జై జై నాయిక!

వివక్ష, యుద్ధం, హింస, పరిస్థితులు.. వాళ్లలోని నాయకత్వ లక్షణాలని వెలికితీశాయి. మట్టిలోని మాణిక్యాల్లా మరుగున పడ్డ వాళ్లని సానబెట్టి వజ్రాల్లా తయారుచేశాయి. ప్రపంచం మెచ్చిన మహిళా నాయకురాళ్లలో వీళ్లూ కొందరు...

Updated : 31 Dec 2022 03:25 IST

వివక్ష, యుద్ధం, హింస, పరిస్థితులు.. వాళ్లలోని నాయకత్వ లక్షణాలని వెలికితీశాయి. మట్టిలోని మాణిక్యాల్లా మరుగున పడ్డ వాళ్లని సానబెట్టి వజ్రాల్లా తయారుచేశాయి. ప్రపంచం మెచ్చిన మహిళా నాయకురాళ్లలో వీళ్లూ కొందరు...

అందమైన బొలివియాకి ఆకర్షణ మల్ల యుద్ధాలే. అక్కడి ‘చోలిటా రెజ్లింగ్‌’... గృహహింస నుంచి స్వీయ రక్షణ కోసం మొదలైంది. దీనిలో... ఎంతటి మగాడినైనా మహిళా యోధులు ఎత్తి పారేయగలరు. ఆ ప్రాంత మేయర్‌గా పగ్గాలు చేపట్టి ఆ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది 34 ఏళ్ల మోనికా ఇవాకోపా ముర్గా. లింగ వివక్షపై పోరాడి విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది. ఆ తెగువే.. ఆమెకి సెనెటర్‌గా, మేయర్‌గా గెలిచే ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. అంతర్గత విభేదాల కారణంగా తలెత్తిన హింసని తట్టుకోలేక ఉన్న మేయర్‌ నగరం విడిచి పారిపోతే మోనీ మాత్రం ‘ఆడవాళ్లు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలి. మోకాళ్ల మీద కాదు. నాకు పారిపోవడం చేతకాదు. గెలుపైనా ఓటమైనా ఇక్కడే’ అంటూ మరింతమంది స్త్రీలు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఏడాది టైమ్‌ గుర్తించిన 100మంది మహిళల్లో మోని ఒకరు.


డేళ్ల వయసులో ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ నుంచి శరణార్థిగా స్కాట్లాండ్‌ చేరుకుంది రోజా సలీహ్‌. అక్కడా వాళ్ల పరిస్థితి బాగాలేదు. శరణార్థులకు ఇచ్చే ఫుడ్‌ వోచర్స్‌ తీసుకుని ఆకలితో దుకాణానికి వెళ్తే, అక్కడివాళ్లు తన తల్లి తానియాని చూసిన తీరుని రోజా ఎప్పటికి మర్చి పోదు. తండ్రికి ఉపాధిలేదు. తన మాతృభాషని మాట్లాడ కూడదు. చేతిలో ఎప్పుడూ రేప్‌ అలారమ్‌ పెట్టుకోవాల్సిందే. ‘శరణార్థులయితే ఇంత దయనీయంగా బతకాలా?’ అంటూ స్నేహితురాళ్లతో కలిసి.. 15 ఏళ్లకే ‘గ్లాస్‌గో గర్ల్స్‌’ పేరుతో శరణార్థి హక్కుల కోసం పోరాడుతోంది. దాని ఫలితంగానే.. మైనారిటీలు అధికంగా ఉండే పొలాక్‌ ప్రాంతం నుంచి కౌన్సెలర్‌గా ఎదిగింది. ఇలా ఒక శరణార్థి ఆ దేశంలో కౌన్సెలర్‌గా విజయం సాధించడం ఇదే మొదటిసారి.


సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే బడి అది. కనీసం బోర్డు తుడవడానికి డస్టర్లకూ కొరతే. అది గమనించిన ఓ చిన్నారి.. వృథా దుస్తులతో డస్టర్లు చేసి పట్టుకొచ్చింది. మరికొన్నాళ్ల వరకూ ఆ స్కూల్‌కి డస్టర్ల అవసరం రాలేదు. ‘ఆరోపణలు ఎవరైనా చేస్తారు. పరిష్కారం వెతికే వాళ్లే గొప్ప. అది నాకు ఆ చిన్నారిలో కనిపించింది’ అంటారు ప్రస్తుతం రాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టిన ద్రౌపదిముర్మును తలుచుకున్న ఆమె మాస్టారు వసంత్‌కుమార్‌ గిరి. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో జన్మించిన ముర్ము తర్వాత అధ్యాపక వృత్తిలోనూ కొనసాగారు. ‘ఆమె కొట్టి.. తిట్టి చెప్పిన సందర్భరం ఒక్కటీ లేద’ంటారు ఆమె శిష్యులు. రాజకీయాల్లోనూ ఆమె మౌనంగానే ఎదిగారు. ఇద్దరు బిడ్డల్నీ, భర్తనీ కోల్పోయినా.. ధైర్యంగా జీవితాన్ని ఎదురీది దేశ అత్యున్నత స్థానానికి చేరారు. రాష్ట్రపతి అయిన గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు.


యానాజికోవిచ్‌ మెడికల్‌ విద్యార్థిని. తన మాతృభూమి ఉక్రెయిన్‌ కోసం పోరాడుతున్న సైనికులకు వైద్యసాయం చేయడం కోసం 19 ఏళ్లకే యుద్ధభూమిలో అడుగుపెట్టింది. ‘హస్పిటలర్స్‌ బెటాలియన్‌’ పేరుతో మెడికల్‌ వాలంటీర్లని అందించే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వందలమంది సైనికులని కాపాడింది. ఈ క్రమంలోనే యాక్సిడెంట్‌కి గురై ఆరునెల్లు మంచానికే పరిమితం అయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. వైద్యులు ప్రమాదం అని వారించినా ధైర్యంగా బిడ్డకు జన్మనిచ్చింది. ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ సహా ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఇచ్చే నాలుగు పురస్కారాలు అందుకుని.. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌లో ఎంపీగా అడుగుపెట్టింది. రణరంగంలో ఏ సైనికుడూ గాయాల కారణంగా మరణించకూడదని ఈ ఏడాది తన సేవని మరింత విస్తృతం చేసి ఉత్తమ నాయకురాలిగా అందరి ప్రశంసలు అందుకుంది.


మెరికాలో విచ్చలవిడి ఆయుధ వినియోగంపై నియంత్రణ, పర్యావరణ పాలసీలకోసం పోరాడిన కాట్రగడ్డ అరుణామిల్లర్‌.. ఇంజినీర్‌గా కెరియర్‌ని మొదలుపెట్టారు. సామాజిక సేవపై ఆసక్తికొద్దీ రాజకీయాల బాట పట్టారు. పాఠశాలలు, ఉపాధి, కమ్యూనిటీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు. పాదచారులు, సైకిల్‌ నడిపేవారు, వికలాంగులకు అనువుగా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందిన అరుణ మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి భారతకీర్తిని విస్తరింపచేశారు.


చెన్నైకి చెందిన ప్రమీలా జయపాల్‌, డాక్టర్‌ వందనాస్లాటర్‌, నబీలాసయ్యద్‌, మేఘన్‌శ్రీనివాస్‌ వంటివారు తమ నాయకత్వ లక్షణాలతో ఈసారి అమెరికా రాజకీయాల్లో మెరిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్