WPL: సై అంటే సై.. పోరాటానికి సిద్ధం చేస్తారు..!

మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL) ఆరంభ టోర్నీకి రంగం సిద్ధమైంది. మార్చి 4న ప్రారంభం కానున్న మొదటి సీజన్‌కు సంబంధించిన వేలం ఇటీవలే పూర్తైంది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమ జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపేందుకు మెంటర్లను నియమించాయి. సాధారణంగా ఇందుకు క్రికెట్‌కు సంబంధించిన....

Published : 25 Feb 2023 14:33 IST

(Photos: Twitter)

మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL) ఆరంభ టోర్నీకి రంగం సిద్ధమైంది. మార్చి 4న ప్రారంభం కానున్న మొదటి సీజన్‌కు సంబంధించిన వేలం ఇటీవలే పూర్తైంది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమ జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపేందుకు మెంటర్లను నియమించాయి. సాధారణంగా ఇందుకు క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులనే ఎంపిక చేస్తుంటారు. కానీ, బెంగళూరు ఫ్రాంఛైజీ ఇందుకు భిన్నంగా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది. మరో మూడు ఫ్రాంఛైజీలు కూడా తమ జట్లకు మహిళలనే మెంటర్లుగా ఎంపిక చేశాయి. వీరిలో మహిళా క్రికెట్‌కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామిలతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్‌ లీసా స్థలేకర్ కూడా ఉన్నారు.

సానియా మీర్జా - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

డబ్ల్యూపీఎల్‌ ఆరంభ టోర్నీలో భాగమైన బెంగళూరు ఫ్రాంఛైజీ ‘ప్లే బోల్డ్‌’ అనే కాన్సెప్ట్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సంప్రదాయానికి భిన్నంగా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను మెంటర్‌గా నియమించింది. ఇప్పటికే ఆ జట్టులో స్మృతి మంధాన, ఎలిస్ పెర్రీ వంటి గ్లామరస్‌ ప్లేయర్లు ఉన్నారు. వారికి సానియా తోడవడంతో ఆ జట్టు పూర్తి గ్లామరస్‌గా మారిపోయింది. ఇటీవలే టెన్నిస్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సానియా తన చివరి గ్రాండ్‌స్లామ్‌ను గత జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఆడింది. ఆమె తన 20 ఏళ్ల కెరీర్‌లో ఆరు గ్లాండ్‌స్లామ్‌లతో పాటు 43 డబ్ల్యూటీఏ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తనకున్న సుదీర్ఘమైన అనుభవాన్ని బెంగళూరు ఫ్రాంఛైజీ ఉపయోగించుకోవాలనుకుంది. అందుకే తమ జట్టుకు మెంటర్‌గా ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ ‘ఆర్‌సీబీ మహిళా జట్టుతో కలవడం సంతోషంగా ఉంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో ఉమెన్స్‌ క్రికెట్‌ ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం. ఇలాంటి మెగా లీగ్‌ల వల్ల చాలామంది క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి మార్గం సుగమమవుతుంది. మెంటర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంతో ఉన్నా. చాలా ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ క్రేజ్‌ ఉన్న జట్టు’ అని సానియా వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా బెంగళూరు ఫ్రాంఛైజీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ‘మహిళల జట్టుకు సానియా మీర్జా మెంటర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఆమె తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయాలను సాధించింది. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇందుకు తనే సరైన వ్యక్తి అని భావించాం. యువతరానికి మార్గదర్శకంగా ఉంటూ ఆమె మరింతమందిలో స్ఫూర్తి నింపగలదు. కఠిన పరిస్థితుల్లో ఎలా రాణించాలన్న విషయంలో యువ క్రికెటర్లకు మార్గనిర్దేశనం చేయగలదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సానియా మీర్జా తప్పకుండా జట్టును ఉత్తమ పద్ధతిలో నడిపిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.


మిథాలీ రాజ్‌ - గుజరాత్‌ జెయింట్స్

మహిళా క్రికెట్‌ అంటే మొదట గుర్తుకు వచ్చే పేరు మిథాలీ రాజ్‌. దాదాపు 23 ఏళ్ల పాటు ఆమె భారత మహిళల క్రికెట్‌కు సేవలందించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకుంది. క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తొలిసారి ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న గుజరాత్‌ జెయింట్స్‌ మిథాలీని మెంటర్‌గా ఎంపిక చేసింది. ఈ ఫ్రాంఛైజీకి అధిక ధర వెచ్చించి తీసుకున్న ఆష్లీ గార్డ్‌నర్‌, బేత్‌ మూనీ ఇద్దరూ విదేశీయులు కావడం విశేషం. రిటైర్‌మెంట్‌ తర్వాత తను కొత్త పాత్రను పోషించబోతున్న సందర్భంగా ‘మహిళల క్రికెట్‌లో ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు’ అని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది మిథాలీ రాజ్.

మెంటర్‌గా ఎంపికైన తర్వాత మిథాలీ మాట్లాడుతూ ‘నేను జూన్‌లో రిటైర్‌ అయినప్పుడు డబ్ల్యూపీఎల్‌ వేలానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ, కొన్ని రోజుల తర్వాత ప్లేయర్‌గా ఉండడం కన్నా మెంటర్‌గా ఉండడం మంచిదనిపించింది. గత 17 సంవత్సరాలుగా భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఈ బాధ్యత కూడా దానిలాగే ఉంటుంది. అయితే ఇది మైదానం అవతల జరిగే ప్రక్రియ. ఇది ఆరంభ లీగ్‌ కావడంతో మొదట జట్టులో బలమైన పునాదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రాంఛైజీతో పాటు మహిళా క్రికెట్‌కు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో దేశవాలి క్రీడాకారిణులు కూడా ఉన్నారు. వారిని అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి పనిచేసేలా చేయడం నా మొదటి కర్తవ్యం’ అంటూ చెప్పుకొచ్చింది.


జులన్‌ గోస్వామి - ముంబయి ఇండియన్స్

భారత మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ తర్వాత ఎక్కువ పాపులారిటీ పొందిన క్రికెటర్‌ జులన్‌ గోస్వామి. ఆమె టీం ఇండియాకు దాదాపు 20 ఏళ్లు ప్రాతినిధ్యం వహించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా జులన్‌ 350కి పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో వన్డేలు, ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించింది. గత సంవత్సరం రిటైర్‌మెంట్‌ ప్రకటించిన జులన్‌ బెంగాల్‌ జట్టుకు  మెంటర్‌గా కొనసాగుతోంది. తాజాగా డబ్ల్యూపీఎల్‌ లీగ్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌ జట్టుకు మెంటర్, బౌలింగ్‌ కోచ్‌గా రెండు పాత్రలు పోషించనుంది.

ఈ సందర్భంగా జులన్‌ మాట్లాడుతూ ‘ముంబయి ఇండియన్స్‌ జట్టులో మెంటర్, బౌలింగ్‌ కోచ్‌గా చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. చార్లెట్టో (హెడ్‌ కోచ్‌), దేవిక (బ్యాటింగ్‌ కోచ్)తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. ముంబయి జట్టు విజయాలు సాధించడంలో ముందుంటుంది. మేము ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చింది. ఈ జట్టులో నటాలీ స్కివర్‌తో పాటు భారత స్టార్‌ ఆటగాళ్లు పూజా వస్త్రాకర్, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, యాస్తికా భాటియాలు ఉన్నారు.


లీసా స్థలేకర్‌ - యూపీ వారియర్స్

పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్‌ అయినా లీసా స్థలేకర్‌ మాత్రం పుట్టింది భారతదేశంలోనే. ఆస్ట్రేలియా దంపతులు లీసాను దత్తత తీసుకోవడంతో అక్కడే పెరిగింది. తను ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్‌గా సేవలందించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లీసా.. ఆస్ట్రేలియా సాధించిన నాలుగు ప్రపంచకప్పుల్లో సభ్యురాలిగా ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 3913 పరుగులు చేయడమే కాకుండా 229 వికెట్లను పడగొట్టింది. ఇటీవలే యూపీ వారియర్స్ యాజమాన్యం లీసాను ఆ జట్టుకు మెంటర్‌గా ఎంపిక చేసింది. అంతకుముందు ఆమె రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులోని యువ క్రికెటర్లకు అడ్వైజర్‌గా పని చేసింది.

ఈ సందర్భంగా లీసా మాట్లాడుతూ ‘యూపీ వారియర్స్‌ జట్టులో మెంటర్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్ ఫ్రాంఛైజీ ద్వారా నాకు ఈ అవకాశం లభించింది. భారత్‌లో చాలామంది ప్రతిభ ఉన్న క్రీడాకారిణులు ఉన్నారు. వారితో పాటు కోచింగ్‌ సిబ్బందితో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నానని’ చెప్పుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్