శ్రీమంతుల జాబితాలో.. ఆ ఆరుగురు!

వ్యాపారంలో రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు.. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, సరికొత్త వ్యూహాలతో వినియోగదారుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు వ్యాపారంలో రాణిస్తూ....

Updated : 30 Nov 2022 13:20 IST

వ్యాపారంలో రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు.. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, సరికొత్త వ్యూహాలతో వినియోగదారుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు వ్యాపారంలో రాణిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితానే ఇందుకు నిదర్శనం. ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘100 మంది శ్రీమంతుల’ జాబితాలో ఆరుగులు మహిళలు స్థానం సంపాదించుకున్నారు.

సావిత్రీ జిందాల్, జిందాల్ గ్రూప్‌ ఛైర్‌పర్సన్

(Photo: Facebook)

మనదేశంలో అత్యంత సంపన్నమైన మహిళగా సావిత్రీ జిందాల్‌కు పేరుంది. ప్రస్తుతం జిందాల్ గ్రూప్‌ గౌరవ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోన్న ఆమె.. తన భర్త ఓం ప్రకాశ్ జిందాల్ 2005లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె సారథ్యంలో కేవలం నాలుగేళ్ల లోపే సంస్థ ఆదాయం వృద్ధి చెందిందంటే.. ఇందుకు ఆమె తీసుకున్న చర్యలు, తన వ్యాపారదక్షత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరినీ తన కుటుంబ సభ్యుల్లానే చూడాలనేది ఓం ప్రకాశ్ జిందాల్ పెట్టుకున్న ఆశయం. ఆయన మరణం తర్వాత కంపెనీ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న సావిత్రి.. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన మాటల్ని నిజం చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ అందరికీ తాను అమ్మయ్యారు.

ఇలా ఓవైపు కంపెనీ కార్యకలాపాల్లో భాగం పంచుకుంటూనే.. మరోవైపు హరియాణా రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. ప్రస్తుతం హరియాణా లోని ‘మహారాజా అగ్రసేన్ మెడికల్‌ కాలేజీ’ అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. తొమ్మిదిమంది సంతానం కలిగిన సావిత్రి ‘ఇండియాస్ రిచెస్ట్ మదర్’గా కూడా పేరు గాంచారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్మే ఆమె.. దేశంలోనే సంపన్నులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘వందమంది భారతీయ శ్రీమంతుల’ జాబితాలో  రూ. 1.32 లక్షల కోట్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు. అంతేకాదు.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆరుగురు మహిళల్లో మొదటిస్థానం సావిత్రిదే కావడం విశేషం.


రేఖా ఝున్‌ఝున్‌వాలా

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా గత ఆగస్టులో మరణించడంతో.. ఆ స్థానాన్ని ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్‌ జాబితాలో ఆమె నికర ఆస్తుల విలువ 47 వేల కోట్లుగా ఉంది. దాంతో భారత సంపన్నుల జాబితాలో ఆమె 30వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెకు టైటాన్‌, స్టార్‌ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌లో షేర్స్‌ ఉన్నాయి.


ఫల్గుణీ నాయర్‌, నైకా వ్యవస్థాపకురాలు

(Photo: https://www.nykaa.com/who_are_we)

బ్యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఫల్గుణీ నాయర్‌ 50 ఏళ్ల వయసులో తన అసలు లక్ష్యాన్ని తెలుసుకున్నారు. నైకా పేరుతో ఆన్‌లైన్‌లో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించి.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపారాన్ని వృద్ధి చేసి అత్యుత్తమ బ్రాండ్‌గా తన కంపెనీని తీర్చిదిద్దారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి తక్కువ సమయంలోనే యూనికార్న్‌ హోదాను దక్కించుకున్నారు. తన విజయ పరంపరను కొనసాగిస్తూ తొలిసారిగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆమె 32 వేల కోట్ల సంపదతో 44వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.


లీనా తివారీ, యూఎస్‌వీ ప్రై. లి. ఛైర్‌పర్సన్

(Photo: leenagandhitewari.blogspot.com)

మనదేశంలో జనరిక్ మందులు తయారుచేసే ప్రైవేటు రంగ సంస్థ యూఎస్‌వీ ఫార్మా. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన ఔషధాలను తయారుచేయడంలో పేరుగాంచిందీ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు లీనా తివారీ. ఆమె తాతయ్య విఠల్ బాలకృష్ణ గాంధీ యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 1961లో స్థాపించారు. తన తాతయ్య, తండ్రి తర్వాత ఈ కంపెనీ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న లీనా.. తన వ్యాపార దక్షతతో సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితాలో ఈ సంస్థ 30 వేల కోట్ల రూపాయల సంపదతో 51వ స్థానంలో నిలిచింది. లీనా కూతురు అనీషా గాంధీ ఆగస్టులో యూఎస్‌వీ బోర్డులో చేరారు. కాగా, ఆమె భర్త ప్రశాంత్ యూఎస్‌వీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


కిరణ్ మజుందార్ షా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్

(Photo: Twitter)

‘బయోకాన్ లిమిటెడ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పిన ఘనత ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షాకే దక్కుతుంది. 1978లో ఈ సంస్థను స్థాపించిన కిరణ్.. దీని ద్వారా మధుమేహం, క్యాన్సర్, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులను నయం చేసే మందుల్ని ఉత్పత్తి చేసే దిశగా కృషి చేశారు. చక్కటి వ్యాపార దక్షతతో మలేషియాలోనూ ఓ ఫ్యాక్టరీని నెలకొల్పి దాని ద్వారా ఆసియాలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా బయోకాన్‌ను అభివృద్ధి చేశారామె. అంతేకాదు.. కొత్త తరహా ఔషధాలు రూపొందించే విషయంలో చొరవ తీసుకొని ముందుకు దూసుకుపోతున్నారు కిరణ్. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితాలో 21 వేల కోట్ల రూపాయలతో 76వ స్థానాన్ని సంపాదించుకున్నారు.


అను అగా, Thermax Ltd

(Photo: Twitter)

దేశంలో బిలియనీర్‌ బిజినెస్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నారు అను అగా. 1996 నుంచి 2004 వరకు Thermax Ltd. అనే ఇంజినీరింగ్‌ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఆమె.. తన వ్యాపార వ్యూహాలతో కంపెనీని అభివృద్ధి చేశారు. 2004లో పదవీ విరమణ చేశారు. ఇంజినీరింగ్‌ ఫర్మ్‌లో లిస్ట్‌ చేసిన స్టేక్స్‌లో అధిక భాగం అను పేరుతోనే ఉన్నాయి. దాంతో తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితాలో 18 వేల కోట్ల రూపాయల సంపదతో ఆమె 88వ స్థానంలో కొనసాగుతున్నారు. 2014 తర్వాత ఈ జాబితాలో చోటు సంపాదించడం ఆమెకు ఇదే తొలిసారి. కాగా, ఈ సంస్థకు ఆమె కుమార్తె మెహెర్‌ పుదుమ్‌జీ  ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్