‘ఇస్త్రీ వద్దు.. ముడతలు మంచివే’ నంటూ..!

‘క్యాజువల్‌ ఫ్రైడే’ గురించి మనకు తెలిసిందే! కొన్ని కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి శుక్రవారం క్యాజువల్‌ దుస్తులు ధరించే వెసులుబాటు కల్పిస్తాయి. మరి, ‘WAH Mondays’ గురించి మీకు తెలుసా? ప్రతి సోమవారం ఇస్త్రీ లేని దుస్తులు ధరించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.

Published : 09 May 2024 13:02 IST

(Photos: Twitter)

‘క్యాజువల్‌ ఫ్రైడే’ గురించి మనకు తెలిసిందే! కొన్ని కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి శుక్రవారం క్యాజువల్‌ దుస్తులు ధరించే వెసులుబాటు కల్పిస్తాయి. మరి, ‘WAH Mondays’ గురించి మీకు తెలుసా? ప్రతి సోమవారం ఇస్త్రీ లేని దుస్తులు ధరించడం ఈ రోజు ముఖ్యోద్దేశం. ప్రముఖ పరిశోధన సంస్థ ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)’ తాజాగా ఈ కార్యక్రమానికి నాంది పలికింది. తమ ఉద్యోగులు ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులతోనే ఆఫీస్‌కి రావాలని కోరుతోంది. ఇదంతా ఎందుకనేగా మీ సందేహం? పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందీ సంస్థ. సీఎస్‌ఐఆర్‌ మొదటి మహిళా డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌ కలైసెల్వి ఆధ్వర్యంలో ఈ ఎకో-ఫ్రెండ్లీ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌ గురించి ఆమె ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఈ క్రమంలోనే ఎవరికి వారు వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లు స్వీకరించడంతో పాటు.. పలు సంస్థలూ ఈ దిశగా కృషి చేస్తున్నాయి.. వివిధ ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి.  ఇదేవిధంగా సీఎస్‌ఐఆర్‌ కూడా తమ వంతుగా పర్యావరణాన్ని సంరక్షించేందుకు మే 1-15 వరకు ‘స్వచ్ఛతా పఖ్వాడా’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా పర్యావరణానికి కలిగే హానిని కొంతవరకైనా తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రారంభించిందే ‘WAH Mondays’ ప్రోగ్రామ్. WAH అంటే ‘Wrinkles Acche Hai (ముడతలు మంచివే)’ అని అర్థం.

ఇస్త్రీ వద్దు.. ముడతలే ముద్దు!

ఇలా ప్రతి సోమవారం తమ ఉద్యోగులు ఇస్త్రీ చేయని దుస్తులు ధరించడం వల్ల వ్యక్తిగతంగా 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలను ఆపొచ్చని అంటున్నారు ఈ కార్యక్రమ రూపకర్త, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ కలైసెల్వి.

‘ప్రతి సోమవారం మా సంస్థ ఉద్యోగులు ఇస్త్రీ చేయని దుస్తులు ధరించేలా మేం ప్రోత్సహిస్తున్నాం. ఒక జత దుస్తులు ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుంది. అదే ఆ జత బట్టలు అలాగే ధరిస్తే ఆ వాయువు విడుదల కాదు.. తద్వారా పర్యావరణం కలుషితం కాదు. ఇలా ఒక్కొక్కరుగా మా ఉద్యోగులంతా ‘వాహ్‌ మండేస్’ కార్యక్రమంలో భాగమవడం వల్ల పర్యావరణాన్ని కొంతవరకైనా సంరక్షించుకోగలుగుతాం..’ అంటున్నారామె.

ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో సీఎస్‌ఐఆర్‌ పలు ప్రామాణిక కార్యాచరణ విధివిధానాల్ని రూపొందించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రయోగశాలల్లో వీటిని అమలు చేస్తున్నారు. పని ప్రదేశంలో విద్యుత్‌ ఛార్జీల్ని పది శాతం తగ్గించాలన్నది కూడా ఈ లక్ష్యాల్లో ఒకటి. ఈ క్రమంలో సిబ్బందిలో సైతం ఈ దిశగా అవగాహన పెంపొందించడానికి ‘వాహ్‌ మండేస్’ని ప్రారంభించారు. ఇక ఈ విధివిధానాలన్నీ ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మధ్య కాలంలో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నారట! ఇవే కాదు.. ఏప్రిల్‌ 22న ‘ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా దిల్లీలోని తమ కేంద్ర కార్యాలయంలో అతిపెద్ద క్లైమేట్‌ క్లాక్‌ను ఏర్పాటుచేసిందీ సంస్థ. ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పుల గురించి ఇది గ్రాఫ్‌ రూపంలో వివరిస్తుంది. ఈ కార్యక్రమాలన్నిటి వెనక సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి కీలక పాత్ర పోషిస్తున్నారు.


టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి..!

సీఎస్‌ఐఆర్‌.. దేశంలోనే అతిపెద్ద పరిశోధన-అభివృద్ధి సంస్థ ఇది. దాదాపు 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థకు తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌గా 2022లో బాధ్యతలందుకున్నారు కలైసెల్వి. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి కనబరిచిన ఆమె.. సైన్స్‌పై తనకున్న ఆసక్తితోనే స్టెమ్‌ రంగాన్ని ఎంచుకున్నానని చెబుతున్నారు.

‘అది ఆకైనా, పక్షి ఈకైనా, సీతాకోకచిలుకైనా.. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణినీ పర్యావరణహితంగా చూడడం నాకు చిన్న వయసు నుంచే అలవాటు! ఉపన్యాస, వ్యాసరచన, కవితలు.. ఇలా స్కూల్లో జరిగే ప్రతి పోటీలో ప్రకృతికి సంబంధించిన అంశాల్నే ఎంచుకునేదాన్ని. ఎదిగే కొద్దీ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంపై ఆసక్తి ఏర్పడుతుంది. అలా నాకు సైన్స్‌పై మక్కువ పెరిగింది. అదే నన్ను స్టెమ్‌ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది..’ అంటారు కలైసెల్వి. తిరునల్వేలిలోని ‘ప్రభుత్వ మహిళా ఆర్ట్స్‌ కళాశాల’లో సైన్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఇటు డిగ్రీలో, అటు ఎమ్మెస్సీలో యూనివర్సిటీ ర్యాంకర్‌గా నిలిచారు. ఆపై ‘సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ’లో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె.. తొలుత టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 1997లో ‘CSIR-CECRI’లో చేరారు.

ఆ బ్యాటరీల అభివృద్ధిలో!

2019లో ఈ సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎలక్ట్రో కెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
‘అనుకోకుండా పీజీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నా. నిజానికి ఇది నాకు ఎలక్ట్రో కెమికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో పరిశోధన-అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు దోహదం చేసింది. ఇక CSIR-CECRIలో చేరాక బ్యాటరీలపై పరిశోధనలు చేసే అవకాశం దొరికింది. నేను ఈ సంస్థలో చేరినప్పుడు లిథియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీ ప్రారంభ దశలో ఉంది. ఎలక్ట్రోడ్‌ స్థాయిలో ఇందులో లోతైన అధ్యయనాలు చేసి ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ప్రస్తుతం మన దేశంలో 80 శాతం ఫోన్లలో లిథియం అయాన్‌ బ్యాటరీలే ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఈ-మొబిలిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం..’ అంటున్నారీ శాస్త్రవేత్త. ఎలక్ట్రో కెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీలు తదితర అంశాలపై 125 పరిశోధన పత్రాల్ని సమర్పించిన ఆమె.. ఆరు పేటెంట్లనూ పొందారు.

అమ్మాయిల్ని ప్రోత్సహించాలి!

ప్రస్తుతం లింగ అసమానతలు ఎక్కువగా ఉన్న రంగాల్లో స్టెమ్‌ కూడా ఒకటి. అయితే ఈ అసమానతలు తొలగాలంటే ఈ రంగంలో అమ్మాయిల్ని మరింతగా ప్రోత్సహించాలంటున్నారు కలైసెల్వి.

‘నేను స్టెమ్‌లోకి రావడానికి నాకు రోల్‌మోడల్స్‌ అంటూ ఎవరూ లేరు. టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ రంగంలోకి వచ్చాను. కానీ ఇప్పుడు దేశంలో మహిళా సైంటిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీళ్లను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయినా ఈ రంగంలో లింగ సమానత్వం సాధించాలంటే ఈ దిశగా అమ్మాయిల్ని మరింత ప్రోత్సహించాలి. ఇందుకోసం ఆయా విద్యాసంస్థలు, రీసెర్చ్‌ ల్యాబులు మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలి. మరోవైపు ప్రభుత్వం కూడా అమ్మాయిల్ని ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్స్‌, పథకాలు అమలు చేయాలి. అలాగే చిన్న వయసు నుంచే అమ్మాయిల్ని పర్యావరణ పరిరక్షణలో భాగం చేయాలి. వీటన్నింటికి తోడు అమ్మాయిలు తమకు నచ్చిన రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునేలా తల్లిదండ్రులూ ప్రోత్సహించాలి. అప్పుడే ఈ రంగంలో లింగ సమానత్వం సాధ్యమవుతుంది..’ అంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్