ప్రి-మెచ్యూర్‌ బేబీ.. అయినా 119 ఏళ్లు బతికింది!

వయసులో ఉన్న వారే అడుగు తీసి అడుగు వేయాలంటే ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది వయసుతో పాటే చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ పోయారు జపాన్‌కు చెందిన బామ్మ కేన్‌ తనకా. 2019లో ‘ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ’గా గిన్నిస్‌బుక్‌....

Updated : 26 Apr 2022 20:05 IST

(Photo: guinnessworldrecords.com)

వయసులో ఉన్న వారే అడుగు తీసి అడుగు వేయాలంటే ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది వయసుతో పాటే చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ పోయారు జపాన్‌కు చెందిన బామ్మ కేన్‌ తనాకా. 2019లో ‘ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ’గా గిన్నిస్‌బుక్‌ రికార్డు సృష్టించిన ఆమె.. తన 119వ ఏట వయోభారంతో తాజాగా తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తన జీవనశైలి పాఠాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన ఆమె గురించి, ఆమె ఆహారపుటలవాట్ల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

* కేన్‌ తనాకా 1903లో జన్మించారు. తొమ్మిదిమంది తోబుట్టువుల్లో ఆమెది ఏడో స్థానం. నెలలు నిండక ముందే జన్మించిన (ప్రి-మెచ్యూర్‌ బేబీ) ఆమె బతుకుతుందో లేదో అనుకున్నారట ఆమె తల్లిదండ్రులు. కానీ 119 ఏళ్లు జీవించి.. ‘ప్రపంచంలోనే వృద్ధ మహిళ’గా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించారామె.

* కేన్‌కు 19వ ఏట పెళ్లైంది. భర్త, కొడుకు రెండో చైనా-జపాన్ యుద్ధానికి వెళ్లగా, ఈమె నూడుల్స్‌ విక్రయించి కుటుంబాన్ని పోషించేది. మరోవైపు కిరాణా కొట్టు కూడా నిర్వహించేది. 103 ఏళ్లు వచ్చే వరకు ఆ షాపు బాధ్యతలు తనే స్వయంగా చూసుకోవడం విశేషం.

* చిన్నప్పటి నుంచి ఉదయం 6 గంటలకు నిద్రలేచి తన పనులు పూర్తి చేసుకోవడం ఈ బామ్మకు అలవాటు. చనిపోవడానికి ముందు వరకూ ఇదే దినచర్యను కొనసాగించిందామె.

* పాఠశాల స్థాయి నుంచే గణితంపై ప్రేమ పెంచుకున్న కేన్‌.. ఏమాత్రం ఖాళీ దొరికినా గణితాంశాలను నేర్చుకునేదాన్నని, చిన్న చిన్న లెక్కల్ని మనసులోనే చేస్తుంటానని ఓ సందర్భంలో పంచుకున్నారు.

* మానసికంగా ఆమెకున్న ఈ చురుకుదనమే ఈ బామ్మ మెదడును నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేసిందని చెప్పచ్చు. అలాగే ఖాళీ సమయాల్లో పజిల్స్‌ పూర్తి చేస్తుండేవారు ఈ బామ్మ గారు.

* చాక్లెట్‌, పండ్లరసాన్ని తీసుకోందే ఈ బామ్మకు రోజు గడిచేది కాదట.

* కంటి నిండా నిద్రపోవడంతో పాటు ఏ సమస్యనైనా సానుకూలంగా ఆలోచించి, పరిష్కరించడం ఈ బామ్మకు అలవాటు. ఇదే ఆమెను అనునిత్యం పాజిటివిటీతో ఉండేలా చేసిందని చెబుతుంటారు ఆమె కుటుంబ సభ్యులు.

* పులియబెట్టిన ఆహార పదార్థాలు, వేర్లు, ఆకుకూరలు, చేపలు.. వంటి పౌష్టికాహారం ఎక్కువగా తీసుకునే వారీ జపాన్‌ బామ్మ. ఇవే తనను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఉంచుతున్నాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

* సాధారణంగా మనకు బాగా నచ్చిన ఆహారమైతే ఓ ముద్ద ఎక్కువగానే లాగిస్తుంటాం. కానీ ఈ బామ్మ గారు ఇందుకు పూర్తి విరుద్ధం. ఈ క్రమంలో ఎంత ఇష్టమైన ఫుడ్‌ అయినా సరే 80 శాతం కడుపు నిండగానే ఆపేసేవారట!

* మనసునెప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడమే తన సంతోషానికి కారణమని చెప్పేవారీ బామ్మ.

* తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన ఆమె.. స్పానిష్‌ ఫ్లూ, కొవిడ్‌-19.. వంటి మహమ్మారుల్నీ అలవోకగా జయించారు. అంతేకాదు.. తన 35వ ఏట పారాటైఫాయిడ్‌ జ్వరం, 45వ ఏట పాంక్రియాటిక్‌ క్యాన్సర్, 103వ ఏట కొలొరెక్టల్  క్యాన్సర్‌.. వంటి జబ్బుల్నీ జయించారు. వయోభారంతో ఉన్నా వీటన్నింటినీ జయించగలిగారంటే ఇందుకు ఆమె పాటించిన ఆరోగ్యకరమైన జీవనశైలే కారణం అని చెప్పచ్చు.

* తాజాగా తన 119వ ఏట కన్నుమూసిన ఈ బామ్మ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తుల్లో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానం ఫ్రాన్స్‌కు చెందిన జియాన్నే లూయీస్‌ కాల్మెట్‌ అనే బామ్మ పేరున ఉంది. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించారు.

‘నిత్యం సంతోషంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చాలు.. వందేళ్లు తేలికగా బతికేయొచ్చు..’ అని నిరూపించిన ఈ బామ్మ.. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాటించిన ఆరోగ్య సూత్రాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్