ఈసారి దిల్లీలో అదరగొట్టేది వీళ్లే..!

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా దిల్లీలోని కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాలు చేసే కవాతు, విన్యాసాలు అబ్బురపరుస్తుంటాయి. అయితే ఈ దళాలకు నేతృత్వం వహించే అవకాశం గత కొన్నేళ్లుగా మహిళలకూ దక్కుతూ వస్తోంది.

Updated : 24 Jan 2024 21:07 IST

(Photos: Instagram)

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా దిల్లీలోని కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాలు చేసే కవాతు, విన్యాసాలు అబ్బురపరుస్తుంటాయి. అయితే ఈ దళాలకు నేతృత్వం వహించే అవకాశం గత కొన్నేళ్లుగా మహిళలకూ దక్కుతూ వస్తోంది. ఇక ఈసారి ఈ సంఖ్యను మరింత పెంచేందుకు సన్నద్ధమయ్యాయి త్రివిధ దళాలు. మహిళా సాధికారత, లింగ సమానత్వానికి పెద్ద పీట వేస్తూ ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తుండడమే ఇందుకు కారణం. ‘వికసిత్‌ భారత్‌ - మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ థీమ్‌తో జరగనున్న ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో పలువురు మహిళలు త్రివిధ దళాల బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరికొందరు మహిళలు తమ కళల్నీ కర్తవ్య పథ్‌లో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

నాన్న బాటలోనే నడిచి..!

భారత వాయుసేనలో యుద్ధ విమాన పైలట్లుగా కెరీర్‌ని ఎంచుకోవడానికి ఎంతోమంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు. చిన్ననాటి ఈ కలను 2021లో సాకారం చేసుకుంది ఫైటర్‌ పైలట్‌ లెఫ్టినెంట్‌ అనన్యా శర్మ. భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌ పైలట్‌ సంజయ్‌ శర్మ కూతురే తను. చిన్న వయసు నుంచి భారత వాయుసేనలో భాగంగా తండ్రి సాహసాల్ని చూస్తూ పెరిగిన ఆమె.. భవిష్యత్తులో ఇదే రంగంలో స్థిరపడాలనుకుంది. ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌’ విభాగంలో బీటెక్‌ పూర్తిచేశాక మిలిటరీ కెరీర్‌పై దృష్టి పెట్టిందామె. 2021 డిసెంబర్‌లో భారత వాయుసేన ఎంపిక చేసిన యుద్ధ విమాన పైలట్ల బృందంలో ఉన్న ఆమె.. కొన్ని నెలల పాటు కఠోర శిక్షణ తీసుకుంది. శిక్షణ తర్వాత నుంచి సుఖోయ్‌-30MKI యుద్ధ విమాన పైలట్‌గా కొనసాగుతోంది అనన్య. 2022లో తన తండ్రితో కలిసి బీదర్‌ ఎయిర్‌బేస్‌లో ‘Hawk-132’ అడ్వాన్స్‌డ్‌ జెట్‌ ట్రైనర్‌ అనే యుద్ధ విమానాన్ని నడిపిందామె. తద్వారా భారతదేశ వాయుసేన చరిత్రలోనే జెట్‌ యుద్ధవిమానాల్ని నడిపిన తండ్రీకూతుళ్లుగా వీళ్ల పేరు చరిత్రకెక్కింది. ఇక ఈసారి గణతంత్ర దినోత్సవంలో పాల్గొనబోతుండడంతో మరోసారి ఈ మహిళా ఫైటర్‌ పైలట్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ వేడుకల్లో భారత వాయుసేనకు నేతృత్వం వహించనుందీ డేరింగ్‌ ఆఫీసర్.


కిరణ్‌ బేడీ తర్వాత ఈమే!

పూర్తిస్థాయి మహిళలతో కూడిన దిల్లీ పోలీసు దళం తొలిసారి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్‌లో కవాతు చేయనుంది. ఈ దళానికి నేతృత్వం వహిస్తున్నారు ఐపీఎస్‌ ఆఫీసర్‌ శ్వేతా కె సుగథన్‌. కేరళలోని త్రిస్సూరుకు చెందిన ఆమె.. ప్రస్తుతం ఉత్తర దిల్లీ (నార్త్‌ డిస్ట్రిక్ట్‌)లోని పోలీస్‌-2 విభాగానికి అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో మొత్తంగా దిల్లీ పోలీసు విభాగానికి చెందిన 194 మంది మహిళా పోలీస్‌ ఆఫీసర్లు పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా కర్తవ్య పథ్‌లో కవాతు సాధన చేస్తున్నారు. అయితే గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ శ్వేత దిల్లీ పోలీసు దళానికి నాయకత్వం వహించారు. అప్పుడు ఆ దళంలో పురుషులు కూడా ఉన్నారు. కానీ ఈసారి పూర్తి స్థాయి మహిళా పోలీసాఫీసర్లతో కూడిన బృందానికి నాయకత్వం వహించి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా చరిత్రకెక్కారు శ్వేత. 48 ఏళ్ల క్రితం అప్పటి ఐపీఎస్‌ అధికారిణి దిల్లీ పోలీసు దళానికి నేతృత్వం వహించి వార్తల్లో నిలిచారు. ఆమె తర్వాత ఈ ఘనత శ్వేతకే దక్కింది. 2019లో కేంద్ర పాలిత ప్రాంతాల (AGMUT) కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణిగా ఎంపికైన శ్వేత.. గతంలో దిల్లీలోని చాణక్యపురి అసిస్టెంట్‌ కమిషనర్‌గా సేవలందించారు.


త్రివిధ దళాల నాయకురాలు!

సాధారణంగా కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాలు వేర్వేరుగా కవాతు చేయడం మనం చూశాం. కానీ ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో భాగంగా ఈ మూడు దళాలు కలిసి కవాతు చేయనున్నాయి. అది కూడా పూర్తి స్థాయి మహిళలతో కూడిన 144 మంది బృందం ఒకేసారి మార్చ్‌ ఫాస్ట్‌కు సిద్ధమైంది. ఒక్కో దళంలో 48 మంది మహిళలున్నారు. ఈ త్రివిధ దళానికి 26 ఏళ్ల కెప్టెన్‌ సంధ్య నాయకత్వం వహిస్తోంది. అగ్నిపథ్‌ పథకం కింద ఎంపికైన వారితో పాటు సాధారణ పద్ధతిలో ఎంపికైన మహిళా సైనికులతో కూడిన ఈ బృందాన్ని ముందుండి నడిపించనుందామె. ఈ క్రమంలో వీరంతా ఇప్పటికే గత రెండు నెలలుగా ఆయా బేస్‌క్యాంపుల్లో కవాతు సాధన చేశారు. ఇప్పుడు కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాలు కలిసి సాధన చేస్తున్నాయి. అయితే ఈ మూడు దళాలకు సంబంధించిన కవాతు పద్ధతులు విభిన్నంగా ఉండడంతో.. సాధన ప్రారంభించిన కొత్తలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయంటోంది సంధ్య.
‘త్రివిధ దళాలకు సంబంధించిన సెల్యూట్స్‌, కత్తి పట్టుకునే విధానం, కవాతు.. వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని కచ్చితంగా అనుసరిస్తూ ముందుకు సాగడానికి కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వస్తోంది. ఇక తాజాగా త్రివిధ దళాలతో పూర్తిస్థాయి యూనిఫాంతో కూడిన కవాతు కూడా పూర్తిచేశాం..’ అంటోందీ మహిళా ఆఫీసర్. 2017 రిపబ్లిక్‌ డే పరేడ్‌లో దిల్లీ డైరెక్టరేట్‌ నుంచి ఎన్‌సీసీ క్యాడెట్‌గా పాల్గొంది సంధ్య.


ఈ పరేడ్‌ నాకు స్పెషల్!

సముద్ర తీర ప్రాంతాల గస్తీ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన దిశగా నిత్యం పహారా కాస్తోన్న భారతీయ కోస్ట్‌ గార్డ్‌ మహిళా బృందం కూడా ఈ ఏడాది రిపబ్లిక్‌ పరేడ్‌లో భాగం కానుంది. ఈ దళానికి అసిస్టెంట్‌ కమాండెంట్ చునౌతీ శర్మ నేతృత్వం వహించనున్నారు. గతంలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా కర్తవ్య పథ్‌లో కవాతు చేశారామె.

‘గతంలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా కవాతు చేసినప్పుడు బృందంలో సభ్యురాలిగా మాత్రమే ఉన్నాను. కానీ ఈసారి బృందానికి నాయకత్వం వహించడం గర్వంగా ఉంది. ఇక ఈ పరేడ్‌ నాకు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి నా భర్త మేజర్‌ సరబ్‌జీత్‌ సింగ్‌ కూడా ఇండియన్‌ ఆర్మీ సిక్కుల దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇలా దేశానికి సేవ చేసే అవకాశం మా ఇద్దరికీ దక్కడం మా అదృష్టం..’ అంటారు చునౌతీ.


పరేడ్‌లో ఆర్మీ కపుల్!

ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో భాగంగా కర్తవ్య పథ్‌లో వివిధ దళాలు కవాతు చేయనున్నాయి. వీరిలో ఓ ఆర్మీ జంట కూడా భాగం కానుంది. మద్రాస్‌ రెజిమెంట్‌ నుంచి మేజర్‌ జెర్రీ బ్లెయిజ్‌, మిలిటరీ పోలీస్‌ కంటింజెంట్‌ కార్ప్స్‌ నుంచి కెప్టెన్‌ సుప్రీతా సీటీ ఈ కవాతులో పాల్గొన్ననున్నారు. అయితే ఇలా వేర్వేరు కవాతు బృందాల్లో సభ్యులుగా భార్యాభర్తలు పాల్గొనడం రిపబ్లిక్‌ పరేడ్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది జూన్‌లో వివాహం చేసుకున్న వీరిద్దరూ గతంలో ఎన్‌సీసీ క్యాడెట్లుగా కర్తవ్య పథ్ కవాతులో పాల్గొన్నారు. ‘ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తోన్న మేము రిపబ్లిక్‌ పరేడ్‌లో భాగంగా కలిసి సాధన చేస్తున్నాం.. మేమిద్దరం జీవితంలోనే కాదు.. దేశ సేవలోనూ భాగస్వాములవడం సంతోషంగా ఉంది..’ అంటున్నారీ ఆర్మీ కపుల్.

వీళ్లతో పాటు 1300 మంది మహిళా బృందంతో కూడిన ‘సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌’ దళాలు కర్తవ్య పథ్‌లో కవాతుకు సిద్ధమయ్యాయి. మరోవైపు వంద మంది మహిళా సంగీత కళాకారులు ఆయా సంగీత వాయిద్య పరికరాల్ని వాయిస్తూ పరేడ్‌ను ఆరంభించనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్