‘మార్పు’ కోరుకుంది.. అవార్డు అందుకుంది!

‘అర్ధరాత్రి మహిళలు స్వతంత్రంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం’ అన్నారు గాంధీజీ. ఇలాంటి స్వాత్రంత్యం కోసమే అహర్నిశలూ కృషి చేస్తున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త సృష్టి భక్షి. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు లేని సమాజాన్ని కోరుకుంటున్నారామె. ఈ దిశగా మార్పు తీసుకురావాలని కాంక్షిస్తూ....

Published : 05 Oct 2022 11:25 IST

(Photos: Instagram)

‘అర్ధరాత్రి మహిళలు స్వతంత్రంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం’ అన్నారు గాంధీజీ. ఇలాంటి స్వాత్రంత్యం కోసమే అహర్నిశలూ కృషి చేస్తున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త సృష్టి భక్షి. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు లేని సమాజాన్ని కోరుకుంటున్నారామె. ఈ దిశగా మార్పు తీసుకురావాలని కాంక్షిస్తూ ఓ ఉద్యమాన్ని సైతం ప్రారంభించారు సృష్టి. ఈ క్రమంలో వివిధ అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహిస్తూ మహిళల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇలా సమాజహితం కోసం ఆమె చేస్తోన్న కృషి ఫలితంగా తాజాగా ‘ఛేంజ్‌ మేకర్‌’ అవార్డు అందుకున్నారామె. తాను కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడ్డా.. దాన్ని వదులుకొని మరీ సమాజ సేవ వైపు సృష్టి ఎందుకు అడుగులు వేసిందో తెలుసుకుందాం రండి..

సృష్టిది ఉత్తరప్రదేశ్‌. ఎంబీఏ పూర్తిచేసిన ఆమె.. వివాహం తర్వాత తన భర్తతో కలిసి హాంగ్కాంగ్‌లోనే స్థిరపడింది. అక్కడే తాను కోరుకున్నట్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం సంపాదించింది. చిన్న వయసు నుంచే సమాజం అన్నా, సామాజిక సేవ అన్నా సృష్టికి మక్కువ.

ఉద్యోగం వదిలేసి మరీ..!

మన చుట్టూ ఏవైనా చెడు సంఘటనలు జరిగినప్పుడు మన మనసు దాని గురించే పదే పదే ఆలోచిస్తుంటుంది. ఇలాగే ఓ సంఘటన తన మనసును కూడా కదిలించిందంటోంది సృష్టి. ‘మహిళలకు రక్షణ లేని దేశాల్లో మనదీ ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఇక్కడ జరిగే కొన్ని ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 2016లో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తల్లీబిడ్డలపై జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఆ సమయంలో నేను హాంగ్‌కాంగ్‌లో ఉన్నా. ఈ ఘటన నా మనసును తీవ్రంగా కదిలించింది. ఏ పని చేస్తున్నా అది పదే పదే నన్ను ఆలోచనలో పడేసేది. ఎలాగైనా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నించాలనుకున్నా. ఈ క్రమంలోనే నా కలల ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా చేరుకున్నా. నా ఆలోచనల్ని ఇంట్లో వాళ్లతో పంచుకుంటే వాళ్లూ నాకు మద్దతు తెలిపారు. ఈ ప్రయత్నాల్లోంచి పుట్టిందే ‘క్రాస్‌ బౌ మైల్స్‌’ ఉద్యమం..’ అంటూ చెప్పుకొచ్చింది సృష్టి.

మార్పు రావాలంటే..

ఈ వేదికగా మహిళల అభ్యున్నతి కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది సృష్టి. ఈ క్రమంలోనే 2017లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టింది. 12 రాష్ట్రాల మీదుగా 230 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా.. ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లలో చదువుకునే విద్యార్థినులు, గ్రామీణ మహిళల్ని కలిసి మహిళల రక్షణపై అవగాహన కల్పించింది. స్త్రీలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, లైంగిక హింస, గృహ హింసపై చైతన్యం కలిగించేందుకు వందకు పైగా వర్క్‌షాప్స్‌ నిర్వహించింది.

‘మహిళల రక్షణ విషయంలో సమాజంలో మార్పు రావాలంటే.. పురుషుల ఆలోచనా విధానం కూడా మారాలి. అందుకే నా వర్క్‌షాప్స్‌లో మహిళలు, బాలికలతో పాటు బాలురు, పురుషుల్ని కూడా భాగం చేశాను. సమాజంలో మార్పు రావాలంటే ముందు బీజం పడాలి.. నా ఉద్యమం ద్వారా అది సాధ్యమైందనుకుంటున్నా..’ అంటోంది సృష్టి.

ఆ అనుభవాలే డాక్యుమెంటరీగా..!

ఇలా తన ప్రయాణాన్ని ‘WOMB - Women Of My Billion’ పేరుతో ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది సృష్టి. 90 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో పలువురు మహిళల అనుభవాల్ని, తనకెదురైన అనుభూతుల్ని రంగరించింది. ఈ డాక్యుమెంటరీ ‘న్యూయార్క్‌ ఇండియన్‌ చిత్రోత్సవం’, ‘లండన్‌ ఇండియన్‌ చిత్రోత్సవం’తో పాటు బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌లలో నిర్వహించిన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై మంచి స్పందనను అందుకుంది. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా జాతీయ, అంతర్జాతీయ వేదికల పైనా ఆయా అంశాలపై ప్రసంగిస్తుంటుంది. అంతేకాదు.. పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తుంటుందామె.

కృషికి పురస్కారం!

ఇలా సమాజంలో మహిళల పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని కృషి చేస్తోన్న సృష్టికి .. తాజాగా ‘UN SDG (ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) యాక్షన్‌ అవార్డు’ల్లో భాగంగా ‘ఛేంజ్‌మేకర్‌’ పురస్కారం దక్కింది. నిత్యం తమ మాటలు/చేతలతో సమాజంలో మార్పు తీసుకొచ్చే వారికి ఏటా ఈ పురస్కారం అందిస్తారు. ‘సమాజంలో ఎప్పటికైనా మార్పు సహజం. అయితే అందుకు ఓపికతో వ్యవహరించాలి.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి..’ అంటోంది సృష్టి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్