌ చేసి అడిగిన వారికి పంపిస్తున్నాం. కొందరైతే గోదావరిఖని, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ నుంచి స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నెలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అన్నదాతలకు సేంద్రియ సాగు విధానం గురించి అవగాహన కల్పిస్తున్నా’ అంటున్నారు సునంద.

- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్